క్రికెటర్‌ హేల్స్‌కు కరోనా?  | Cricketer Alex Hales Got Symptoms Of Coronavirus | Sakshi
Sakshi News home page

క్రికెటర్‌ హేల్స్‌కు కరోనా? 

Published Wed, Mar 18 2020 2:03 AM | Last Updated on Wed, Mar 18 2020 3:54 AM

Cricketer Alex Hales Got Symptoms Of Coronavirus - Sakshi

కరాచీ: కరోనా వైరస్‌తో ప్రపంచమే ఆగిపోయింది. ఆటలన్నీ వాయిదా పడినా... లీగ్‌ దశ దాకా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) నిర్విరామంగా సాగింది. మంగళవారం రెండు సెమీస్‌ మ్యాచ్‌లు, బుధవారం ఫైనల్‌తో ఈ లీగ్‌కు శుభం కార్డు పడాల్సివుంది. అయితే ఈ ‘మహమ్మారి’ బారిన ఓ విదేశీ క్రికెటర్‌ పడటంతో లీగ్‌ అర్ధాంతరంగా వాయిదా పడింది. ఇంగ్లండ్‌ ప్లేయర్‌ అలెక్స్‌ హేల్స్‌కు కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలియడంతో సెమీస్, ఫైనల్స్‌ పోటీల్ని వాయిదా వేస్తున్నట్లు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సీఈఓ వసీమ్‌ ఖాన్‌ తెలిపారు. ‘పాక్‌ నుంచి తిరుగుముఖం పట్టిన హేల్స్‌ తనకు కరోనా లక్షణాలున్నట్లు మాకు సమాచారమిచ్చాడు. దీంతో పలు వర్గాలతో సంప్రదింపులు జరిపాక లీగ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించాం’ అని ఆయన చెప్పారు.

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ రమీజ్‌ రజా మాట్లాడుతూ లీగ్‌ మొదలైనప్పటినుంచి ఎలాంటి అనుమానిత కేసులు లేకపోవడంతో సజావుగానే సాగిందని, కానీ 31 ఏళ్ల హేల్స్‌కు కరోనా లక్షణాలు బయటపడటంతో కలకలం రేగిందని... ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పుడు పీఎస్‌ఎల్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయనున్నామని ఆయన చెప్పారు. పీఎస్‌ఎల్‌లో మొత్తం 34 మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొన్నారు. వారంతా కరోనా భయాందోళనలతో ఇదివరకే స్వదేశాలకు చేరారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఒప్పందాలు, వ్యవహారాలను పక్కనబెట్టి వెళ్లాలనుకున్నవారిని పంపించామని రమీజ్‌ రజా తెలిపారు.

పాకిస్తాన్‌లోనూ కరోనా కేసులు నమోదు కావడంతో బంగ్లాదేశ్‌తో వచ్చే నెలలో జరగాల్సిన వన్డే, టెస్టు సిరీస్‌లను పీసీబీ రద్దు చేసింది. అలాగే ఈ నెల 25 నుంచి జరగాల్సిన నేషనల్‌ వన్డే కప్‌ను కూడా సస్పెండ్‌ చేసింది. ఇంగ్లండ్‌ చేరుకున్న అనంతరం హేల్స్‌ తన స్పందన తెలియజేశాడు. తాను ఇంకా కరోనా పరీక్షలకు హాజరు కాలేదని, పాజిటివ్‌ అంటూ వచ్చిన వార్తల్లో కూడా నిజం లేదని స్పష్టం చేశాడు. అయితే జ్వరంతో పాటు సాధారణం కంటే భిన్నమైన లక్షణాలు తనలో  కనిపించడంతో ముందు జాగ్రత్తగా అందరికీ దూరంగా ఉంటున్నట్లు అతను వెల్లడించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement