అలెక్స్ హేల్స్, బెయిర్‌స్టో
నాటింగ్‌హామ్: 50 ఓవర్లలో 41 ఫోర్లు, 21 సిక్సర్లతో ఏకంగా 481 పరుగులు... ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సొంతగడ్డపై సృష్టించిన వీర విధ్వంసం ఇది. ఆస్ట్రేలియాపై సునామీలా విరుచుకుపడిన మోర్గాన్ సేన వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మంగళవారం జరిగిన డే–నైట్ మూడో వన్డేలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 481 పరుగులు చేసింది. ఫలితంగా ఇప్పటి వరకు తమ పేరిటే ఉన్న 444 పరుగుల (2016లో పాకిస్తాన్‌పై) రికార్డును తుడిచి పెట్టింది. అలెక్స్ హేల్స్ (92 బంతుల్లో 147; 16 ఫోర్లు, 5 సిక్సర్లు), జాన్ బెయిర్‌స్టో (92 బంతుల్లో 139; 15 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకాలతో విరుచుకు పడగా... జేసన్ రాయ్ (61 బంతుల్లో 82; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇయాన్ మోర్గాన్ (30 బంతుల్లో 67; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో తమ వంతు పాత్ర పోషించారు.
మ్యాచ్‌లో మూడు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు కావడం విశేషం. ఇంగ్లండ్ ధాటికి ఆసీస్ బౌలర్లలో టై అత్యధికంగా 100 పరుగులు సమర్పించుకోగా, రిచర్డ్సన్ 92, స్టొయినిస్ 85 పరుగులు ఇచ్చారు. 46 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 450 వద్ద నిలిచింది. బ్యాటింగ్ జోరు చూస్తే స్కోరు 500 పరుగులు దాటుతుందని అనిపించింది. అయితే చివరి నాలుగు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా లేకుండా 31 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆసీస్... వరుస బంతుల్లో హేల్స్, మోర్గాన్ వికెట్లు కూడా తీయడంతో స్కోరు 481కే పరిమితమైంది. 482 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రషిద్ (4/47) దెబ్బకు 239 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్ (51), స్టోయినీస్ (44)లు టాప్ స్కోరర్లుగా నిలిచారు. 5 వన్డేల సిరీస్‌లో 3-0తో ఇంగ్లండ్ సిరీస్ కైవసం చేసుకుంది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment