క్రికెట్ మ్యాచ్‌కు హాకీ జట్టు
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌లో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ ద్వారా బీసీసీఐ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు రావాలని భారత హాకీ జట్టుకు బీసీసీఐ ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. వీఐపీ టిక్కెట్లతో పాటు రవాణ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసింది. ఇతర క్రీడలకు సంబంధించిన మొత్తం జట్టును ఇలా మ్యాచ్ చూడటానికి బోర్డు అధికారికంగా ఆహ్వానించడం ఇదే తొలిసారి. మలేసియాలో జరగనున్న సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ కోసం హాకీ జట్టు ప్రస్తుతం బెంగళూరులో శిక్షణ శిబిరంలో పాల్గొంటుంది.
‘బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ నుంచి మాకు ఆహ్వానం వచ్చింది. ఇదో శుభ పరిణామం. మేం స్టాండ్స్‌నుంచి మన జట్టును ఉత్సాహపరుస్తాం’ అని హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ పేర్కొన్నారు. తాము బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకున్న ఠాకూర్ ఈ చొరవ తీసుకున్నారని హాకీ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది న్యూఢిల్లీలో భారత్, చెక్ రిపబ్లిక్‌ల మధ్య జరిగిన డేవిస్ కప్ మ్యాచ్ కూడా హాకీ జట్టు హాజరైంది.