
టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-1లో భాగంగా ఇవాళ (నవంబర్ 1) జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఓపెనర్లు జోస్ బట్లర్ (47 బంతుల్లో 73; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), అలెక్స్ హేల్స్ (40 బంతుల్లో 52; 7 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని (తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం) సద్వినియోగం చేసుకోలేకపోయిన ఇంగ్లండ్.. భారీ స్కోర్ సాధించడంలో విఫలమైంది. బట్లర్, హేల్స్, లివింగ్‌స్టోన్ (20) మినహా మిగతావారెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. మొయిన్ అలీ (5), హ్యారీ బ్రూక్ (7), బెన్ స్టోక్స్ (8).. అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గూసన్ 2 వికెట్లు పడగొట్టగా.. సౌథీ, సాంట్నర్, సోధి తలో వికెట్ దక్కించుకున్నారు.