india versus pakistan
-
ఆఫ్రిది.. నిన్ను సైక్రియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్తా.. రా!
న్యూఢిల్లీ: మాటకు మాట.. పంచ్‌కు పంచ్ ఇది గౌతం గంభీర్ స్వభావం. క్రికెట్లోనే కాదు.. రిటైరైన తర్వాత సోషల్ మీడియాలోనూ దూకుడుగా వ్యవహరిస్తూ.. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ఢిల్లీలో గంభీర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గంభీర్‌పై తాజాగా విడుదలైన ఆత్మకథలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ ఘాటు వ్యాఖ్యలు, విమర్శలు చేశాడు. ఈ విమర్శలకు దీటుగా స్పందించిన గంభీర్.. ‘ఆఫ్రిదీ నువ్వు చాలా సరదా మనిషివి. మెడికల్ టూరిజంలో భాగంగా మేం ఇప్పటికీ పాకిస్థానీలకు వీసాలు ఇస్తున్నాం. నేనే స్వయంగా నిన్ను సైక్రియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాలే..’ అంటూ బదులిచ్చారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో మైదానంలోనూ, బయట ఆఫ్రిదికి, గంభీర్‌కు మధ్య అంత సఖ్యత లేని విషయం తెలిసిందే. గంభీర్ గురించి తన ఆత్మకథ ‘గేమ్ చేంజర్’లో ప్రస్తావిస్తూ.. డాన్ బ్రాడ్‌మన్, జేమ్స్ బాండ్‌కు మధ్యరకంలా గంభీర్ ప్రవర్తిస్తూ ఉంటాడని, ఆటలో అతనికి పెద్ద రికార్డులు లేకపోయినా.. అటిట్యూడ్ మాత్రం చాలా ఎక్కువ అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘కొన్ని శత్రుత్వాలు వ్యక్తిగతమైనవి. కొన్ని వృత్తిపరమైనవి. గంభీర్ విషయానికొస్తే.. ఓహ్ పూర్ గౌతం. అతను, అతని అటిట్యూడ్ ప్రాబ్లం గురించి చెప్పాలి. అతనికి పెద్దగా వ్యక్తిత్వం లేదు. గొప్ప క్రికెట్ ఆటలో అతనొక క్యారేక్టర్ మాత్రమే. అతనికి పెద్ద రికార్డులు లేకున్నా అటిట్యూడ్ మాత్రం చాలా ఉంది’ అని ఆఫ్రిది రాసుకొచ్చాడు. 2007లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వన్డేలో తనకు, గంభీర్‌కు మధ్య జరిగిన గొడవను ఆఫ్రిది ప్రస్తావించాడు. అయితే, ఈ గొడవ ఆసియా కప్‌లో జరిగిందని తప్పుగా పేర్కొన్నాడు. ‘2007 ఆసియా కప్‌లో గంభీర్‌తో గొడవ నాకు గుర్తుంది. సింగిల్ రన్‌ను కంప్లీట్ చేసిన వెంటనే అతను నేరుగా నా మీదకు వచ్చాడు. ఎంపైర్లు ఈ గొడవ సద్దుమణిగేలా చేశారు. లేకుంటే నేనే చేసేవాడిని. నిజాయితీగా చెప్పాలంటే.. ఈ సందర్భంగా మా మహిళా బంధువుల గురించి మేం ద్వైపాక్షిక చర్చకు దిగాం’ అని ఆఫ్రిది పేర్కొన్నాడు. -
పాక్‌పై మనదే పైచేయి: సచిన్ విశ్లేషణ ఇదే!
