ఐర్లాండ్ సంచలనం
చివరి బంతి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో ఐర్లాండ్ జట్టు సంచలన విజయాన్ని అందుకుంది. జింబాబ్వే బౌలర్లు పట్టు విడవకుండా పోరాడినా ఫలితం దక్కలేదు. సోమవారం సిల్హెట్ స్టేడియంలో జరిగిన టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఐర్లాండ్ మూడు వికెట్ల తేడాతో నెగ్గింది.
దీంతో ఈ మెగా టోర్నీలోని ప్రధాన రౌండ్‌కు అర్హత సాధించేందుకు తమ మార్గాన్ని సుగమం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. బ్రెండన్ టేలర్ (46 బంతుల్లో 59; 6 ఫోర్లు; 2 సిక్స్), చిగుంబురా (13 బంతుల్లో 22 నాటౌట్; 2 సిక్స్) రాణించారు. 14 పరుగులకే తొలి వికెట్ పడగా ఓపెనర్ మసకద్జా (17 బంతుల్లో 21; 3 ఫోర్లు)తో కలిసి టేలర్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వేగంగా ఆడిన టేలర్ 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చివర్లో చిగుంబురా ధాటిగా ఆడి స్కోరును పెంచాడు. డాక్‌రెల్, మెక్ బ్రైన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఐర్లాండ్ ఏడు వికెట్లు కోల్పోయి 20వ ఓవర్ చివరి బంతికి లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్లు స్టిర్లింగ్ (34 బంతుల్లో 60; 9 ఫోర్లు; 1 సిక్స్), పోర్టర్‌ఫీల్డ్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు; 1 సిక్స్) ధాటిగా ఆడారు. ఆరో ఓవర్‌లో వరుసగా నాలుగు ఫోర్లు బాది స్టిర్లింగ్ జోరును ప్రదర్శించాడు. దీంతో 8.2 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 80 పరుగులు జత చేరాయి. స్టిర్లింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది.
చివర్లో ఉత్కంఠ
అయితే రెండు వికెట్ల నష్టానికి వంద పరుగులతో పటిష్టంగానే కనిపించిన ఐర్లాండ్ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి తడబడింది. పేసర్ పన్యంగరా (4/37) రెచ్చిపోవడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ ప్రారంభమైంది. 15వ ఓవర్‌లో తను రెండు వికెట్లు తీశాడు. అప్పటికి 30 బంతుల్లో 35 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో బరిలోకి దిగిన కెవిన్ ఓబ్రియాన్ (10 బంతుల్లో 17; 2 ఫోర్లు; 1 సిక్స్) తన సహజశైలిలో ఆడగా 12 బంతుల్లో లక్ష్యం ఏడు పరుగులకు వచ్చింది. చివరి ఓవర్‌లో నాలుగు పరుగులు రావాల్సి ఉండగా రెండు బంతుల్లో రెండు వికెట్లు పడడంతో ఐర్లాండ్ శిబిరంలో ఆందోళన నెలకొంది.
ఇక చివరి బంతికి ఒక్క పరుగు అవసరం. బంతి బ్యాట్స్‌మన్‌కు చిక్కకుండా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నేరుగా వికెట్లను గిరాటేసేందుకు టేలర్ ప్రయత్నించి విఫలమయ్యాడు. విజయానికి కావాల్సిన సింగిల్‌ను ఐర్లాండ్ సాధించడంతో మ్యాచ్ ముగిసింది.