జిల్ జిల్ జి‘గేల్’ | Chris Gayle hammers England with century for West Indies at World T20 | Sakshi
Sakshi News home page

జిల్ జిల్ జి‘గేల్’

Published Thu, Mar 17 2016 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

జిల్ జిల్ జి‘గేల్’

జిల్ జిల్ జి‘గేల్’

 ► అజేయ సెంచరీతో చెలరేగిన కరీబియన్ స్టార్ 
 ► ఇంగ్లండ్‌పై విండీస్ ఘన విజయం  టి20 ప్రపంచకప్

 
విధ్వంసానికి పరాకాష్ట... క్రిస్‌గేల్ ఎప్పుడు టి20 మ్యాచ్ ఆడినా చాలా సహజంగా వినిపించే పదం. ఈసారి అలాంటి విధ్వంసాన్ని మించిన విలయం సృష్టిస్తూ... బంతికే భయం పుట్టిస్తూ... ప్రత్యర్థుల వెన్నులో వణుకు తెప్పిస్తూ... మరోసారి క్రిస్‌గేల్ విశ్వరూపం చూపించాడు. టి20 ప్రపంచకప్ చరిత్రలో వేగవంతమైన సెంచరీతో వెస్టిండీస్‌కు ఘన విజయాన్ని అందించాడు.

  
ముంబై:  టి20ల్లో తను ఎంత ప్రమాదకరమో క్రిస్ గేల్ (48 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 11 సిక్సర్లు) మరోసారి నిరూపించాడు. కళ్ల ముందు భారీ లక్ష్యం ఉన్నా... పూనకం వచ్చినోడిలా ఇంగ్లిష్ బౌలర్ల భరతం పట్టాడు. సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపిస్తూ టి20 ప్రపంచకప్‌లో అజేయ సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో కరీబియన్ జట్టు 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. రూట్ (36 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బట్లర్ (20 బంతుల్లో 30; 3 సిక్సర్లు), హేల్స్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు), మోర్గాన్ (14 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) తలా కొన్ని పరుగులు చేశారు.

37 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్‌ను రూట్, హేల్స్ రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించి ఆదుకున్నారు. దీంతో తొలి పది ఓవర్లలో ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. మిడిలార్డర్‌లో బట్లర్, మోర్గాన్ నాలుగో వికెట్‌కు  3.3 ఓవర్లలోనే 38 పరుగులు జత చేశారు. ఓవరాల్‌గా చివరి మూడు ఓవర్లలో 40 పరుగులు వచ్చాయి.

లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన వెస్టిండీస్ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు చేసింది. తొలి ఓవర్‌లోనే చార్లెస్ (0)ను అవుట్ చేసి ఇంగ్లండ్ ఆరంభంలోనే విండీస్‌కు షాకిచ్చింది. అయితే రెండో ఓవర్‌లో ఓ ఫోర్, సిక్సర్‌తో కాస్త కుదురుకున్న గేల్ ఆ తర్వాత తన విశ్వరూపం చూపాడు. సహచరులు మెల్లగా ఆడినా... తను మాత్రం సిక్సర్ల జోరు చూపెట్టాడు. శామ్యూల్స్ (27 బంతుల్లో 37; 8 ఫోర్లు) కూడా వరుస బౌండరీలు బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి కరీబియన్ జట్టు స్కోరు 55/1గా మారింది. ఆరో ఓవర్‌లో శామ్యూల్స్ అవుట్‌కావడంతో రెండో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

తర్వాత రామ్‌దిన్ (12) నెమ్మదించినా... రషీద్, స్టోక్స్ ఓవర్లలో గేల్ నాలుగు సిక్సర్లు బాదాడు. కానీ వరుస ఓవర్లలో రామ్‌దిన్, డ్వేన్ బ్రేవో (2)లు అవుట్‌కావడంతో విండీస్ కాస్త తడబడింది. అయితే అలీ వేసిన 14వ ఓవర్‌లో గేల్ వరుసగా మూడు సిక్సర్లతో 22 పరుగులు రాబట్టి మళ్లీ ఊపు తెచ్చాడు. రస్సెల్ (16 నాటౌట్) సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ గేల్‌కు ఎక్కువగా బ్యాటింగ్ ఇవ్వడంతో ప్రత్యర్థి బౌలర్లు చేష్టలుడిగిపోయారు. 16వ ఓవర్‌లో మరో రెండు సిక్సర్లు బాదిన గేల్.... 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఓవరాల్‌గా రామ్‌దిన్‌తో మూడో వికెట్‌కు 46; రస్సెల్‌తో ఐదో వికెట్‌కు అజేయంగా 70 పరుగులు జత చేయడంతో విండీస్  11 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.   

 స్కోరు వివరాలు
 ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) బద్రీ (బి) రస్సెల్ 15; హేల్స్ (బి) బెన్ 28; రూట్ (సి) టేలర్ (బి) రస్సెల్ 48; బట్లర్ (సి) బ్రాత్‌వైట్ (బి) బ్రేవో 30; మోర్గాన్ నాటౌట్ 27; స్టోక్స్ ఎల్బీడబ్ల్యు (బి) బ్రేవో 15; మొయిన్ అలీ రనౌట్ 7; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 182.

 వికెట్ల పతనం: 1-37; 2-92; 3-114; 4-152; 5-175; 6-182. బౌలింగ్: టేలర్ 3-0-30-0; బద్రీ 4-0-34-0; రస్సెల్ 4-0-36-2; డ్వేన్ బ్రేవో 4-0-41-2; బెన్ 3-0-23-1; బ్రాత్‌వైట్ 2-0-16-0.

 వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) అలీ (బి) విల్లే 0; గేల్ నాటౌట్ 100; శామ్యూల్స్ (సి) విల్లే (బి) రషీద్ 37; రామ్‌దిన్ (సి) రషీద్ (బి) అలీ 12; బ్రేవో (సి) హేల్స్ (బి) టోప్లే 2; రస్సెల్ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 183.
వికెట్ల పతనం: 1-2; 2-57; 3-103; 4-113.
బౌలింగ్: విల్లే 3-0-33-1; టోప్లే 2.1-0-22-1; జోర్డాన్ 4-0-24-0; స్టోక్స్ 3-0-42-0; రషీద్ 2-0-20-1; అలీ 4-0-38-1.
 

  విశేషాలు
టి20 ప్రపంచకప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (10) కొట్టిన బ్యాట్స్‌మన్‌గా గతంలో తన పేరిట ఉన్న రికార్డును ఈ మ్యాచ్‌లో గేల్ (11 సిక్సర్లు) సవరించాడు.

టి20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా గేల్ (98 సిక్సర్లు) నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్-91 సిక్సర్లు) పేరిట ఉండేది.

టి20 ప్రపంచకప్ చరిత్రలో ఇది ఎనిమిదో సెంచరీ. ఓవరాల్‌గా టి20 అంతర్జాతీయ పోటీల్లో ఇది 20వ సెంచరీ. ఈ 20 సెంచరీల్లో గేల్, మెకల్లమ్‌లవి రెండేసి ఉన్నాయి.

టి20 ప్రపంచకప్‌లో తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రికార్డును గేల్ (47 బంతుల్లో) నెలకొల్పాడు. టి20 అంతర్జాతీయ పోటీల్లో ఇది సంయుక్తంగా మూడో వేగవంతమైన సెంచరీ. రిచర్డ్ లెవీ (దక్షిణాఫ్రికా-45 బంతుల్లో), డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా-46 బంతుల్లో), ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా-47 బంతుల్లో) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement