T20 WC 2022 ENG VS NZ: సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. బ్రిస్బేన్ వేదికగా ఇవాళ (నవంబర్ 1) జరిగిన గ్రూప్-1 మ్యాచ్‌లో బట్లర్ సేన్ న్యూజిలాండ్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొంది, సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్‌లో జోస్ బట్లర్ (47 బంతుల్లో 73; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), అలెక్స్ హేల్స్ (40 బంతుల్లో 52; 7 ఫోర్లు, సిక్స్).. ఆతర్వాత బౌలింగ్‌లో సామ్ కర్రన్ (2/26), క్రిస్ వోక్స్ (2/33), మార్క్ వుడ్ (1/25), బెన్ స్టోక్స్ (1/10) చెలరేగడంతో ఇంగ్లండ్ ప్రత్యర్ధిపై పైచేయి సాధించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ మెరుపు అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని (తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం) సద్వినియోగం చేసుకోలేకపోయిన ఇంగ్లండ్.. భారీ స్కోర్ సాధించడంలో విఫలమైంది. బట్లర్, హేల్స్, లివింగ్‌స్టోన్ (20) మినహా మిగతావారెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా సాధించలేకపోయారు.
అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (40), గ్లెన్ ఫిలిప్స్ (36 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) జోడీ ఓ దశలో గెలుపుపై ఆశలు చిగురించేలా చేసింది. అయితే వీరిద్దరూ ఔట్ కావడంతో కివీస్ ఓటమి దిశగా పయనించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కీలక బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఫిన్ అలెన్ (16), డెవాన్ కాన్వే (3), జేమ్స్ నీషమ్ (6), డారిల్ మిచెల్ (3) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో సాంట్నర్ (16 నాటౌట్), సోధి (6 నాటౌట్) జట్టును గెలిపించేందకు ప్రయత్నించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఈ విజయంతో ఇంగ్లండ్ (4 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు, 0.547).. న్యూజిలాండ్‌తో (4 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు, 2.233) సమానంగా నిలిచి గ్రూప్-1 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ గ్రూప్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో పాటు ఆస్ట్రేలియా (4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) కూడా 5 పాయింట్లతో సమానంగా ఉంది. అయితే రన్‌రేట్ పరంగా చూస్తే ఆసీస్ (-0.304).. కివీస్, ఇంగ్లండ్‌ల తర్వాత స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment