
లండన్: ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ ముంగిట... ఆతిథ్య ఇంగ్లండ్‌కు కొంత ఇబ్బందికర పరిణామం. ఉత్తేజిత మాదక ద్రవ్యాలు (రిక్రియేషనల్ డ్రగ్స్) వినియోగించినట్లు తేలడంతో డాషింగ్ బ్యాట్స్‌మన్ అలెక్స్ హేల్స్ 15 మంది సభ్యుల ఇంగ్లండ్ ప్రపంచ కప్ బృందం నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. దీంతోపాటు మే 3న ఐర్లాండ్‌తో జరుగనున్న ఏకైక వన్డేతో పాటు, మే 5 నుంచి పాకిస్తాన్‌తో ప్రారంభం కానున్న ఒక టి20, ఐదు వన్డేల సిరీస్‌కూ అతడిని జట్టు నుంచి తప్పించారు. ఏటా సీజన్ ప్రారంభ, ముగింపునకు ముందు ఇంగ్లండ్ పురుషుల ప్రొఫెషనల్ క్రికెటర్లు, సెంట్రల్ కాంట్రా క్టు మహిళా క్రికెటర్లకు ‘వెంట్రుక కుదుళ్ల’ ఆధారంగా డోప్ పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో రెండోసారీ పాజిటివ్‌గా రావడంతో హేల్స్‌పై గత వారమే 21 రోజుల నిషేధం పడింది. అప్పుడే రాయల్ లండన్ కప్ నుంచి పక్కన పెట్టారు. ‘కీలక సమయంలో అనవసర విషయాలకు తావివ్వకుండా, జట్టులో సరైన వాతావరణం నెలకొల్పేందుకు ఈ చర్య తీసుకున్నాం. దీనిపై తీవ్రంగా, సుదీర్ఘంగా చర్చించాం. జట్టుకు ఏది మేలు చేస్తుందో అదే చేశాం. దీంతోనే హేల్స్ కెరీర్ ఏమీ ముగిసిపోదు. అతడికి కావాల్సిన సాయం అందిస్తాం’ అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎండీ, పురుషుల క్రికెట్ డైరెక్టర్ ఆష్లే గైల్స్, ఆ దేశ సెలెక్షన్ కమిటీ హెడ్ ఎడ్ స్మిత్ ప్రకటన జారీ చేశారు.
ఇది
రెండోసారి...
‘హార్డ్ హిట్టర్’ అయిన 30 ఏళ్ల హేల్స్ క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొనడం రెండేళ్లలో ఇది రెండోసారి. సహచర క్రికెటర్ బెన్ స్టోక్స్‌తో కలిసి 2017 సెప్టెంబరులో బ్రిస్టల్‌లో ఓ నైట్ క్లబ్ వద్ద వ్యక్తిపై తీవ్రంగా దాడి చేసిన ఘటనలో హేల్స్‌పై ఆరు మ్యాచ్‌ల నిషేధం, జరిమానా విధించారు. బ్రిస్టల్ ఉదంతంతో హేల్స్ కెరీర్ ఇబ్బందుల్లో పడగా, అతడి స్థానాన్ని బెయిర్‌స్టో, జాసన్ రాయ్ భర్తీ చేశారు. అయితే, గతేడాది జూన్‌లో ఆస్ట్రేలియాతో ట్రెంట్‌బ్రిడ్జ్ వన్డేలో హేల్స్ 92 బంతుల్లోనే 147 పరుగులు బాది ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు స్కోరు (481) చేయడంలో కీలకపాత్ర పోషించాడు. తద్వారా విస్మరించలేని ఆటగాడయ్యాడు. హేల్స్ ఇంగ్లండ్ తరఫున 11 టెస్టులు, 70 వన్డేలు, 60 టి20లు ఆడాడు. మరోవైపు భుజం గాయంతో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సామ్ బిల్లింగ్స్ ఇప్పటికే జట్టుకు దూరమయ్యాడు. హేల్స్‌ను తప్పించిన నేపథ్యంలో జేమ్స్ విన్స్‌కు చోటు దక్కే వీలుం ది. ప్రపంచ కప్‌నకు తుది 15 మందిని ప్రకటించేందుకు అన్ని దేశాల జట్లకు మే 23 వరకు గడువు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment