పాక్‌పై మనదే పైచేయి: సచిన్ విశ్లేషణ ఇదే!
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఓవల్‌లో జరుగుతున్న భారత్-పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్ మీదే అందరి కళ్లు ఉన్నాయి. ఇందుకు తాను కూడా మినహాయింపు కాదని భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. యావత్ ప్రపంచం మాదిరిగానే తాను కూడా ఈ మ్యాచ్ చూసేందుకు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు. డిఫెండింగ్ చాంపియన్ అయిన భారతే ఈ హైప్రొఫైల్ పోరులో గెలిచే అవకాశముందని చెప్పాడు. మైదానంలో ఉండి ఈ మ్యాచ్ చూస్తూ.. భారత జట్టుకు అడుగడుగునా మద్దతు, ఉత్సాహం అందిస్తానని సచిన్ చెప్పాడు.
‘పాకిస్థాన్‌పై ఎప్పుడూ మనదే పైచేయి. ఇప్పుడు కూడా బాగా ఆడాలి. ఈ మ్యాచ్ గెలిస్తే అందరం సంబరాలు చేసుకుంటాం’ అని సచిన్ పేర్కొన్నాడు. విరోచితమైన ఇన్నింగ్స్‌తో పాక్ జట్టుపై సచిన్ పలు విజయాలు అందించిన సంగతి తెలిసిందే.
‘చాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లి నాయకత్వం అద్భుతంగా ఉంది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌తోపాటు కోహ్లి కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. యువరాజ్ కూడా బాగా ఆడాడు. పేస్ బౌలర్లు అద్భుతమైన ప్రతిభను చూపుతున్నారు. స్పిన్నర్లు రాణించారు. ధోనీ సేవలను కూడా తక్కువ చేయలేం. బాయ్స్ అందరూ గొప్ప ఆటతీరు చూపుతున్నారు. ఆదివారం కూడా మన ఆటగాళ్లు ఇదే తరహా ప్రదర్శన ఇస్తే.. మనల్ని ఢీకొట్టడం ఎవరితరం కాదు. పాకిస్థాన్ జట్టు అస్థిరతతో బాధపడుతోంది. కానీ, ఆదివారం ఓ కొత్త రోజు అని మరువకూడదు. ఎప్పటిలాగే సర్వసన్నద్ధతతో ఈ మ్యాచ్‌కు సిద్ధం కావాలి’ అని సచిన్ వివరించాడు.