రెండో ఇన్నింగ్స్ సంతృప్తికరం
⇔ మనస్సుకు నచ్చిన పనులు చేస్తున్నాను
⇔ ఐపీఎల్‌తో యువ క్రికెటర్లకు మేలు
⇔ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కే అవకాశం
⇔ ‘సచిన్’ సినిమాలో అన్ని విషయాలను పంచుకున్నాను
⇔ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మనోగతం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి నాలుగేళ్లు దాటినా... భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మనసు నుంచి ఈ ఆట మాత్రం దూరం కాలేదు. ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తూనే మరోవైపు తన జీవిత చరిత్రపై వర్ధమాన క్రీడాకారులకు, యువతకు ప్రేరణగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. దీంట్లో భాగంగా ఈనెల 26న ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ పేరిట ఆయన బయోపిక్ డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చారిటీలతో పాటు మనసుకు నచ్చిన పనులు చేస్తూ సంతృప్తికరంగా ఉన్నానని చెప్పారు. ఐపీఎల్–10 ఫైనల్ సందర్భంగా ముంబై ఇండియన్స్ జట్టు మెంటార్‌గా హైదరాబాద్‌కు వచ్చిన సచిన్ తన సినిమా విశేషాలతో పాటు చాంపియన్స్ ట్రోఫీలో భారత ప్రదర్శన, ఐపీఎల్‌లో యువ ఆటగాళ్ల రాణింపు గురించి కూడా వివరంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
తొలి ఇన్నింగ్స్ మైదానంలోనే...
నా జీవితంలో ఓ అధ్యాయమంతా క్రికెట్ మైదానంలోనే గడిచిపోయింది. ప్రత్యర్థి విధించిన లక్ష్యాలను ఛేదిస్తూ ఉండిపోయాను. అయితే నా రెండో ఇన్నింగ్స్ మాత్రం సంతృప్తికి సంబంధించినదిగా భావిస్తున్నాను. జీవితంలో ఏంచేసినా ఓ లక్ష్యమంటూ ఉండాలి. అదే మనకు సంతృప్తినిస్తుంది.
యువీ, రైనా కలిస్తే రిషభ్...
ఐపీఎల్‌లో రిషభ్ పంత్ ఆటను గమనించాను. అద్భుతంగా ఆడుతున్నాడు. నాకైతే యువరాజ్ సింగ్, సురేశ్ రైనా కలిస్తే రిషభ్ పంతేమో అనిపిస్తుంది. తండ్రి చనిపోయిన కఠిన పరిస్థితిలోనూ రిషభ్ పంత్ మెరుగ్గా ఆడగలిగాడు. ఇలాంటి అనుభవమే నాకు 1999 ప్రపంచకప్ సమయంలో ఎదురైంది.
థంపి, సిరాజ్ సూపర్...
భవిష్యత్ భారత బౌలింగ్‌కు ఢోకా లేదేమో అనిపిస్తోంది. ఐపీఎల్–10లో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్, కేరళ బౌలర్ బాసిల్ థంపి అంతలా నన్ను ఆకట్టుకున్నారు. రైజింగ్ పుణే ఓపెనర్ రాహుల్ త్రిపాఠి కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు కొట్టిన ఓ కవర్‌డ్రైవ్.. వీరేంద్ర సెహ్వాగ్‌ను తలపించింది. అయితే ఫుట్‌వర్క్ మెరుగుపడాల్సి ఉంది.
‘చాంపియన్స్’లో ధోని కీలకం ...
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ఎంఎస్ ధోని అనుభవం జట్టుకు కీలకంగా మారనుంది. ఇంగ్లండ్ పరిస్థితులపై అతడికి అవగాహన ఉంది. ఇక తను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలనేది టీమ్ మేనేజిమెంట్ నిర్ణయం తీసుకుంటుంది.
నేను నటించను అన్నాను...
నా జీవితంపై సినిమా అనేసరికి ముందుగా నిర్మాత రవికి నటించడం నా వల్ల కాదు అని స్పష్టం చేశాను. ఇతర ఆటగాళ్లపై వచ్చినట్టుగానే నాపై కూడా ఓ సినిమా రావాలనేది ఆయన అభిప్రాయం. అయితే దీనికి అంగీకరించేందుకు కాస్త సమయం తీసుకున్నాను. ఎందుకంటే ఊహాత్మక కల్పన అనేది ఇక్కడ కుదరదు. నా జీవితం తెరిచిన పుస్తకం. అయితే అన్నీ నిజ జీవిత ఫుటేజి నుంచి, అరుదైన ఫొటోలతో పాటు నా ఇంటర్వూ్యల ద్వారా చిత్రీకరించాం. వాటిలో కొన్నింటిని అభిమానులు ఇప్పటిదాకా చూడలేదు.
ఒడిదుడుకులూ ఉన్నాయి...
అందరిలాగే నా కెరీర్‌లోనూ ఒడిదుడుకులు ఉన్నాయి. ఇక 2000లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం గురించి నాకు ఎంతవరకు తెలుసో, నేనేం చెప్పానో ఈ సినిమాలో చూడవచ్చు. అపజయాల్లో ఉన్నప్పుడు నా మనోస్థితి ఎలా ఉండేదో కూడా చెప్పాను.
ఎయిర్‌ఫోర్స్ అధికారులకు ప్రత్యేక ప్రదర్శన
‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ సినిమాను విడుదలకు ముందే శనివారం రాత్రి భారత ఆర్మీ అధికారుల కోసం సచిన్ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. భారత వాయు సేన (ఐఏఓఫ్)లో సచిన్ గౌరవనీయ గ్రూప్ కెప్టెన్ హోదాలో ఉన్న సంగతి తెలిసిందే. సినిమాను తిలకించిన వారిలో ఎయిర్‌చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాతోపాటు ఆర్మీ, నావికాదళం అధికారులు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సచిన్ భార్య అంజలి కూడా వీరితో పాటు సినిమా తిలకించారు. సినిమా చూస్తున్నంతసేపు వారంతా ‘సచిన్... సచిన్’ అని అరవడంతో పాటు ముగిశాక లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారు. ఈసందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా.. సచిన్‌కు జ్ఞాపికను అందించారు. ‘సినిమా చిత్రీకరణ అనంతరం మొదటగా భారత త్రివిధ దళాల అధికారులకు చూపించాలని అనుకున్నాను. అలాగే ఈ దేశ రక్షణ కోసం మీరు అందిస్తున్న సేవలకు వంద కోట్లకు పైగా ఉన్న భారతీయుల తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని సచిన్ తెలిపారు.