‘విధ్వంసం’ ఎవరిదో! | Today T-20 World Cup Final | Sakshi
Sakshi News home page

‘విధ్వంసం’ ఎవరిదో!

Published Sat, Apr 2 2016 11:31 PM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

‘విధ్వంసం’   ఎవరిదో!

‘విధ్వంసం’ ఎవరిదో!

- బాదినోడే బాద్‌షా..
- టి20 ప్రపంచకప్ ఫైనల్ నేడు  
- వెస్టిండీస్‌తో ఇంగ్లండ్ అమీతుమీ

 
పవర్ హిట్టింగ్‌కు పర్యాయపదం వెస్టిండీస్...  సంప్రదాయక దూకుడుకు నిలువుటద్దం ఇంగ్లండ్...  ప్రత్యర్థులు పటిష్టంగా ఉన్నా...  పరిస్థితులు ప్రతికూలంగా మారినా...  ఊహించని రీతిలో ఈ రెండు జట్లు  టి20 ప్రపంచకప్‌లో జోరు చూపాయి  భయం పుట్టించే భారీ షాట్లు....  అచ్చెరువొందే విన్యాసాలు... అనూహ్య మలుపులతో...  బాదుడుకు మారుపేరుగా మారిన ఈ రెండు జట్లు  ఇప్పుడు పొట్టి కప్‌లో ఫైనల్ సమరానికి సన్నద్ధమయ్యాయి.  ఈడెన్ గార్డెన్స్‌లో నేడు (ఆదివారం) ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో ఎవరు గెలిచినా రెండోసారి ట్రోఫీని సాధించిన  తొలి జట్టుగా రికార్డులకెక్కుతారు. బలం, బలహీనతల్లో రెండు జట్లూ సమానంగా ఉండటం విశేషం! కరీబియన్లకు గేల్ రాణించడం కీలకం.  ఇంగ్లండ్ మాత్రం రాయ్, రూట్‌లను నమ్ముకుంది. 

టి20 ప్రపంచకప్ జరుగుతోంది భారత్‌లో... బ్యాటింగ్‌కు స్వర్గధామంలాంటి పిచ్‌లు, స్పిన్‌తో చెలరేగిపోయే బౌలర్లు... టోర్నీ ఇలాగే సాగుతుందని అంతా భావించారు. ఈ వికెట్‌లపై ఉపఖండపు జట్లకే అనుకూలత ఉంటుందని అంతా అనుకుంటే అలాంటి జట్టే లేకుండా తుది పోరు జరగబోతోంది. ఈ గడ్డపై ఒక్కసారి కూడా ఆడని 10 మందిని  తీసుకొచ్చి కూడా ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరితే... ఐపీఎల్ అనుభవాన్నంతా రంగరించి విండీస్ సత్తా చాటింది.


సాంప్రదాయ, కళాత్మక ఆటను కాదు... ఇరు జట్లు దూకుడైన బ్యాటింగ్‌నే నమ్ముకున్నాయి. బౌలర్ ఎవరైనా, పిచ్ ఎలాంటిదైనా ఎదురుదాడితోనే ఫలితం సాధించాలనే తరహాలోనే ఆడాయి. అందుకే ఇతర జట్లను వెనక్కి తోసి ఈ రెండు టీమ్‌లు ఫైనల్‌కు చేరాయి. ఒకరిని మించి మరొకరు హిట్టర్లు ఉన్న జట్లలో చివరకు పైచేయి ఎవరిది...? ఎవరు విధ్వంసం సృష్టించి విశ్వాన్ని జయిస్తారో, ఎవరు విధ్వంసం బారిన పడతారో ఈడెన్‌లో నేడు తేలిపోనుంది.

 

కోల్‌కతా   ప్రపంచకప్ ఫైనల్‌కు చేరే క్రమంలో వెస్టిండీస్ జట్టు బ్యాట్స్‌మెన్ 36 సిక్సర్లు బాదితే... ఇంగ్లండ్ ఆటగాళ్లు 34 కొట్టారు. మరే జట్టు కూడా కనీసం 30 సిక్స్‌లు కొట్టలేదు. ఇది టోర్నమెంట్‌లో సరిగ్గా ఇరు ఫైనలిస్ట్‌ల శైలిని నిర్వచిస్తోంది. ఆటగాళ్ల గతానుభవంతో విండీస్ ఈ రీతిలో చెలరేగిపోగా... మారిపోయిన ఇంగ్లండ్ జట్టు కొత్తగా తమ ధాటిని ప్రదర్శించింది. పొట్టి ఫార్మాట్‌లో జగజ్జేతను నిర్ణయించే తుది పోరులో కూడా ఇప్పుడు ఇదే కనిపించబోతోంది. ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే టి20 ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. 2010లో ఇంగ్లండ్, 2012లో వెస్టిండీస్ ఒక్కోసారి గెలిచాయి. ఇక్కడ విజయం సాధించే జట్టు రెండోసారి టైటిల్ గెలిచిన మొదటి జట్టుగా ఘనత సాధిస్తుంది.

 
స్టార్లు వీరే: ఇంగ్లండ్ ప్రధానంగా జేసన్ రాయ్ బ్యాటింగ్‌ను నమ్ముకుంది. ఈ టోర్నీలో ఆ జట్టు తరఫున వెలుగులోకి వచ్చిన కొత్త స్టార్ అతను. బట్లర్, హేల్స్ ధాటిగా ఆడుతుండగా, జో రూట్ అద్భుతమైన ఫామ్‌తో నిలకడ చూపిస్తున్నాడు. టోర్నీలో మూడు మ్యాచ్‌లలో ఆ జట్టు భారీ స్కోర్లు నమోదు చేసింది. వెస్టిండీస్ తరఫున క్రిస్ గేల్ గురించి కొత్తగా చెప్పాల్సింది లేకపోయినా, సెమీస్‌తో సిమన్స్, రసెల్, చార్లెస్ కూడా తామేంటో చూపించారు.  బ్రేవో, స్యామీ కూడా రాణిస్తే తిరుగుండదు. విండీస్ స్పిన్నర్ బద్రీ మినహా ఇరు జట్ల తరఫున  బౌలర్ల నుంచి చెప్పుకోదగ్గ గొప్ప ప్రదర్శనలేమీ రాలేదు .

 
కెప్టెన్లు విఫలం:
తమ జట్లను నడిపించడంలో ఇరువురు కెప్టెన్లు విజయవంతమయ్యారు గానీ వ్యక్తిగతంగా జట్టుకు ఏమీ చేయలేకపోయారు. కేవలం 11 బంతులే ఆడిన స్యామీ 2 ఓవర్లే బౌలింగ్ చేశాడు. మోర్గాన్ అయితే రెండు సార్లు తొలి బంతికే అవుటయ్యాడు. అయితే ఇప్పటికే కెప్టెన్‌గా ఒక ప్రపంచకప్‌ను అందించిన స్యామీ, దిగ్గజం లాయిడ్ సరసన నిలవాలని భావిస్తుండగా... ఏడాది క్రితం బాధ్యతలు తీసుకొని ఇంగ్లండ్‌ను  మార్చిన మోర్గాన్ టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉన్నాడు. ఇంగ్లండ్ సహాయక సిబ్బందిలో ఉన్న కాలింగ్‌వుడ్ (2010లో ఇంగ్లండ్‌ను గెలిపించిన కెప్టెన్) తనకు స్ఫూర్తి అని అతను చెప్పుకొచ్చాడు.

 

మాకు బుర్ర లేదంటారా...
ఐపీఎల్ వల్ల కావచ్చు... లేదంటే వెస్టిండీస్ క్రికెటర్లు మైదానంలో చేసే సందడి కావచ్చు... కారణం ఏదైనా భారత్‌లో వెస్టిండీస్ జట్టుకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కరీబియన్ క్రికెటర్లు కూడా భారత అభిమానులతో చాలా స్నేహంగా ఉంటారు. అయితే భారత్‌తో సెమీస్ విజయం తర్వాత ఓ మీడియాలో వచ్చిన వ్యాఖ్య వారిని బాధించింది. వాళ్లు ఆడే షాట్ల గురించి చెబుతూ ‘బుర్ర తక్కువవారు’ అనే వ్యాఖ్య వచ్చింది. దీనిపై స్యామీ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఎవరైనా తోటి మనుషులను బుర్ర లేనివారని ఎలా అంటారు. ఇది మమ్మల్ని చాలా బాధించింది. ఎన్నో ఘటనలు జరిగినా ఆటపై ప్రేమతోనే మేం ఇంత బాగా ఆడగలుగుతున్నాం. మా మనసులు కూడా అందమైనవి కాబట్టి దేవుడు మా పక్షానే ఉండి ఇంత గొప్ప క్రికెట్ ఆడిస్తున్నాడు’ అని స్యామీ వ్యాఖ్యానించాడు.

 

29 ఏళ్ల తర్వాత...
ఇంగ్లండ్ జట్టు ఒక ఐసీసీ టోర్నీ ఫైనల్ కోల్‌కతాలో ఆడటం ఇది రెండో సారి. గతంలో 1987 రిలయన్స్ వన్డే వరల్డ్ కప్‌లో ఆ జట్టు ఆసీస్ చేతిలో 7 పరుగులతో ఓడింది. 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2 వికెట్లతో 135 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్... మైక్ గ్యాటింగ్ అనాలోచిత రివర్స్ స్వీప్‌తో పతనమైంది. దేశం గుండె బద్దలైంది. ఇన్నాళ్ల తర్వాత మరో ఫార్మాట్‌లో  ఈడెన్‌లో ఫైనల్ ఆడబోతోంది. జట్ల బలాబలాల గురించి ఎంతగా చెప్పుకున్నా... చివరకు అసలు బలం కనిపించేది అంకెల్లోనే. ఫైనల్లోకి అడుగు పెట్టే ముందు ఇరు జట్ల ప్రదర్శన ఎలా ఉందంటే...

 

భారత్‌లో ఇరు జట్లు ఒక్క సారి మాత్రమే  తలపడ్డాయి. అది ఈ టోర్నీ లీగ్ దశలోనే. 182 పరుగులు చేసి ఇంగ్లండ్ సంబరపడినా... క్రిస్ గేల్ (48 బంతుల్లో 100 నాటౌట్) సునామీతో విండీస్ 6 వికెట్లతో నెగ్గింది.

 

వెస్టిండీస్ ఈ ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లలోనూ టాస్ గెలవడం విశేషం. ఐదు సార్లు లక్ష్యాన్ని ఛేదించడాన్నే ఇష్టపడినా, అప్ఘన్ షాకిచ్చింది. గత ఐదు టి20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో 4సార్లు టాస్ గెలిచిన జట్టుకే గెలుపు దక్కింది.

 

ఇరు జట్ల మధ్య 13 టి20 మ్యాచ్‌లు జరిగితే వెస్టిండీస్ 9 గెలిచి 4 ఓడింది. వరల్డ్ కప్‌లోనైతే 4 సార్లూ విండీస్‌దే విజయం. టి20 చరిత్రలో విండీస్ ఇన్ని మ్యాచ్‌లు మరే జట్టుపై గెలవలేదు. ఇంగ్లండ్ ఇన్ని సార్లు ఎవరి చేతిలోనూ ఓడిపోలేదు. రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి.


టోర్నీలో ఇంగ్లండ్ జట్టు మాత్రమే ఓవర్‌కు తొమ్మిదికి పైగా పరుగులు చేసింది. ఆ జట్టు 9.12 రన్‌రేట్‌తో దూసుకువచ్చింది. విండీస్ 7.78 రన్‌రేట్‌తో పరుగులు చేయగలిగింది.


ఇంగ్లండ్ బౌలింగ్ 8.68 ఎకానమీ రేట్‌తో అన్ని జట్లకంటే చెత్త ప్రదర్శన నమోదు చేసింది. కాగా విండీస్ ఎకానమీ రేట్ 7.41.


భారత్‌పై గెలుపులో భారీ షాట్లతోనే సత్తా చాటిన విండీస్ ఈ టోర్నీలో పెద్ద సంఖ్యలో డాట్ బాల్స్ (45.44 శాతం) ఆడిన జట్టుగా నిలిస్తే, ప్రత్యర్థి ఇంగ్లండ్ (33.85 శాతం) అతి తక్కువ డాట్ బాల్స్ ఆడింది.


విండీస్ టోర్నీలో తమ స్పిన్నర్లను కూడా బాగా నమ్ముకుంది. బద్రీ, బెన్ బాగా ప్రభావం చూపించగలిగారు. ఆ జట్టు స్పిన్నర్ల ఎకానమీ రేట్ 5.73 అద్భుతంగా ఉంది. ఇంగ్లండ్ ఎంతో ఆశలు పెట్టుకున్న ఆ జట్టు స్పిన్నర్లు అలీ, రషీద్ ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ స్పిన్నర్లు అందరికంటే చెత్తగా 9.36 ఎకాన మీతో పరుగులిచ్చారు.


వెస్టిండీస్‌లో హిట్టర్లకు కొదవ లేకున్నా  చివరి వరకు ధాటిగా పరుగులు చేయగల బ్యాట్స్‌మెన్ ఇంగ్లండ్‌కూ ఉన్నారు. టోర్నీలో 15-20 ఓవర్ల మధ్య అన్ని జట్లకంటే వేగంగా ఇంగ్లండ్ (ఓవర్‌కు 12.27) పరుగులు సాధించడం విశేషం. అదే బౌలింగ్‌లో 15-20 ఓవర్ల మధ్య ఇంగ్లండ్ బౌలర్ స్టోక్స్ తరహాలో 50 శాతం డాట్ బాల్స్ ఎవరూ వేయలేకపోయారు.

 

 టోర్నీలో వెస్టిండీస్ అత్యధికంగా 65.34 శాతం పరుగులు బౌండరీల ద్వారా సాధిస్తే, ఇంగ్లండ్ 62.93 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న ఈ బౌండరీల జోరే వారిని ఫైనల్ చేర్చిందంటే అతిశయోక్తి                     కాదు.

 

పిచ్, వాతావరణం
మ్యాచ్‌కు ముందు రోజు ఇంగ్లండ్ వచ్చినప్పుడు పిచ్‌పై కాస్త పచ్చిక కనిపించినా... ఐసీసీ పిచెస్ చీఫ్ అట్కిన్సన్ సూచనలతో బాగా రోలింగ్ జరిగింది. సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్. స్పిన్ కాస్త ప్రభావం చూపించవచ్చు. అయితే మంచు కారణంగా టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఆదివారం వర్ష సూచన ఉంది. ఒకవేళ అంతరాయం కలిగినా ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది.



మా జట్టులో ఆత్మవిశ్వాసం, పట్టుదల పెరిగాయి కాబట్టి మళ్లీ టైటిల్ గెలుస్తామనే నమ్మకం మాలో చాలా మందికి ఉంది. ఇంగ్లండ్ ఆటతీరును బాగా పరిశీలించాం. వారు బాగా ఆడగలరు కాబట్టే ఫైనల్‌కు వచ్చారు. ఆటగాళ్లందరి ప్రదర్శనను విశ్లేషించి సిద్ధంగా ఉన్నాం. మాతో ఓడిన తర్వాత ఆ జట్టు ఆట మరింత మెరుగైంది. ఆదివారం మా లక్ష్యం నెరవేరి కరీబియన్లు అందరికీ ఆనందం పంచాలనేదే మా కోరిక. మా అంతట మేం ఓడాల్సిందే కానీ ఎవరూ మమ్మల్ని ఓడించలేరనే నమ్మకంతో బరిలోకి దిగుతున్నాం.     - స్యామీ

 

సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు కూడా మేం ఇదే తరహాలో ఒత్తిడిని ఎదుర్కొన్నాం. అయితే ఆటగాళ్లంతా దానిని అధిగమించి అద్భుతంగా ఆడారు. ఇది ఏ రకంగా చూసినా సాధారణ మ్యాచ్ కాదు. గత ఏడాది కాలంగా కొత్త తరహాలో ఆడుతూ జట్టుగా మారి మేం పడిన శ్రమను సరైన చోట ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. వరల్డ్ కప్ గెలిస్తే మా అందరి కల నెరవేరినట్లే.              

 -మోర్గాన్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement