Syami
-
డబ్బు కోసం కాదు...దేశం కోసం...
► మళ్లీ సాధించిన వెస్టిండీస్ ► గెలుపు కోసం ప్రాణాలొడ్డిన ఆటగాళ్లు ► అంతా ఒకటై... ఒకరి కోసం ఒకరై.. కోల్‌కతా నుంచి మొహమ్మద్ అబ్దుల్ హాది :- మేం డబ్బు కోసం కాదు, దేశం కోసం ఆడతాం... ఫైనల్లో విజయం తర్వాత దిక్కులు పిక్కటిల్లేలా ఇలా అరవాలని డారెన్ స్యామీకి అనిపించి ఉంటుంది. లీగ్‌లను చూపించి తమను డబ్బు మనుషులుగా లెక్కిస్తున్న వారికి గట్టిగా జవాబివ్వాలని కూడా అతని మనసులో ఆలోచన వచ్చి ఉంటుంది. టైటిల్ గెలవడంలో వారి పోరాటం అసాధారణం. ఒక్కో మ్యాచ్‌లో గెలుపు కోసం ప్రతీ ఆటగాడు ప్రాణాలు ఒడ్డినట్లుగా పోరాడాడు. వారి దృష్టిలో ఇది కేవలం క్రికెట్ మాత్రమే కాదు. తమను తాము నిరూపించుకోవడానికి, తమని తాము కాపాడుకోవడానికి ఈ ప్రపంచకప్ విజయం అత్యవసరం. పోరాడుతూనే పయనం దీవించాల్సిన తండ్రి శపిస్తాను అంటే ఎలా ఉంటుందో వెస్టిండీస్ క్రికెట్ పరిస్థితి సరిగ్గా అలాగే కనిపించింది. అండగా నిలవాల్సిన వారి సొంత బోర్డే వారిపై కత్తి కట్టింది. డబ్బులు ఇవ్వం పొమ్మంది, ‘ఆడకుంటే వేరేవాళ్లను పంపిస్తాం ఏం చేస్తారో చేసుకోండి’ అంది. కానీ ఆటపై ప్రేమ వారిని అన్ని షరతులకు అంగీకరించేలా చేసింది. అధికారులపై ఉన్న కసి అందరినీ ఒక్కటి చేసింది. వెస్టిండీస్‌లో బయల్దేరినప్పుడు అందరికీ ఒకే లక్ష్యం. వరల్డ్ కప్ మళ్లీ గెలవాలి. తమ సత్తా ఏమిటో, తాము ఏం చేయగలమో చూపించాలి. లేదంటే మళ్లీ సొంతవారే కత్తి గడతారు. చెప్పు చేతల్లో ఉంచుకోవాలనుకునేవారి నోళ్లు మళ్లీ లేస్తాయి. ఇలాంటి సమయంలో అంతా ఒకటైయ్యారు. ప్రతీ రోజు, ప్రతీ క్షణం తమ లక్ష్యాన్ని గుర్తు చేసుకున్నారు. బ్రేవో పాట చాంపియన్ వారి దినచర్యలో భాగమైపోయింది. దానిని ఒక స్ఫూర్తిగా మార్చుకున్నారు. జట్టులో చిన్న పెద్ద భేదాలు లేకుండా గేల్ అయినా బ్రాత్‌వైట్ అయినా ఒక్కటిగా మారి శ్రమించారు. ఆటలో ప్రతీ పరుగును ఆస్వాదించారు. ప్రతీ వికెట్‌కూ చిందులేశారు. 15 మంది విన్నర్లు... మా జట్టులో 15 మంది మ్యాచ్ విన్నర్లు అంటూ ప్రతీ మ్యాచ్ సందర్భంగా స్యామీ చెబుతూ వచ్చినప్పుడు అది కాస్త అతిశయోక్తిగా కనిపించింది. కానీ వారంతా అతని మాటను, నమ్మకాన్ని నిలబెట్టారు. ఈ సారి బ్రాత్‌వైట్ బాధ్యత తీసుకున్నాడు. గతంలో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 25 పరుగులే చేసిన అతను ఈ సారి నాలుగు సిక్సర్లతో చరిత్రను మార్చేశాడు. వరల్డ్ కప్‌లో ఐదు మ్యాచ్‌లలో అంతంత మాత్రంగానే ఆడిన శామ్యూల్స్ అసలు పోరులో తన దూకుడు ప్రదర్శించాడు. ఎక్కువగా హడావిడి చేయకున్నా బద్రీ కీలక పాత్ర పోషించాడు. టాప్-6 ఆటగాళ్లలో ప్రతీ ఒక్కరు ఒక్కో మ్యాచ్ విజయంలో తమ పాత్రను అద్భుతంగా పోషించడం విశేషం. ముఖ్యంగా సెమీ ఫైనల్, ఫైనల్లో ఆ జట్టు ఆటతీరు అసమానంగా కనిపించింది. ఫైనల్లోనైతే ఓటమి ఖాయం అనిపించిన దశలో కూడా కోలుకొని తమదైన శైలిలో విధ్వంసంతో మ్యాచ్ గెలవడం అసాధారణం. గ్రేట్ కెప్టెన్ ఫైనల్ తర్వాత స్యామీ ప్రసంగం భావోద్వేగంతో సాగడం చూస్తే ఈ విజయానికి వారి దృష్టిలో ఎలాంటి విలువ ఉందో అర్థమవుతుంది. బోర్డుతో సమస్యలు, డబ్బు కోసమే ఆడతామనే విమర్శలు, అసలు బుర్ర లేదనే వ్యాఖ్యలు వారిని ఎంతగా బాధించాయో... ఇప్పుడు గెలుపుతో దానిని గట్టి జవాబిచ్చామన్నట్లే అతను మాట్లాడాడు. ఆరడగుల లక్ష్యంతో కరీబియన్ నుంచి బయల్దేరామన్న అతను, ఆ లక్ష్యం చేరే దాకా విశ్రమించలేదు. వ్యక్తిగతంగా స్యామీ విఫలమైనా, కెప్టెన్‌గా అతను విజయవంతంగా జట్టును నడిపించాడు. తన బౌలర్లను ఉపయోగించుకోవడంలో అతని పరిణతి కనిపించింది. ఫలితమే ఇప్పుడు రెండు వరల్డ్ కప్ టైటిల్స్ సాధించిన కెప్టెన్‌గా దిగ్గజం లాయిడ్ సరసన అతడిని నిలబెట్టింది. ►రెండుసార్లు వన్డే వరల్డ్ కప్‌ను, రెండుసార్లు టి20 ప్రపంచకప్‌ను గెల్చుకున్న తొలి జట్టుగా వెస్టిండీస్ గుర్తింపు పొందింది ► ఓ టి20 మ్యాచ్‌లో చివరి ఓవర్లో 24 పరుగులు చేసి నెగ్గిన తొలి జట్టు వెస్టిండీసే. 2010 ప్రపంచకప్ సెమీస్‌లో పాక్‌పై ఆస్ట్రేలియా 23 పరుగులు చేసి గెలిచింది. ► ప్రపంచకప్ ఫైనల్స్‌లో రెండేసి అర్ధ సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మన్ శామ్యూల్స్. 2012 వరల్డ్ కప్ ఫైనల్లోనూ శామ్యూల్ అర్ధ సెంచరీ చేశాడు. గతంలో సంగక్కర (2009, 2014) ఈ ఘనత సాధించాడు. ► ఫైనల్‌కు ముందు బ్రాత్‌వైట్ ఏడు టి20 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు వికెట్లు తీశాడు. కానీ ఇంగ్లండ్‌తో ఫైనల్లో అతను మూడు వికెట్లు పడగొట్టడంతోపాటు అజేయంగా 34 పరుగులు చేశాడు. విండీస్ నామ సంవత్సరం... వరల్డ్‌కప్‌లో విండీస్ విజయ ప్రస్థానం సాధారణమైంది కాదు. మా అమ్మాయిలు గెలిచి స్ఫూర్తి నింపారు. దానిని మేం కొనసాగించి ట్రిపుల్ ధమాకా చేస్తాం అని మ్యాచ్‌కు ముందే స్యామీ, బ్రేవో చెప్పారు. చివరకు దానిని సాధించి చూపించారు. ఈ ఏడాది విండీస్ అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. 2016లో నాలుగు నెలలు కూడా పూర్తి కాక ముందే మరో రెండు టైటిల్స్ కరీబియన్ ఖాతాలో చేరాయి. ఇది వెస్టిండీస్ క్రికెట్ ఆనందాన్ని మూడు రెట్లు చేసిందనడంలో సందేహం లేదు. కరీబియన్ కలలు నెరవేర్చుకున్న ఈ బృందం సగర్వంగా మరోసారి విశ్వవిజేత స్థానంలో నిలబడింది. ఈ విజయాలు ఆ దీవుల్లో క్రికెట్ పునరుజ్జీవానికి ఉపయోగపడితే అంతకు మించిన ఆనందం ఉండదు. -
ఒకరి కోసం మరొకరు..!
► ఒక్క అడుగు దూరంలో ‘మిషన్’ ► కరీబియన్ క్రికెట్లో కొత్త కళ కోల్‌కతానుంచి సాక్షి క్రీడా ప్రతినిధి :- క్రమశిక్షణ పేరుతో ఏడాది క్రితం ఇద్దరి ఆటగాళ్లపై వేటు... టెస్టు క్రికెట్ పరిస్థితి చూస్తే అధ్వాన్నం... బోర్డుకు, క్రికెటర్లకు మధ్య సు దీర్ఘ కాలంగా తెగని సమస్యలు... డబ్బులు దక్కని పరిస్థితుల్లో టోర్నీకి దూరమయ్యేం దుకు కూడా సిద్ధమైన ఆటగాళ్లు... అంతా గందరగోళం... టి20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు వెస్టిండీస్ పరిస్థితి ఇది. అందుకే వ్యక్తిగతంగా చాలామంది టి20 స్టార్స్ ఉన్నా జట్టుగా కరీబియన్ల మీద ఎవరికీ అంచనాలు లేవు. కానీ భారత్‌ను సెమీస్‌లో ఓడించాక ఆ జట్టు మీద మరింత గౌరవం పెరిగింది. చాంపియన్ పాట నాలుగేళ్ల క్రితం శ్రీలంకలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్‌తో వెస్టిండీస్ క్రికెటర్లు సందడి చేశారు. అనూహ్యంగా, అంచనాలకు అందకుండా రాణించి ఆ టైటిల్ గెలిచిన కరీబియన్లు ఒక రకంగా క్రికెట్ అభిమానుల్లో గంగ్నమ్ పాటకు క్రేజ్ పెంచారు కూడా. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో 2014లో విఫలమైన స్యామీ సేనపై ఈసారి కూడా టోర్నీ ఆరంభానికి ముందు అంచనాలు లేవు. అసలు ఈ ఏడాది ఈ జట్టు ఒక్క అంతర్జాతీయ టి20 కూడా ఆడలేదు. జట్టును ప్రకటించడానికి కూడా బోర్డు పలుసార్లు ఆలోచించింది. కాంట్రాక్టు వివాదంతో అసలు తాము వెళ్లమని సీనియర్లంతా బోర్డుతో గొడవపెట్టుకున్నట్లు ప్రచారం జరిగింది. ‘కొన్ని ఘటనలు జరిగి ఉండకపోతే మేం జట్టుగా ఇంతలా కలిసిపోయేవాళ్లం కాదేమో. టోర్నీకి ముందు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. మా జట్టును ఎవరూ గౌరవించలేదు. ఇలాంటి ఘటనలతో అందరం ఒక్కటయ్యాం. ఒకరికోసం ఒకరనే మంత్రం జపించాం. అలాగే మేం సాధించగలం అనే నమ్మకాన్ని ఎప్పుడూ వీడలేదు. అదిప్పుడు ఆటలో కనిపిస్తోంది’ అని కెప్టెన్ స్యామీ ఉద్వేగంగా చెప్పాడు. ఇప్పుడు బ్రేవో పాట ‘చాంపియన్’ వారికి జాతీయగీతంలా మారిపోయింది. మైదానంలో వారి జోష్, సంబరాలు మరే జట్టుకు సాధ్యం కాని విధంగా సాగుతున్నాయి. తమను చిత్తు చేసిన చిన్న జట్టు అఫ్ఘానిస్తాన్‌తో కూడా ఆడిపాడగలగడం కరీబియన్లకే సాధ్యం. ఒకటే లక్ష్యం... మేం ఒక మిషన్‌తో భారత్ వచ్చాం అని పదే పదే స్యామీ చెబుతున్నాడు. ఆ మిషన్ కచ్చితంగా ప్రపంచకప్ టైటిల్. ఇక దీనిని అందుకోవడానికి అడుగు దూరంలో ఉన్నారు. అయితే ఫైనల్ ప్రత్యర్థి ఇంగ్లండ్ కూడా బలంగానే ఉంది. కానీ ప్రత్యర్థి ఎవరనే ఆలోచన ఎప్పుడూ వెస్టిండీస్‌కు ఉండదు. మా జట్టులో 15 మందీ మ్యాచ్ విన్నర్లే అని పదే పదే కెప్టెన్ చెప్పినా... అందరి చూపూ ప్రతిసారీ గేల్ మీదే ఉంటోంది. ఈ టోర్నీలో గేల్ విఫలమైన మూడు మ్యాచ్‌ల్లోనూ విండీస్ గెలిచింది. ముఖ్యంగా సెమీస్‌లో తీవ్ర ఒత్తిడిలో భారత్‌పై సిమన్స్, రసెల్, చార్లెస్ ఆడిన తీరు... ఆ జట్టులో అందరూ చాంపియన్లే అనే కెప్టెన్ నమ్మకానికి ప్రతీక. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ చేతిలో ఓడినా... భారత్‌తో ఆడిన తీరు చూస్తే సరైన సమయంలో గాడిలో పడ్డట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది వెస్టిండీస్ అండర్-19 ప్రపంచకప్ గెలవడం, మహిళల జట్టు కూడా టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరడం చూస్తే ఇది వెస్టిండీస్ సీజన్‌లా ఉంది. ‘మేం ఒకరకంగా ప్రపంచం అందరితో ఏకకాలంలో పోరాడుతున్నాం. మా విజయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. టైటిల్ గెలిస్తే మాకు కలిగే ఆనందంతో పోలిస్తే ఏ ఇతర జట్టు గెలిచినా వారికి అంతటి సంతోషం దక్కదు’ అని స్యామీ చెప్పే మాటల్లో వాస్తవం ఉంది. ఎందుకంటే ఇప్పుడు విండీస్ విజ యాన్ని ఆస్వాదించేందుకు ఆ దేశం బయట కూడా పెద్ద సంఖ్యలో జట్టుకు అభిమానులు ఉన్నారు. మరి చాంపియన్ పాట ఫైనల్ తర్వాత కూడా అదే మోత మోగిస్తుందా?. -
బాదలేకపోయాం
భారత జట్టు వెస్టిండీస్‌ను తక్కువగా అంచనా వేసిందా... క్రిస్ గేల్‌ను అవుట్ చేస్తే చాలు మిగతా ఆటగాళ్లు చెదిరిపోతారని భావించిందా... లేక మిస్టర్ పర్ఫెక్ట్ కెప్టెన్ ధోని కూడా ఒత్తిడిలో వ్యూహాలు పన్నలేక చిత్తయ్యాడా... దాదాపు రెండు వందల పరుగుల స్కోరు చేశాక కూడా టీమిండియా మ్యాచ్ కోల్పోవడం నిజంగా అనూహ్యం. రెండు నోబాల్స్ మాత్రమే ఓటమికి ప్రధాన కారణమా..? భారత్ ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు ఉంటే, వెస్టిండీస్ ఏకంగా 11 బాదింది. ఇదే ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా. బంతిని బలంగా బాదగల విండీస్ బ్యాట్స్‌మెన్ దానిని సమర్థంగా ఉపయోగించుకుంటే, మనం వెనుకబడిపోయాం. బ్యాటింగ్‌లో చూస్తే కోహ్లి మినహా మిగతావారంతా తడబడుతున్నారని తెలుసు. ఎప్పుడూ ఆటగాళ్లను వెనకేసుకొచ్చే ధోని కూడా చివరకు ధావన్‌ను పక్కన పెట్టక తప్పలేదు. ఒక రకంగా 15 మ్యాచ్‌ల తర్వాత కీలకమైన సెమీ ఫైనల్ కోసం జట్టును మార్చాలనుకోవడం ఒక రకంగా సాహసమే. రహానే 35 బంతుల్లో 40 పరుగులు చేయడం ధాటిగా అనిపించకపోయినా... నేరుగా ఇలాంటి మ్యాచ్ ఆడటం అంత సులువు కాదు. కానీ ధావన్‌లాగా తొందరగా వికెట్ ఇవ్వకుండా నిలబడ్డాడు కాబట్టి అది మెరుగైన ప్రదర్శనే. ఈ మైదానంలో భారీ స్కోర్లు నమోదు కావడంతో పాటు భారీ లక్ష్య ఛేదన కూడా జరుగుతోందని భారత్‌కు తెలియనిది కాదు. ఆ రకంగా చూస్తే భారత జట్టు చేతిలో వికెట్లు ఉండటంతో మరిన్ని భారీ షాట్లు ఆడాల్సింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సింగిల్స్, డబుల్స్‌తో ఒత్తిడి పెంచారు కాబట్టి ఇక్కడా దానినే ప్రయోగించినట్లు ఉంది. కానీ అది ఛేదన కాబట్టి లక్ష్యంపై స్పష్టత ఉంది. ఇక్కడ వీలైనన్ని పరుగులు చేయడమే లక్ష్యం అయినప్పుడు ఇతర బ్యాట్స్‌మెన్ డగౌట్లో ఉండగా మరిన్ని భారీ షాట్లు పడాల్సింది. ఇక బౌలింగ్‌లో కూడా ధోని వ్యూహాలు ఆశ్చర్య పరిచాయి. మరోసారి అతను చివరి ఓవర్ అద్భుతం ఆశించినట్లున్నాడు. అయితే విండీస్ దూకుడుగా ఆడుతున్న వేళ ముందే ప్రధాన బౌలర్ల కోటా పూర్తయిపోయింది. దాంతో చివరి ఓవర్ పార్ట్ టైమర్ కోహ్లితో వేయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఫలించి ఉంటే బౌలింగ్‌లో కూడా కోహ్లి మరో సచిన్ అయ్యేవాడేమో గానీ వికటించింది. టోర్నీలో మెరుగ్గా బౌలింగ్ చేసిన రైనాను అసలు ప్రయత్నించకపోగా, అశ్విన్ 2 ఓవర్లకే పరిమితమయ్యాడు. మొత్తానికి నోబాల్స్‌కు మించిన కారణాలతో భారత్ ఓడటం యావత్ దేశాన్ని నిరాశలో ముంచింది. ‘మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి టాస్ ఓడిపోవడం చాలా చెడు చేసింది. మేం బౌలింగ్‌కు దిగినప్పుడు పిచ్ స్పిన్నర్లకు ఏమాత్రం సహకరించలేదు. తడి బంతితో సరిగా బౌలింగ్ చేయలేకపోయాం. రెండు నోబాల్స్ వేయడం కూడా నిరాశకు గురి చేసింది. మా పేసర్లు ఒడ్డున పడేస్తారని ఆశించా. కానీ అలా జరగలేదు. ఓవరాల్‌గా పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి.’ -ధోని ‘టాస్ గెలవాలని మాత్రమే కోరుకున్నా. ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలవడం ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది. ఓ లక్ష్యంతో మేం ఇక్కడికి వచ్చాం. ఈ ఏడాది ఆరంభంలో మా అండర్-19 జట్టు ఆడిన ఆటను చూసి మేం స్ఫూర్తి పొందాం. అలాగే మహిళల జట్టు కూడా బాగా ఆడింది. ఓవరాల్‌గా రెండు జట్లు ఫైనల్‌కు చేరుకోవడం సంతోషంగా ఉంది. భారత్‌లాంటి పటిష్టమైన జట్టుపై గెలవడం పెద్ద సంచలనమే. గెలవగలం అనే నమ్మకమే మమ్మల్ని నడిపిస్తోంది. మేం గేల్ ఒక్కడిపైనే ఆధారపడలేదు. మా జట్టులో 15 మందీ మ్యాచ్ విన్నర్లే.’ - స్యామీ ► టి20 ప్రపంచకప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా వెస్టిండీస్ (193) గుర్తింపు పొందింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా (192; 2010లో పాక్‌పై) పేరిట ఉండేది. -
