ప్రాక్టీస్ లో 'ప్లాప్'
టి20 ప్రపంచకప్ కోసం ఐపీఎల్ ప్రాక్టీస్ సరిపోతుందని చెప్పిన ధోని వార్మప్ మ్యాచ్‌లో దానిని ఆచరణలో పెట్టలేకపోయాడు. భారీ విజయలక్ష్యం కాకున్నా భారత బ్యాటింగ్ తడబడింది. కెప్టెన్ మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా బరిలోకి దిగినా జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు.
ఫలితంగా టోర్నీ తొలి వార్మప్ మ్యాచ్‌లో టీమిండియాకు పరాజయం తప్పలేదు. మలింగ చక్కటి బౌలింగ్‌తో చిన్న స్కోరును కూడా శ్రీలంక కాపాడుకోగలిగింది. ఓటమితో పోయేదేమీ లేకున్నా... జట్టు ప్రదర్శన మరింత మెరుగు పడాల్సి ఉందనేదానికి ఇదో హెచ్చరికలాంటిది.
ఢాకా: టి20 ప్రపంచకప్‌ను ధోని సేన పరాజయంతో ప్రారంభించింది. సోమవారం ఇక్కడ జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక ఐదు పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. జయవర్ధనే (20 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), చండీమల్ (25 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి.
అనంతరం భారత్ 20 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది. రైనా (31 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యువరాజ్ (28 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. 30 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన మలింగ లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో తమ తదుపరి వార్మప్ మ్యాచ్‌లో భారత్ బుధవారం ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
అశ్విన్‌కు 3 వికెట్లు
టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఒకవైపు కుషాల్ పెరీరా (15 బంతుల్లో 21; 3 ఫోర్లు) ధాటిగా ఆడాడు. మరోవైపు ఓపెనర్ దిల్షాన్ (20 బంతుల్లో 9) మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. షమీ పట్టిన చక్కటి క్యాచ్‌కు కుషాల్ అవుట్ కావడంతో లంక తొలి వికెట్ కోల్పోయింది. అయితే జయవర్ధనే కూడా జోరు ప్రదర్శించాడు. రెండో వికెట్‌కు 32 బంతుల్లో 40 పరుగులు జత చేసిన అనంతరం జయవర్ధనే, దిల్షాన్ వరుస బంతుల్లో వెనుదిరగడంతో లంక కష్టాల్లో పడింది.
ఆ వెంటనే సంగక్కర (4), మాథ్యూస్ (9) కూడా పెవిలియన్ చేరారు. ఈ దశలో కెప్టెన్ చండీమల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును నిలబెట్టారు. చివర్లో తిసార (11 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), కులశేఖర (14 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) వేగంగా ఆడి లంక స్కోరును 150 పరుగులు దాటించారు. వీరిద్దరు 18 బంతుల్లోనే అభేద్యంగా 34 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ చివరి 8 బంతుల్లో లంక 26 పరుగులు చేయడం విశేషం.
రైనా దూకుడు
కష్టసాధ్యం కాని విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే శిఖర్ ధావన్ (2) వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ (4) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అయితే సురేశ్ రైనా చక్కటి స్ట్రోక్‌లతో ఆకట్టుకున్నాడు. టి20 ఫార్మాట్‌లో తాను ఎంత విలువైన ఆటగాడినో సూచిస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి యువరాజ్ కూడా జత కలవడంతో జట్టు స్కోరు వేగంగా పెరిగింది. ధాటిగా ఆడుతున్న రైనాను మెండిస్ వెనక్కి పంపగా... అజింక్యా రహానే (0) విఫలమయ్యాడు. విరాట్ కోహ్లి (17), రవీంద్ర జడేజా (12)లతో పాటు కీలక ఇన్నింగ్స్ ఆడిన యువరాజ్ సింగ్ కూడా తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు.
చివర్లో అశ్విన్ (12 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్), స్టువర్ట్ బిన్నీ (14) విజయానికి చేరువగా తెచ్చినా... మలింగ వేసిన ఆఖరి ఓవర్లో 3 వికెట్లు కోల్పోవడంతో భారత్ ఓటమిపాలైంది. కుర్రాళ్లకు బ్యాటింగ్ అవకాశం కల్పించేందుకు కెప్టెన్ ధోని బ్యాటింగ్‌కు దిగలేదు.