ఇంగ్లండ్‌కు డచ్ షాక్
45 పరుగుల తేడాతో విజయం
టి20 ప్రపంచకప్
చిట్టగాంగ్: టి20 ప్రపంచకప్ ప్రధాన టోర్నీని దారుణ పరాభవంతో ప్రారంభించిన నెదర్లాండ్స్ జట్టు ముగింపును మాత్రం అదరగొట్టింది. ఇంగ్లండ్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సంచలనాత్మక ఆటతీరును కనబరిచింది. బ్యాటింగ్‌లో విఫలమై స్వల్ప స్కోరే సాధించినప్పటికీ బౌలర్లు రెచ్చిపోయి బ్రాడ్ సేనకు షాకిచ్చారు. తద్వారా జహూర్ అహ్మద్ చౌధరి స్టేడియంలో సోమవారం జరిగిన గ్రూప్ ‘1’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు 45 పరుగుల తేడాతో నెగ్గింది. 2009 ప్రపంచకప్‌లోనూ ఈ జట్టు ఇంగ్లండ్‌ను మట్టికరిపించడం విశేషం. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 133 పరుగులు చేసింది. వెస్లీ బారెసి (45 బంతుల్లో 48; 2 ఫోర్లు; 2 సిక్స్), ఓపెనర్ మైబర్గ్ (31 బంతుల్లో 39; 6 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచారు. రెండో వికెట్‌కు వీరిద్దరు 50 పరుగులు జోడించారు. నాలుగో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన బారెసి నిలకడైన ఆటతీరుతో చివరి ఓవర్‌లో వెనుదిరిగాడు. స్టువర్ట్ బ్రాడ్‌కు మూడు వికెట్లు దక్కాయి.
వికెట్లు టపటపా...
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 17.4 ఓవర్లలో 88 పరుగులు మాత్రమే చేయగలిగింది. మూడో ఓవర్ నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం తుదికంటా కొనసాగింది. పేసర్లు వాన్ బీక్ (3/9), ముదస్సర్ బుఖారి (3/12) పదునైన బంతులతో విరుచుకుపడడంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ చేష్టలుడిగిపోయింది. వీరి ధాటికి ఏకంగా ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోర్లు కూడా సాధించలేకపోయారు. రవి బొపారా (20 బంతుల్లో) చేసిన 18 పరుగులే అత్యధికం. మొత్తం ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా సిక్స్ కొట్టకపోగా 10.3 ఓవర్ల పాటు ఏ ఆటగాడు కూడా కనీసం బౌండరీ కొట్టేందుకు సాహసించలేదు. ఓవరాల్‌గా నాలుగు బౌండరీలు మాత్రమే నమోదయ్యాయంటే డచ్ ఏస్థాయిలో బౌలింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లండ్ చివరి మూడు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.