‘కూల్’గా ఆడగలడా!
∙ ధోనిపై పెరిగిన ఒత్తిడి
∙ ఇకపై ప్రతీ సిరీస్ సవాలే
∙ సెలక్టర్ల ప్రత్యేక దృష్టి
‘ధోని ఆటను బట్టే అతడిని జట్టులో కొనసాగించడం గురించి మున్ముందు ఆలోచిస్తాం. మంచి ప్రదర్శన ఇవ్వకపోతే ప్రత్యామ్నాయాన్ని చూడాల్సి ఉంటుంది’... భారత క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఈ మాట చెప్పగానే దేశంలోని ధోని అభిమాన గణం మొత్తం ఆయనపై విరుచుకు పడింది. మా ఎమ్మెస్ గురించి మాట్లాడే స్థాయి ఈ ఎమ్మెస్కేకు ఎక్కడ ఉందంటూ వారంతా విమర్శలకు దిగారు. అయితే భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజాలు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఉన్న సెలక్టర్లు గానీ, అందులో ఎంతో మంది కెరీర్‌లు అర్ధాంతరంగా ముగిసిన సమయంలో ఉన్న సెలక్టర్లు గానీ ఆయా ఆటగాళ్లకంటే గొప్పవాళ్లు కాకపోవచ్చు. కానీ సెలక్టర్ హోదాలో వారు నిర్దాక్షిణ్యంగా సంచలన నిర్ణయాలు తీసుకున్న ఘటనలు చాలా ఉన్నాయి.
ధోనిలాంటి సూపర్ స్టార్ గురించి బహిరంగ ప్రకటన చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేకపోయినా ధోనికి పరిస్థితి అంత సానుకూలంగా ఏమీ లేదని అర్థమవుతోంది. బోర్డు వ్యవహారాలు, సెలక్షన్ రాజకీయాల గురించి ధోనిలాంటి వాడికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2019 వన్డే ప్రపంచ కప్ వరకు కొనసాగాలని పట్టుదలగా ఉన్న ఈ మాజీ కెప్టెన్... నేరుగా హెచ్చరికలు అందుకుంటున్న ఇలాంటి స్థితిలో తన సహజ శైలిలో ఆడగలడా? సత్తా చాటి తన స్థానం మరో రెండేళ్ల పాటు సుస్థిరం చేసుకోగలడా?
సాక్షి క్రీడా విభాగం : ధోని స్థాయి ఆటగాడికి తన ఇష్ట ప్రకారమే తప్పుకునే హక్కు ఉంది తప్ప ఎవరూ బలవంత పెట్టకూడదు, తాను జట్టుకు ఉపయోగపడనని తెలిసిన రోజున అతనే వెళ్లిపోతాడు తప్ప ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధార పడడు... ‘మిస్టర్ కూల్’ గురించి చాలా మంది క్రికెటర్లు, మాజీలు, సన్నిహితులు తరచుగా చెప్పే మాట ఇది. అతను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్న రోజున అందరూ దీనిని ఉదాహరణగా చూపించారు. గత జనవరిలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు వన్డే, టి20 కెప్టెన్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధోని ప్రకటించిన రోజున కూడా అంతా ఇదే అనుకున్నారు. అయితే తదనంతర పరిణామాల్లో ధోని స్వయంగా తప్పు కోలేదని, సెలక్టర్లు అతడితో చర్చించిన తర్వాతే అతను ఆ నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది. ధోని ప్రకటనకు ఒక రోజు ముందే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సుదీర్ఘంగా ధోనితో మాట్లాడిన విషయం దానిని నిర్ధారించింది. ఇప్పుడు అదే ప్రసాద్, ధోని భవిష్యత్తు గురించి చెబుతున్నారంటే అదేదో ఊరికే నోటిమాటగా భావించడానికి వీల్లేదు. కచ్చితంగా సెలక్షన్ కమిటీ సమావేశంలో ఈ విషయంలో సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరమే ప్రసాద్ తమ ఉద్దేశం బయటకు వెల్లడించారు. కాబట్టి మహి విషయంలో వారికి స్పష్టత ఉంది. అందుకే ప్రదర్శన, ప్రత్యామ్నాయం గురించి వారు చెబుతున్నారు.
ఆట బాగున్నా...
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ధోని 13 వన్డేలు ఆడాడు. ఇందులో నాలుగు సార్లు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. మిగతా మ్యాచ్‌లలో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు అంటే చాలా మంచి ప్రదర్శనగానే లెక్క. వికెట్ కీపర్‌గా, ఫిట్‌నెస్ పరంగా కూడా అతను చురుగ్గా ఉన్నాడు. అంతా బాగున్నప్పుడు సమస్య ఏముంది అనిపించవచ్చు. అయితే సెలక్టర్ల దృష్టిలో ఇప్పుడు సిద్ధం చేస్తున్న జట్టు 2019 ప్రపంచ కప్ కోసమే. ఆలోగా జట్టు వచ్చే రెండేళ్ల పాటు నిలకడైన ప్రదర్శన ఇవ్వాలని సెలక్టర్లు కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా వైఫల్యాలతో సంబంధం లేకుండా కుర్రాళ్లందరికీ వరుసగా అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. కోహ్లి నాయకత్వంలోని ఈ యువ జట్టులో ధోని ఒక్కడే బాగా సీనియర్. కెప్టెన్, కోచ్ రవిశాస్త్రి ప్రణాళికల్లో బహుశా ధోని లేకపోవచ్చు. కోచ్‌గా తన తొలి సిరీస్‌కు ముందు శాస్త్రి మాట్లాడుతూ... ‘ఇద్దరు చాంపియన్ క్రికెటర్ల గురించి సమయం వచ్చినప్పుడు స్పందిస్తాం. కెప్టెన్‌తో చర్చించిన తర్వాతే ఏం చేయాలో ఆలోచిస్తాం’ అని చెప్పారు. మరి వారిద్దరు ఈ విషయంలో ఎలాంటి చర్చలు జరిపారో తెలీదు కానీ... ఇప్పటికే యువరాజ్ సింగ్‌ను తప్పించి సెలక్టర్లు భవిష్యత్తు గురించి తమ ఆలోచనలను వెల్లడించారు. అడిగినా, అడగకపోయినా జట్టు ఫిట్‌నెస్ గురించే శాస్త్రి పదే పదే మాట్లాడటంలో ఆశ్చర్యం ఏమీ కనిపించడం లేదు. కాబట్టి వచ్చే రెండేళ్ల పాటు ధోని ఫిట్‌నెస్‌ను కాపాడుకోగలడా అనేది కూడా కీలకం.
