
ట్వంటీ 20 ప్రపంచకప్:ఫైనల్ కు చేరిన టీమిండియా
మిర్పూర్: అనుకున్నదే అయ్యింది. నాకౌట్ దశలో విఫలమయ్యే సఫారీలకు మరోసారి చుక్కెదురైంది. ప్రతిసారీ లీగ్ దశలో అద్భుతంగా ఆడటం.... అనంతరం తొలి మ్యాచ్‌లోనే వెనుదిరిగే అనవాయితీనే సఫారీలు కొనసాగించారు. ఎలాగైనా ఈ మ్యాచ్ ను అధిగమించి చో్కర్స్ అనే ముద్రను చెరిపేసుకోవాలనుకున్న సఫారీలకు నిరాశే ఎదురైంది. ఈ రోజు దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో సాధించి లంకేయులతో తుది పోరుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా విసిరిన 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ధోనీ సేన ఇంకా ఐదు బంతులుండగానే ఛేదించింది. టీమిండియా ఓపెనర్లు రహానే (32), రోహిత్ శర్మ(24) పరుగులతో శుభారంభానిచ్చారు. అనంతరం విరాట్ కోహ్లి(72 ) పరుగులు మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. భారత్ మిడిల్ ఆర్డర్ ఆటగాడు యువరాజ్(18) పరుగుగులకు పెవిలియన్ చేరిన దశలో టీమిండియా గెలుపుపై కాస్త సందిగ్ధత నెలకొంది. ఆ తరుణంలో క్రీజ్ లో కి వచ్చిన రైనా (21 ;10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో భారత్ గెలుపును సునాయాసం చేశాడు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో హెండ్రిక్స్, పార్నెల్, తహీర్ లకు తలో వికెట్టు లభించింది. అంతకుముందు టాస్ గెలిచిన సఫారీలు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 172 పరుగులు సాధించారు. డుప్లెసిస్ (41 బంతుల్లో 58) మెరుపు హాఫ్ సెంచరీ, డుమినీ 45 (నాటౌట్), మిల్లర్ 23 (నాటౌట్), ఆమ్లా 22 పరుగులు చేశారు. భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇన్నింగ్స్ నాలుగో బంతికే దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ (6)ను అవుట్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. కాగా భారత బౌలర్లు ఆ తర్వాత సఫారీలను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. డుప్లెసిస్ మెరుపు ఇన్నింగ్స్తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆమ్లా కాసేపు అతనికి అండగా నిలిచాడు. అశ్విన్ ఆమ్లాను క్లీన్ బౌల్డ్ చేసినా డుప్లెసిస్కు డుమినీ జతకలిశాడు. దీంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అశ్విన్ మరోసారి చెలరేగి డుప్లెసిస్, డివిలియర్స్ ను పెవిలియన్ చేర్చాడు. అయితే డుమినీ దూకుడుగా ఆడటంతో సౌతాఫ్రికా భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందుంచారు.