ఆమిర్ బెస్ట్ బౌలర్ అని వ్యాఖ్య
కోల్‌కతా: స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఐదేళ్ల నిషేధం ఎదుర్కొని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేసిన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమీర్‌పై షాహిద్ ఆఫ్రిది ప్రశంసల వర్షం కురిపించాడు. అతను ఉత్తమ బౌలర్ అని, టాప్ అంతర్జాతీయ పేసర్లలో అతడు ఇప్పటికే చోటు సంపాదించాడని పేర్కొన్నాడు. ఆమిర్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని ఇటీవల భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రోహిత్ వ్యాఖ్యల గురించి అతన్నే అడుగాలని, తమకు మాత్రం ఆమిర్ బెస్ట్ బౌలర్ అని పాకిస్థాన్ జట్టు కెప్టెన్ అఫ్రిది పేర్కొన్నాడు.
వన్డేల్లోనైనా, ట్వంటీ-20ల్లోనైనా వరల్డ్ కప్‌లో ఇంతవరకు భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించలేదు. ఇది తమకు నెగిటివ్ అంశమే అయినా, సానుకూల దృక్పథంలో ముందుకుసాగుతామని, ఇటీవలికాలంలో భారత జట్టు మంచి ఆటతీరును కనబరుస్తున్నదని అతను పేర్కొన్నాడు. ఈ నెల 19న ఈడెన్ గార్డెన్స్‌లో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ తలపడుతున్న సంగతి తెలిసిందే. మొదట పాక్ జట్టు 16వతేదీన క్వాలిఫైయింగ్‌లో అర్హత సాధించిన జట్టు (బంగ్లాదేశ్ కావొచ్చు)తో ఆడనుంది. ఆ తర్వాత భారత్‌తో పోరు ఉంటుంది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచుతోపాటు, రెండో మ్యాచును అత్యంత కీలకంగా భావిస్తున్నామని, ఈడెన్ గార్డెన్స్‌లోని పిచ్ ఇరుజట్లకూ అనుకూలించేవిధంగా ఉందని పేర్కొన్నాడు. దాయాది భారత్‌తో మ్యాచు కోసం మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే లాహోర్‌లో తగినంత శిక్షణ తీసుకున్న నేపథ్యంలో తమ జట్టు భారత్‌కు రావడం ఆలస్యమైనా.. ఇది తమ ఆటతీరుపై ప్రభావం చూపబోదని, డెఫినెట్‌గా తాము బాగా ఆడుతామని చెప్పాడు.
భారత బ్యాటింగ్, పాకిస్థాన్ బౌలింగ్ మధ్య ప్రధానంగా పోరు ఉండనుందని, ఆమిర్, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ షమీతో తమ బౌలింగ్ ఆటాక్ పటిష్టంగా ఉందని, తమ బ్యాట్స్‌మెన్ బాగా ఆడి.. చక్కని స్కోరు చేస్తే.. దానిని కాపాడుకునే బౌలింగ్ సామర్థ్యం జట్టులో ఉందని అఫ్రిది ధీమా వ్యక్తం చేశాడు.
'బౌలింగ్ మా బలం.. భారత్‌తో ఫైట్‌కు రెడీ'
Published Sun, Mar 13 2016 3:25 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM
Advertisement