గేల్ x కోహ్లి
► గేల్‌కోహ్లి నేడు రెండో సెమీ ఫైనల్ ► వెస్టిండీస్‌తో భారత్ పోరు ► గాయంతో యువరాజ్ అవుట్ టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రస్థానాన్ని ఒక్క ముక్కలో తేల్చేయాలంటే కోహ్లి పేరు తప్ప మరొకటి వినిపించదు. టాప్-5లో మిగతా నలుగురు కలిపి 181 పరుగులు చేస్తే, కోహ్లి ఒక్కడే 184 పరుగులు సాధించాడు. కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో ఇప్పుడు కూడా అతడినే దేశం నమ్ముతోంది. అతనిపైనే ఆశలు పెట్టుకుంది. అతను విఫలమైతే ఎలా అనే ఆలోచన కూడా రానంతగా ఫామ్‌లో ఉన్న కోహ్లి మరోసారి తన మ్యాజిక్ చూపించాల్సిన సమయమిది. వెస్టిండీస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వీర విధ్వంసం సృష్టించే క్రిస్‌గేల్ జట్టు భారాన్ని ఒంటిచేత్తో మోస్తున్నాడు. చాలా మంది హిట్టర్లు ఉన్నారని పేరుకు చెప్పుకున్నా... గేల్ అవుటైతే ఆ జట్టు కుప్పకూలిపోవచ్చు. మెరుపు సెంచరీతో అతను గెలిపించిన మ్యాచ్‌ను మినహాయిస్తే మిగతా రెండు మ్యాచ్‌లలో విజయం కోసం తీవ్రంగా శ్రమించిన జట్టు, అఫ్ఘానిస్తాన్ చేతిలో ఓడింది కూడా. బ్యాటింగ్‌తోనే కాదు మానసికంగా కూడా విండీస్‌పై అతని ప్రభావం ఎంతో ఉంది. ప్రపంచకప్ సెమీస్ పేరుకు ఇప్పుడు రెండు జట్ల మధ్య జరుగుతున్నా... కోహ్లి, గేల్ల మధ్య పోటీగానే భావించవచ్చు. ఈ ఇద్దరు ఆటగాళ్లలో ఎవరు తమ స్థాయికి తగినట్లుగా ఆడితే ఆ జట్టుకు గెలుపు ఖాయం. మరి రేసులో మిగిలేదెవరో..! ముంబై నుంచి సాక్షి క్రీడాప్రతినిధి:- వాంఖడే వేదికగా భారత జట్టు మరో మహా మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు (గురువారం) ఇక్కడ జరిగే టి20 ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్లో భారత్, వెస్టిండీస్‌తో తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయం తర్వాత కోలుకొని భారత్ సెమీస్‌కు చేరగా...మూడు విజయాలతో సెమీస్ స్థానం సంపాదించాక అఫ్ఘానిస్తాన్ చేతిలో అనూహ్య ఓటమితో వెస్టిండీస్ ఈ మ్యాచ్‌కు వచ్చింది. కాలి మడమ గాయంతో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం భారత్‌ను ఇబ్బంది పెట్టే పరిణామం. బలాబలాలు, అనుకూలతలు చూస్తే భారత్ ఒకింత ఆధిక్యంలో కనిపిస్తున్నా... టి20ల్లో మాజీ చాంపియన్ విండీస్‌ను తక్కువగా అంచనా వేయలేం. భారం పంచుకుంటారా..? టాప్-5లో నలుగురు ఆటగాళ్లు విఫలమైన తర్వాత కూడా భారత జట్టు సెమీఫైనల్‌కు చేరడం నిజంగా అద్భుతమే. ఈ నాలుగు మ్యాచ్‌లలో కోహ్లి ఒక్కడే 92 సగటు, 132.37 స్ట్రైక్‌రేట్‌తో చెలరేగగా... రోహిత్, ధావన్, రైనా, యువరాజ్ కలిపి కేవలం 11.31 సగటు, 103.87 స్ట్రైక్‌రేట్‌తో మాత్రమే పరుగులు చేయగలిగారు. ఇక మిగతావారు కూడా తమ సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ టోర్నీలో అన్ని వేదికలతో పోలిస్తే పరుగుల వరద పారింది ఇక్కడే. ఇలాంటి బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్ అంటే మనోళ్లు సాధారణంగా రెచ్చిపోతుంటారు. అదే జరిగితే జట్టు గెలుపుపై ఆశలు పెంచుకోవచ్చు. చాలా రోజులుగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని రోహిత్ శర్మ తన విలువ చూపించేందుకు సొంతగడ్డపై అతనికి మంచి అవకాశం లభించింది. ధావన్, రైనా కూడా ధాటిగా ఆడితే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయి. మూడు మ్యాచ్‌లలో నాటౌట్‌గా నిలిచిన ధోనికి మరిన్ని బంతులు ఆడే అవకాశం దక్కితే అతను మ్యాచ్ దిశను మార్చగలడు. యువరాజ్ స్థానంలో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరం. బ్యాట్స్‌మెన్ రహానే, పాండే అందుబాటులో ఉన్నారు. అయితే డెరైక్టర్ రవిశాస్త్రి గత మ్యాచ్‌లో యువరాజ్ వేసిన మూడు ఓవర్ల గురించి నొక్కి చెప్పడం చూస్తే నేగికి అవకాశం ఇస్తారా అనేది చూడాలి. ఆల్రౌండర్లపై నమ్మకం ఎవరు అవునన్నా, కాదన్నా గేల్ జోరుపైనే వెస్టిండీస్ ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. అతను సృష్టించే విధ్వంసం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. పైగా అతని సెంచరీ కూడా ఇదే మైదానంలో వచ్చింది. మరో ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉన్న సిమన్స్ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్ అయినా ముంబై ఇండియన్స్ ఆటగాడిగా అనుభవం ఉపయోగపడవచ్చు. చార్లెస్, శామ్యూల్స్ దూకుడుగా ఆడగల సమర్థులు. 9వ నంబర్ ఆటగాడి వరకు అందరూ బ్యాటింగ్ చేయగలరు. బ్రేవో, రసెల్, స్యామీల ఫామ్ అంత బాగోలేదు. బౌలింగ్‌లో ఆల్‌రౌండర్లు మినహా చెప్పుకోదగ్గ పేసర్ లేడు. దాంతో ఇద్దరు స్పిన్నర్లు బద్రీ, బెన్ కీలకం కానున్నారు. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, రహానే/పాండే, హార్దిక్ పాండ్యా, జడేజా, అశ్విన్, నెహ్రా, బుమ్రా. వెస్టిండీస్: స్యామీ (కెప్టెన్), గేల్, సిమన్స్, చార్లెస్, శామ్యూల్స్, బ్రేవో, రసెల్, బ్రాత్‌వైట్, రామ్‌దిన్, బద్రీ, బెన్. పిచ్, వాతావరణం టోర్నీలో గత మూడు మ్యాచ్‌లలో ఉపయోగించని కొత్త పిచ్‌ను తొలిసారి భారత మ్యాచ్‌కు వాడుతున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. అయితే స్పిన్ అనుకూలత కోసం కాస్త ఎక్కువగా రోలింగ్ చేసినట్లు కనిపిస్తోంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించకపోవచ్చు. ►2 భారత్, వెస్టిండీస్‌ల మధ్య ఇప్పటివరకూ జరిగిన 4 టి20 మ్యాచ్‌ల్లో చెరో రెండు గెలిచాయి. ప్రపంచకప్‌లలో మూడు ఆడగా... భారత్ ఒకటి గెలిచి, రెండు ఓడింది. అశ్విన్ అతడిని ఆపాలి... క్రిస్ గేల్ క్రీజ్‌లో ఉంటే ఎంత ప్రమాదకరంగా మారతాడో ధోనికి తెలియనిది కాదు. అందుకే అది ఐపీఎల్ అయినా, అంతర్జాతీయ మ్యాచ్ అయినా అతడిని కట్టడి చేసేందుకు అశ్విన్ అనే ఆయుధాన్ని ధోని అనేక సార్లు ప్రయోగించాడు. అశ్విన్ కూడా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. టి20ల్లో వీరిద్దరు ఎదురెదురుగా 9 ఇన్నింగ్స్‌లలో తలపడితే అందులో నాలుగు సార్లు అశ్విన్ అవుట్ చేశాడు. అశ్విన్‌ను సమర్థంగా ఎదుర్కోలేక గేల్ పడే ఇబ్బందిని ఇప్పుడు భారత్ మళ్లీ సొమ్ము చేసుకోవాల్సి ఉంది. ప్రపంచంలో ప్రతీ బౌలర్‌ను చితకబాది ఏడిపించే గేల్ అశ్విన్ బౌలింగ్‌లో 70 బంతులు ఆడితే 57 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో 51 బంతులు పవర్‌ప్లేలో వేశాడు. అయినా సరే ఈ ఎత్తును చిత్తు చేయడం గేల్ వల్ల కాలేక కేవలం 3 ఫోర్లు, 3 సిక్సర్లతోనే సరిపెట్టాడు. ఇప్పుడు మరోసారి తొలి ఓవర్ అశ్విన్‌తో ప్రారంభించినా ఆశ్చర్యం లేదు. అతను అవుటైనా చాలా మంది బ్యాట్స్‌మెన్ ఉన్నారని వెస్టిండీస్ చెప్పుకోవచ్చు. కానీ గేల్ బ్యాటింగ్ చూపే ప్రభావమే వేరు. ఒక్కసారి అతను వెనుదిరిగితే విండీస్ కుప్పకూలడమో లేదంటే పడుతూ లేస్తూ తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కోహ్లి రివర్స్ స్వీప్ టి20 క్రికెట్లో కూడా సంప్రదాయ షాట్లతోనే అద్భుతాలు చేసే విరాట్ కోహ్లి బుధవారం కాస్త కొత్తగా కనిపించాడు. సుదీర్ఘ సమయం పాటు సాగిన ప్రాక్టీస్ సెషన్లో అతను భారత బౌలర్లందరినీ ఎదుర్కొన్నాడు. అయితే ఎప్పుడూ లేని విధంగా రివర్స్ స్వీప్, స్విచ్ హిట్లను ఆడటం విశేషం. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్‌లో అతను కొట్టిన రివర్స్ స్వీప్‌లు ఎలాంటి తడబాటు లేకుండా పర్ఫెక్ట్ షాట్లుగా మారాయి. సరదాగా ఒకటి, రెండు బంతులు కాకుండా సీరియస్‌గానే సాధన చేసిన కోహ్లి మనసులో కొత్త ఆలోచనలేమైనా ఉన్నాయేమో. మరో వైపు రహానే, పాండేలు ఇద్దరిపై ప్రత్యేక దృష్టి పెడుతూ రవిశాస్త్రి మరో నెట్స్‌లో వీరిద్దరితో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించారు. రా. గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్ 1లో ప్రత్యక్ష ప్రసారం