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఓవల్‌లో జరుగుతున్న భారత్-పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్ మీదే అందరి కళ్లు ఉన్నాయి. ఇందుకు తాను కూడా మినహాయింపు కాదని భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. యావత్ ప్రపంచం మాదిరిగానే తాను కూడా ఈ మ్యాచ్ చూసేందుకు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు. డిఫెండింగ్ చాంపియన్ అయిన భారతే ఈ హైప్రొఫైల్ పోరులో గెలిచే అవకాశముందని చెప్పాడు. మైదానంలో ఉండి ఈ మ్యాచ్ చూస్తూ.. భారత జట్టుకు అడుగడుగునా మద్దతు, ఉత్సాహం అందిస్తానని సచిన్ చెప్పాడు. ‘పాకిస్థాన్‌పై ఎప్పుడూ మనదే పైచేయి. ఇప్పుడు కూడా బాగా ఆడాలి. ఈ మ్యాచ్ గెలిస్తే అందరం సంబరాలు చేసుకుంటాం’ అని సచిన్ పేర్కొన్నాడు. విరోచితమైన ఇన్నింగ్స్‌తో పాక్ జట్టుపై సచిన్ పలు విజయాలు అందించిన సంగతి తెలిసిందే. ‘చాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లి నాయకత్వం అద్భుతంగా ఉంది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌తోపాటు కోహ్లి కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. యువరాజ్ కూడా బాగా ఆడాడు. పేస్ బౌలర్లు అద్భుతమైన ప్రతిభను చూపుతున్నారు. స్పిన్నర్లు రాణించారు. ధోనీ సేవలను కూడా తక్కువ చేయలేం. బాయ్స్ అందరూ గొప్ప ఆటతీరు చూపుతున్నారు. ఆదివారం కూడా మన ఆటగాళ్లు ఇదే తరహా ప్రదర్శన ఇస్తే.. మనల్ని ఢీకొట్టడం ఎవరితరం కాదు. పాకిస్థాన్ జట్టు అస్థిరతతో బాధపడుతోంది. కానీ, ఆదివారం ఓ కొత్త రోజు అని మరువకూడదు. ఎప్పటిలాగే సర్వసన్నద్ధతతో ఈ మ్యాచ్‌కు సిద్ధం కావాలి’ అని సచిన్ వివరించాడు. -
'బౌలింగ్ మా బలం.. భారత్‌తో ఫైట్‌కు రెడీ'
ఆమిర్ బెస్ట్ బౌలర్ అని వ్యాఖ్య కోల్‌కతా: స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఐదేళ్ల నిషేధం ఎదుర్కొని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసిన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమీర్‌పై షాహిద్ ఆఫ్రిది ప్రశంసల వర్షం కురిపించాడు. అతను ఉత్తమ బౌలర్ అని, టాప్ అంతర్జాతీయ పేసర్లలో అతడు ఇప్పటికే చోటు సంపాదించాడని పేర్కొన్నాడు. ఆమిర్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని ఇటీవల భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రోహిత్ వ్యాఖ్యల గురించి అతన్నే అడుగాలని, తమకు మాత్రం ఆమిర్ బెస్ట్ బౌలర్ అని పాకిస్థాన్ జట్టు కెప్టెన్ అఫ్రిది పేర్కొన్నాడు. వన్డేల్లోనైనా, ట్వంటీ-20ల్లోనైనా వరల్డ్ కప్‌లో ఇంతవరకు భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించలేదు. ఇది తమకు నెగిటివ్ అంశమే అయినా, సానుకూల దృక్పథంలో ముందుకుసాగుతామని, ఇటీవలికాలంలో భారత జట్టు మంచి ఆటతీరును కనబరుస్తున్నదని అతను పేర్కొన్నాడు. ఈ నెల 19న ఈడెన్ గార్డెన్స్‌లో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ తలపడుతున్న సంగతి తెలిసిందే. మొదట పాక్ జట్టు 16వతేదీన క్వాలిఫైయింగ్‌లో అర్హత సాధించిన జట్టు (బంగ్లాదేశ్ కావొచ్చు)తో ఆడనుంది. ఆ తర్వాత భారత్‌తో పోరు ఉంటుంది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచుతోపాటు, రెండో మ్యాచును అత్యంత కీలకంగా భావిస్తున్నామని, ఈడెన్ గార్డెన్స్‌లోని పిచ్ ఇరుజట్లకూ అనుకూలించేవిధంగా ఉందని పేర్కొన్నాడు. దాయాది భారత్‌తో మ్యాచు కోసం మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే లాహోర్‌లో తగినంత శిక్షణ తీసుకున్న నేపథ్యంలో తమ జట్టు భారత్‌కు రావడం ఆలస్యమైనా.. ఇది తమ ఆటతీరుపై ప్రభావం చూపబోదని, డెఫినెట్‌గా తాము బాగా ఆడుతామని చెప్పాడు. భారత బ్యాటింగ్, పాకిస్థాన్ బౌలింగ్ మధ్య ప్రధానంగా పోరు ఉండనుందని, ఆమిర్, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ షమీతో తమ బౌలింగ్ ఆటాక్ పటిష్టంగా ఉందని, తమ బ్యాట్స్‌మెన్ బాగా ఆడి.. చక్కని స్కోరు చేస్తే.. దానిని కాపాడుకునే బౌలింగ్ సామర్థ్యం జట్టులో ఉందని అఫ్రిది ధీమా వ్యక్తం చేశాడు. -
‘యప్ టీవీ’లో ఇండో-పాక్ మ్యాచ్!
అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, యూరోప్, న్యూజిలాండ్, మలేషియాల్లో ఉన్న క్రికెట్ అభిమానులు ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ను ‘యప్‌టీవీ’లో చూసి ఆనందించవచ్చని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. యప్ టీవీ యాప్ ద్వారా ఆసియాకప్‌ను పూర్తిగా తిలకించవచ్చని ఆయన చెప్పారు. ‘భారత్‌లో క్రికెట్ ఓ మతం లాంటిది. ఇండియా-పాకిస్తాన్ల మధ్య జరిగే మ్యాచ్‌లు ఎప్పుడూ భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. విదేశాల్లో ఉన్న క్రికెట్ అభిమానులకు మా ద్వారా ఈ సేవలందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంటర్నెట్కు కనెక్ట్ చేసి టీవీలు, మొబైల్స్, ట్యాబ్లెట్ల ద్వారా ఈ మ్యాచ్‌లు చూడొచ్చు’ అని ఉదయ్ తెలిపారు.