అలెక్స్ హేల్స్ 'లార్డ్స్' రికార్డులు
లార్డ్స్:ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు అలెక్స్ హేల్స్ పలు రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రాయల్ లండన్ వన్డే కప్ లో భాగంగా నాటింగ్షైర్ తరపున బరిలోకి దిగిన హేల్స్ శనివారం జరిగిన ఫైనల్లో అజేయంగా 187 పరుగులు చేశాడు. తద్వారా కొన్ని రికార్డుల్ని సాధించాడు. కౌంటీ మ్యాచ్ ఫైనల్లో లార్డ్స్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన రికార్డును నమోదు చేశాడు.
దాంతో పాటు ఈ స్టేడియంలో లిస్ట్-ఎ మ్యాచ్ ల్లో అత్యధిక స్కోరును సాధించిన ఆటగాడిగా కూడా హేల్స్ నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ బూన్(166) రికార్డును హేల్స్ సవరించాడు. 1989 లో లార్డ్స్ లో ఎంసీసీతో జరిగిన లిస్ట్-ఎ మ్యాచ్ లో బూన్ అత్యధిక వ్యక్తిగత పరుగుల్ని సాధించాడు. ఆపై ఇంతకాలానికి హేల్స్ దాన్ని బద్ధలు కొట్టాడు.
మరొకవైపు ఇంగ్లండ్ తరపున అత్యధిక వన్డే పరుగుల్ని నమోదు చేసిన తన పాత రికార్డును సవరించుకున్నాడు. గత సీజన్లో నాటింగ్హామ్లో పాకిస్తాన్ తో జరిగిన వన్డేలో హేల్స్ 171 పరుగులు చేశాడు. అదే ఇంగ్లండ్ నుంచి ఇప్పటివరకూ అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు. ఆ తర్వాత ఏడాది కాలంలో ఆ రికార్డును హేల్సే సవరించడం ఇక్కడ విశేషం. రాయల్ లండన్ వన్డే కప్లో నాటింగ్షైర్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ ను కైవసం చేసుకుంది. సర్రేతో జరిగిన మ్యాచ్ లో నాటింగ్షైర్ ఇంకా రెండు ఓవర్లకు పైగా ఉండగానే గెలుపొందింది.