
గడ్డం మాత్రం నెరిసింది !
సాధారణంగా ‘పంచ్’ల విషయంలో ధోని అందరికంటే ముందుంటాడు. సందర్భాన్ని బట్టి మీడియాకు సమాధానాలు చెప్పడంలో దిట్ట. ఆస్ట్రేలియాపై ఘన విజయం తర్వాత ధోని మాంచి హుషారులోకి వచ్చాడు
ఏడేళ్లలో చాలా మార్పులు
కెప్టెన్ కూల్ వింత సమాధానం
టి20 ఫార్మాట్‌పై ధోని విశ్లేషణ
సాధారణంగా ‘పంచ్’ల విషయంలో ధోని అందరికంటే ముందుంటాడు. సందర్భాన్ని బట్టి మీడియాకు సమాధానాలు చెప్పడంలో దిట్ట. ఆస్ట్రేలియాపై ఘన విజయం తర్వాత ధోని మాంచి హుషారులోకి వచ్చాడు. 2007లో తొలిసారి కెప్టెన్‌గా టి20 ప్రపంచకప్ గెలిచినప్పటికీ... ఇప్పటికీ తేడా ఏంటి? ఈ ప్రశ్నకు మహి కాస్త విభిన్నంగా సమాధానం చెప్పాడు. ‘అప్పుడు ఇంత మంది మీడియా ప్రతినిధులు లేరు. కొంతమంది ఇంగ్లండ్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లాం. ఇంకొంత మంది భారత్ నుంచి వచ్చారు. ఏదో సరదా ఆట అని అందరూ లైట్ తీసుకున్నారు. మేం కూడా పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. అప్పుడు సరదాగా ఉండేది. కానీ ఇప్పుడు టి20 చాలా సీరియస్‌గా మారింది. ప్రతి ఒక్కరూ కొత్త రకమైన షాట్లు ప్రయోగాలు చేసి ఆడుతున్నారు. ఆటను బాగా అర్థం చేసుకున్నారు. కాబట్టి సీరియస్ క్రికెట్‌గా మారింది. ఈ ఏడేళ్లలో ఇంకా చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు అద్దం ముందు నిలబడి చూసుకుంటే గెడ్డం నెరిసింది. తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి’అని ధోని వ్యాఖ్యానించాడు.
అయితే భారత క్రికెట్‌లో ఎప్పుడైనా ఒత్తిడి ఒకేలా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ‘ఒక్కసారి జాతీయ జట్టుకు ఆడటం మొదలుపెడితే ఎన్ని సంవత్సరాల తర్వాతైనా ఒత్తిడి అలాగే ఉంటుంది. మన మీద 100 కిలోల బరువు పెడితే... అది శిఖరంపైన నిలుచున్నా, కింద నిలుచున్నా వంద కిలోలే ఉంటుంది’ అని ధోని అన్నాడు.
ఎవరు మంచి బౌలర్?
క్రికెట్‌లో, ముఖ్యంగా టి20ల్లో గణాంకాలను బట్టి ఆటగాడిని అంచనా వేయడం తప్పని ధోని అభిప్రాయం. ‘ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీస్తే మంచి బౌలర్ అని, వికెట్ తీయకపోతే మంచి బౌలర్ కాదని చెప్పలేం. ఒక ఆటగాడు బౌలింగ్ బాగా చేశాడా లేదా అని విశ్లేషించడానికి రకరకాల అంశాలు చూసుకోవాలి. ఒక ఓవర్లో 20 పరుగులు ఇస్తే ఆ బౌలర్ సరిగా బౌలింగ్ చేయలేదని చెప్పలేం’ అంటూ టి20 క్రికెట్‌లో బౌలర్లను విశ్లేషించాడు భారత కెప్టెన్.