ఒకరి కోసం మరొకరు..!
► ఒక్క అడుగు దూరంలో ‘మిషన్’
► కరీబియన్ క్రికెట్‌లో కొత్త కళ
కోల్‌కతానుంచి సాక్షి క్రీడా ప్రతినిధి :- క్రమశిక్షణ పేరుతో ఏడాది క్రితం ఇద్దరి ఆటగాళ్లపై వేటు... టెస్టు క్రికెట్ పరిస్థితి చూస్తే అధ్వాన్నం... బోర్డుకు, క్రికెటర్లకు మధ్య సు దీర్ఘ కాలంగా తెగని సమస్యలు... డబ్బులు దక్కని పరిస్థితుల్లో టోర్నీకి దూరమయ్యేం దుకు కూడా సిద్ధమైన ఆటగాళ్లు... అంతా గందరగోళం... టి20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు వెస్టిండీస్ పరిస్థితి ఇది. అందుకే వ్యక్తిగతంగా చాలామంది టి20 స్టార్స్ ఉన్నా జట్టుగా కరీబియన్ల మీద ఎవరికీ అంచనాలు లేవు. కానీ భారత్‌ను సెమీస్‌లో ఓడించాక ఆ జట్టు మీద మరింత గౌరవం పెరిగింది.
చాంపియన్ పాట
నాలుగేళ్ల క్రితం శ్రీలంకలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో గంగ్‌నమ్ స్టైల్ డ్యాన్స్‌తో వెస్టిండీస్ క్రికెటర్లు సందడి చేశారు. అనూహ్యంగా, అంచనాలకు అందకుండా రాణించి ఆ టైటిల్ గెలిచిన కరీబియన్లు ఒక రకంగా క్రికెట్ అభిమానుల్లో గంగ్‌నమ్ పాటకు క్రేజ్ పెంచారు కూడా. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో 2014లో విఫలమైన స్యామీ సేనపై ఈసారి కూడా టోర్నీ ఆరంభానికి ముందు అంచనాలు లేవు. అసలు ఈ ఏడాది ఈ జట్టు ఒక్క అంతర్జాతీయ టి20 కూడా ఆడలేదు. జట్టును ప్రకటించడానికి కూడా బోర్డు పలుసార్లు ఆలోచించింది. కాంట్రాక్టు వివాదంతో అసలు తాము వెళ్లమని సీనియర్లంతా బోర్డుతో గొడవపెట్టుకున్నట్లు ప్రచారం జరిగింది. ‘కొన్ని ఘటనలు జరిగి ఉండకపోతే మేం జట్టుగా ఇంతలా కలిసిపోయేవాళ్లం కాదేమో. టోర్నీకి ముందు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం.
మా జట్టును ఎవరూ గౌరవించలేదు. ఇలాంటి ఘటనలతో అందరం ఒక్కటయ్యాం. ఒకరికోసం ఒకరనే మంత్రం జపించాం. అలాగే మేం సాధించగలం అనే నమ్మకాన్ని ఎప్పుడూ వీడలేదు. అదిప్పుడు ఆటలో కనిపిస్తోంది’ అని కెప్టెన్ స్యామీ ఉద్వేగంగా చెప్పాడు. ఇప్పుడు బ్రేవో పాట ‘చాంపియన్’ వారికి జాతీయగీతంలా మారిపోయింది. మైదానంలో వారి జోష్, సంబరాలు మరే జట్టుకు సాధ్యం కాని విధంగా సాగుతున్నాయి. తమను చిత్తు చేసిన చిన్న జట్టు అఫ్ఘానిస్తాన్‌తో కూడా ఆడిపాడగలగడం కరీబియన్లకే సాధ్యం.
ఒకటే లక్ష్యం...
మేం ఒక మిషన్‌తో భారత్ వచ్చాం అని పదే పదే స్యామీ చెబుతున్నాడు. ఆ మిషన్ కచ్చితంగా ప్రపంచకప్ టైటిల్. ఇక దీనిని అందుకోవడానికి అడుగు దూరంలో ఉన్నారు. అయితే ఫైనల్ ప్రత్యర్థి ఇంగ్లండ్ కూడా బలంగానే ఉంది. కానీ ప్రత్యర్థి ఎవరనే ఆలోచన ఎప్పుడూ వెస్టిండీస్‌కు ఉండదు. మా జట్టులో 15 మందీ మ్యాచ్ విన్నర్లే అని పదే పదే కెప్టెన్ చెప్పినా... అందరి చూపూ ప్రతిసారీ గేల్ మీదే ఉంటోంది. ఈ టోర్నీలో గేల్ విఫలమైన మూడు మ్యాచ్‌ల్లోనూ విండీస్ గెలిచింది. ముఖ్యంగా సెమీస్‌లో తీవ్ర ఒత్తిడిలో భారత్‌పై సిమన్స్, రసెల్, చార్లెస్ ఆడిన తీరు... ఆ జట్టులో అందరూ చాంపియన్లే అనే కెప్టెన్ నమ్మకానికి ప్రతీక. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ చేతిలో ఓడినా... భారత్‌తో ఆడిన తీరు చూస్తే సరైన సమయంలో గాడిలో పడ్డట్లు కనిపిస్తోంది.
ఈ ఏడాది వెస్టిండీస్ అండర్-19 ప్రపంచకప్ గెలవడం, మహిళల జట్టు కూడా టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరడం చూస్తే ఇది వెస్టిండీస్ సీజన్‌లా ఉంది. ‘మేం ఒకరకంగా ప్రపంచం అందరితో ఏకకాలంలో పోరాడుతున్నాం. మా విజయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. టైటిల్ గెలిస్తే మాకు కలిగే ఆనందంతో పోలిస్తే ఏ ఇతర జట్టు గెలిచినా వారికి అంతటి సంతోషం దక్కదు’ అని స్యామీ చెప్పే మాటల్లో వాస్తవం ఉంది. ఎందుకంటే ఇప్పుడు విండీస్ విజ యాన్ని ఆస్వాదించేందుకు ఆ దేశం బయట కూడా పెద్ద సంఖ్యలో జట్టుకు అభిమానులు ఉన్నారు. మరి చాంపియన్ పాట ఫైనల్ తర్వాత కూడా అదే మోత మోగిస్తుందా?.