సత్తా చాటాల్సిందే...
రాహుల్ ద్రవిడ్‌లాంటి దిగ్గజాలు కూడా యువీ, ధోనిలపై నిర్ణయం తీసుకుంటే మంచిదనే అభిప్రాయం ఇటీవల వ్యక్త పరిచారు. వారు ఏ స్థానాల్లో ఆడతారులాంటివి కూడా ప్రశ్నించడాన్ని బట్టి చూస్తే పరోక్షంగా వారు లేకుండానే జట్టును నిర్మించడం మంచిదనే సూచన కనిపిస్తోంది! వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో మెరుగైన స్థితిలో ఉండి కూడా మ్యాచ్‌ను ముగించలేని పరిస్థితి ధోని బయోడేటాను దెబ్బ తీసింది. ధోని ఇప్పుడు కూడా మెరుగైన ఆటగాడే అయినా... సహజంగానే అతని పాత తరహా ఆటతో పోల్చి చూస్తున్నారు. ఆ రకంగా చూస్తే ‘ఇలాంటి ధోని’ అవసరం జట్టుకు అంతగా కనిపించడం లేదేమో! ఒక ప్రధాన బ్యాట్స్‌మన్‌కంటే కూడా ఇప్పుడు ధోని రెగ్యులర్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌లాగే కనిపిస్తున్నాడనేది వాస్తవం.
ఇక కెప్టెన్‌గా కూడా రాటుదేలిన కోహ్లికి మున్ముందు సలహాల విషయంలో ధోని అవసరం రాకపోవచ్చేమో. అందుకే ప్రత్యామ్నాయం చూస్తామంటూ స్వయంగా వికెట్ కీపర్ అయిన ప్రసాద్ అంత గట్టిగా చెప్పగలిగారు. ప్రస్తుత శ్రీలంక సిరీస్‌లో 5 వన్డేలతో పాటు ఇదే ఏడాది భారత్ సొంతగడ్డపై మరో ఎనిమిది వన్డేలు కూడా ఆడనుంది. దాదాపు ఇదే జట్టు ఆ మ్యాచ్‌లకు కూడా కొనసాగవచ్చు. సెలక్టర్ల మాటలను బట్టి చూస్తే గత రికార్డు, గొప్పతనంలాంటివేవీ ఇప్పుడు ధోనిని ఆదుకునే పరిస్థితి మాత్రం లేదనేది అర్థమైంది. 2019 వరల్డ్ కప్ గురించి ఆలోచించాలంటే దాదాపు ప్రతీ మ్యాచ్‌లో అతను బాగా ఆడాల్సి ఉంటుంది. జట్టు పరాజయంలో ఏదో ఒక రూపంలో ధోని పరోక్షంగా కారణమైనా...సెలక్టర్లకు సాకు దొరికినట్లే!
మరో 4 ఆడితే...
ధోని తన కెరీర్‌లో మరో కీలక మైలురాయికి చేరువయ్యాడు. ప్రస్తుతం 296 వన్డేలు ఆడిన మాజీ కెప్టెన్, మరో నాలుగు మ్యాచ్‌లు ఆడితే 300 మ్యాచ్‌ల క్లబ్‌లో చోటు దక్కించుకుంటాడు. భారత్ తరఫున సచిన్, ద్రవిడ్, అజహర్, గంగూలీ, యువరాజ్ మాత్రమే ఈ ఘనత సాధించగా, ఓవరాల్‌గా 19 మంది మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. వన్డే కెరీర్‌లో 9,496 పరుగులు చేసిన ధోని ప్రస్తుత సగటు 51.32. తర్వాతి నాలుగు వన్డేల్లో అతను ఒక్క పరుగూ చేయకపోయినా కూడా అతని సగటు 50.24గా ఉంటుంది. 300 మ్యాచ్‌లు ఆడిన తర్వాత కూడా వన్డే సగటు కనీసం 50 పరుగులు ఉండే ఏకైక ఆటగాడు ధోనినే కానుండటం విశేషం.
ప్రాక్టీస్... ప్రాక్టీస్...
దంబుల్లా: వన్డే సిరీస్‌కు ముందు ధోని తొలిసారి శ్రీలంకలో తన సన్నాహకాలకు పదును పెట్టాడు. గురువారం అతను సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఆరంభంలో కొంత ఇబ్బంది పడ్డా, ఆ తర్వాత తన సహజ శైలిలో షాట్‌లు ఆడాడు. ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో టెస్టు సిరీస్ ఆడిన ఆటగాళ్లెవరూ ప్రాక్టీస్‌కు రాలేదు. ధోనితో పాటు జాదవ్, పాండే, చహల్, శార్దుల్ సాధన చేశారు.