ఇంగ్లండ్ మాజీ ఆటగాడు అలెక్స్ హేల్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో విధ్వంసం సృష్టించాడు. సెయింట్ లూసియా కింగ్స్‌తో నిన్న (సెప్టెంబర్ 17) జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో (57 బంతుల్లో 119 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న జమైకా తల్లావాస్ 122 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తల్లావాస్.. హేల్స్ శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆఖర్లో కెప్టెన్ ఇమాద్ వసీం (24 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో తల్లావాస్ 200 పరుగుల మార్కును తాకింది. వీరిద్దరు మినహా తల్లావాస్ ఇన్నింగ్స్‌లో అంతా విఫలమయ్యారు. కిర్క్ మెకెంజీ 3, స్టీవెన్ టేలర్ 14, షమార్ బూక్స్ 13, ఫేబియన్ అలెన్ ఒక్క పరుగు చేసి నిరాశపరిచారు. లూసియా కింగ్స్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 2, అల్జరీ జోసఫ్, మాథ్యూ ఫోర్డ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్.. క్రిస్ గ్రీన్ (4-0-15-4), మహ్మద్ అమీర్ (2-0-7-2), ఇమాద్ వసీం (4-1-24-2), హేడెన్ వాల్ష్ (4-0-17-1) ధాటికి 15 ఓవర్లలో 79 పరుగులకు కుప్పకూలింది. లూసియా కింగ్స్ ఇన్నింగ్స్‌లో భానుక రాజపక్ష (22), అల్జరీ జోసఫ్ (10), మాథ్యూ ఫోర్డ్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్లు రోస్టన్ ఛేజ్ 5, సీన్ విలియమ్స్ 0, సికందర్ రజా 3, కొలిన్ మున్రో 4 నిరాశపరిచారు.
రోహిత్, రాహుల్ రికార్డు సమం చేసిన అలెక్స్ హేల్స్
లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన హేల్స్ తన టీ20 కెరీర్‌లో 6వ శతకాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను టీ20ల్లో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. టీ20ల్లో హేల్స్‌తో పాటు టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, డికాక్, రిలీ రొస్సో, మార్టిన్ గప్తిల్, జేసన్ రాయ్, షేన్ వాట్సన్, జోస్ బట్లర్‌లు ఆరు సెంచరీలు చేశారు.
ఈ జాబితాలో క్రిస్ గేల్ 22 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 10 శతకాలతో రెండో స్థానంలో, క్లింగర్, వార్నర్, కోహ్లి, ఫించ్ 8 శతకాలతో మూడో స్థానంలో, లూక్ రైట్, బ్రెండన్ మెక్‌కల్లమ్ 7 సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నారు.
బౌండరీల విషయంలో ఎవరికీ అందనంత ఎత్తులో..
టీ20ల్లో అత్యధిక బౌండరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అలెక్స్ హేల్స్ టాప్‌లో ఉన్నాడు. హేల్స్ 416 మ్యాచ్‌ల్లో 1285 బౌండరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. హేల్స్ తర్వాత వార్నర్ 1180 ఫోర్లతో రెండో స్థానంలో ఉండగా.. గేల్ 1132 ఫోర్లతో మూడో ప్లేస్‌లో, ధవన్ (1090) నాలుగులో, ఫించ్ (1089) ఐదులో, జేమ్స్ విన్స్ (1069) ఆరులో, విరాట్ కోహ్లి (1069) ఏడో స్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment