ఇంగ్లండ్ కు మరో ఎదురుదెబ్బ
కోల్‌కతా: భారత్‌తో మూడో వన్డేకు ముందు ఇంగ్లండ్ కు ఎదురు దెబ్బ తగిలింది. చేతి గాయం కారణంగా ఓపెనర్ అలెక్స్ హేల్స్ మిగతా సిరీస్‌కు దూరమయ్యాడు. కటక్‌లో జరిగిన రెండో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ హేల్స్ గాయపడ్డాడు. ఆదివారం ఇక్కడ జరగనున్న మూడో వన్డేకు హేల్స్ అందుబాటులో ఉండడని టీం మేనేజ్‌మెంట్ తెలిపింది. రెండో వన్డేలో భారత మాజీ కెప్టెన్ మహేందర్‌సింగ్ ధోని క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అతని చేతికి గాయమైంది.
గాయం తీవ్రత దృష్ట్యా హేల్స్ శనివారం ఉదయం ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లాడు. ఆదివారం జరగనున్న మూడో వన్డేలో హేల్స్ స్థానంలో జాసన్ రాయ్‌తో కలిసి సామ్ బిల్లింగ్స్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వికెట్ కీపర్ జాని బెయిర్‌స్టో కూడా అందుబాటులో ఉన్నాడు. వీరిద్దరిలో ఎవరికి అవకాశం కల్పిస్తారో వేచి చూడాల్సిందే.