మరికొన్ని గంటల్లో బ్రిటన్ రాజుగా ఛార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జి మౌంట్‌బాటన్ (చార్లెస్–3) పట్టాభిషిక్తుడు కాబోతున్నారు. ఒకప్పుడు ‘రవి అస్తమించని సామ్రాజ్యం’గా ప్రపంచపటంలో ధగ దగలాడిన బ్రిటన్ నేడు తానున్న యూరప్ ఖండంలో కూడా ఒంటరి పయనం సాగించడాన్ని ఎంచుకున్న చిన్న దేశంగా మిగిలిపోయింది. ఆ దేశంలో 18వ శతాబ్దంలోనే రాచరికం నామమాత్రంగా మిగిలి సర్వాధికారాలూ పార్లమెంటుకు బదిలీ అయ్యాయి.
మరో మూడు శతాబ్దాలు గడి చినా అది తన గత వైభవానికీ, అగమ్యగోచరమైన భవిష్యత్తుకూ మధ్య ఊగిసలాడుతూనే ఫ్యూడల్ అవశే షమైన సంప్రదాయాలనూ, లాంఛనాలనూ వదులుకోవటానికి ఏమాత్రం సిద్ధపడటంలేదని శనివారంనాటి పట్టాభిషేకం రుజువుచేయబోతోంది. ఆరు గుర్రాలు పూన్చిన రథంలో ముందే నిర్దే శించిన సెంట్రల్ లండన్ వీధులగుండా వెస్ట్ మినిస్టర్ అబీగా పిలిచే సెయింట్ పీటర్ చర్చిలో ఉదయం 11 గంటలకల్లా చార్లెస్ ప్రవేశించి ఏడువందల ఏళ్లనాటి సింహాసనాన్ని అధిష్టిస్తారు.
‘గాడ్ సేవ్ ద కింగ్ చార్లెస్’ అనే ఆశీర్వచనంలాంటి నినాదం మార్మోగుతుండగా మణులు, మాణిక్యాలు, కెంపులు, గోమేధికాలు, గరుడపచ్చలు పొదిగిన దాదాపు నాలుగు వందల ఏళ్లనాటి బంగారు కిరీటం ఆయన శిరస్సును అలంకరిస్తుంది. ఈ పట్టాభిషేక తంతులో కాలం గడిచేకొద్దీ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు మొత్తంగా చర్చి ఆఫ్ ఇంగ్లండ్ ఆధిపత్యమే ఉండే ఆ కార్యక్రమంలో ఇప్పుడు భిన్న మతవిశ్వాసాల ఆచార్యులుంటున్నారు.
కేవలం సంపన్నులకూ, దేశా ధినేతలకూ మాత్రమే ప్రవేశముండే ఆ కార్యక్రమంలో సాధారణ పౌరులకు కూడా చోటుదక్కుతోంది. దాంతోపాటే ఒకనాడు పట్టాభిషేక సందర్భంలో ఇంటింటా పండుగ వాతావరణం కనబడిన చోటే ‘ఎందుకిదంతా?’ అనే ప్రశ్నలు మొలకెత్తడం కూడా మొదలైంది. రాచ రికాన్ని వదుల్చుకుంటే తప్ప బ్రిటన్ సంపూర్ణ ఆధునికతను సంతరించుకోదన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. ఫ్యూడల్ చిహ్నమైన రాచరికం స్థానంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే రాజ్యాధినేత ఉండటం వర్తమాన అవసరమని అటువంటివారు వాదిస్తున్నారు.
‘రాచరికంలోకి ఒక్కసారి తొంగి చూశామా.. దాన్ని కీర్తించటం అసాధ్యం’ అని బ్రిటన్ రాజ్యాంగనిపుణుడు వాల్లర్ బాజెట్ ఒకప్పుడు అననే అన్నారు. అయితే ప్రపంచంలో బ్రిటన్ రాచరికం ఏకాకి కాదు. మరో 28 దేశాల్లో కూడా ఆ వ్యవస్థలే వర్థిల్లుతున్నాయి. అందులో పూర్తి స్థాయి నియంత్రణాధికారాలుండే రాజులు మొదలుకొని సగం సగం అధికారాలతో సరిపెట్టుకొనేవారూ, పూర్తి అలంకారప్రాయంగా మిగిలిపోయినవారూ కూడా ఉన్నారు. అలాగే తిరుగులేని సంపదలతో తులతూగేవారూ, ప్రభుత్వాలు దయతో ఇచ్చే జీతభత్యా లతో సరిపుచ్చుకునే రాజులు కూడా ఉన్నారు. లాంఛనప్రాయపు హోదాయే కావొచ్చుగానీ చార్లెస్ ఒక్క బ్రిటన్‌కు మాత్రమే కాదు... మరో 14 దేశాలకు సైతం రాజ్యాధిపతిగా కొనసాగుతారు.
ప్రపంచంలోని ఇతర దేశాల మాట అటుంచి సంపన్న దేశాల క్లబ్ అయిన జీ–7లో కూడా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ నాసిరకమైనదే. అక్కడ ప్రస్తుతం ‘జీవన వ్యయ సంక్షోభం’ రాజ్యమేలుతోంది. తడిసిమోపడయ్యే వడ్డీ రేట్లతో, భరింపశక్యంకాని ద్రవ్యోల్బణంతో, ఆకాశాన్నంటే ఇంధన ధరలతో అక్కడి జనం ఈసురోమంటున్నారు. గత ఇరవైయ్యేడేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వడ్డీరేట్లు పెరిగిపోయాయి.
ఈ ఏడాది ఆఖరువరకూ అది కోలుకునే అవకాశం లేదని ఆర్థిక నిపుణులంటున్నారు. ప్రస్తుతం నిరుద్యోగిత 3.9 శాతం. దాదాపు 13 లక్షలమంది పౌరులు ఉపాధి కోల్పోయారని జాతీయ గణాంకాల విభాగం గత నెలలో తెలిపింది. సగటున ప్రతి అయిదుగురు బ్రిటన్ పౌరు ల్లోనూ ఒకరు పేదరికంలో కూరుకుపోయారని గణాంకాలు కోడై కూస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. చాలీచాలని ఆదాయాలతో అర్థాకలితో నెట్టుకొచ్చే కుటుంబాలూ.. దాతృత్వ సంస్థల సాయంతో, చర్చిల ఆధ్వర్యంలో నడిచే ఫుడ్ బ్యాంకులపై ఆధారపడుతున్న కుటుంబాలూ ఎక్కువేనని ఒక అంచనా.
అందుకే కాబోలు ఈసారి పట్టాభిషేక మహోత్సవ కార్య క్రమంలో అట్టహాసాలు తగ్గించాలని నిర్ణయించారు. కార్యక్రమం నిడివి బాగా తగ్గిపోగా, అతిథుల జాబితా కూడా చిన్నబోయింది. అయితే ఈ కార్యక్రమానికయ్యే మొత్తం వ్యయం ఎంతో చెప్పటం వెంటనే సాధ్యం కాకపోయినా అది ఎలా చూసినా 12.5 కోట్ల డాలర్లకు తగ్గకపోవచ్చని మీడియా లెక్కలేస్తోంది. వర్తమాన చేదు వాస్తవాలనూ, సంక్లిష్టతలనూ పరిగణనలోకి తీసుకోకుండా భూత కాలం చూరుపట్టుకుని వేళ్లాడటం ఇంకా ఎన్నాళ్లని పలువురు ప్రశ్నించటానికి ఇలాంటి కథనాలు కారణం కావొచ్చు.
నెపోలియన్‌తో సాగిన వరస యుద్ధాల పరంపరలో గెల్చామన్న సంబరంతో బ్రిటన్ 1821లో నాలుగో జార్జి పట్టాభిషేకాన్ని కనీవినీ ఎరుగనంత ఘనంగా జరుపుకుంది. దానిపై విమర్శకులు విరుచుకుపడటంతో మరో పదేళ్లకు 1831లో అతని వారసుడు నాలుగో విలియం మాత్రం అతి నిరాడంబరంగా, క్లుప్తంగా పట్టాభిషేకం తంతు ముగించారు.
మొత్తానికి ఏడుపదుల కాలం తర్వాత బ్రిటన్‌లో పట్టాభిషేక మహోత్సవం జరగబోతోంది. రాచరికంపై దేశ పౌరుల్లో ఉండే వ్యతిరేకత కనుమరుగు కావటం, కనీసం అభ్యంతరాలు వ్యక్తం కాకపోవటం అనేవి చార్లెస్ వ్యవహారశైలిపై ఆధారపడివుంటాయి. ఆయన శనివారం ధరించబోయే కిరీటం బరువు 5 పౌండ్లు (సుమారు 2.27 కిలోలు). కానీ ‘మూడో చార్లెస్’గా ఆయనపై ఉండ బోయే బాధ్యతల బరువు అంతకన్నా అనేక రెట్లు ఎక్కువ. దాన్ని ఆయన సమర్థవంతంగా నిర్వహించగలిగితే చరిత్రలో ఆయన స్థానం పదిలంగా ఉంటుంది.
బ్రిటన్‌లో రాజుగారి ఏలుబడి!
Published Sat, May 6 2023 12:17 AM | Last Updated on Sat, May 6 2023 12:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment