డబ్బు కోసం కాదు...దేశం కోసం... | World T20 final, England vs West Indies as it happened: Samuels, Brathwaite power West Indies to second title | Sakshi
Sakshi News home page

డబ్బు కోసం కాదు...దేశం కోసం...

Published Mon, Apr 4 2016 3:04 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

డబ్బు కోసం కాదు...దేశం కోసం...

మళ్లీ సాధించిన వెస్టిండీస్    
గెలుపు కోసం ప్రాణాలొడ్డిన ఆటగాళ్లు    
అంతా ఒకటై... ఒకరి కోసం ఒకరై..

 
 కోల్‌కతా నుంచి  మొహమ్మద్ అబ్దుల్ హాది :- మేం డబ్బు కోసం కాదు, దేశం కోసం ఆడతాం... ఫైనల్లో విజయం తర్వాత దిక్కులు పిక్కటిల్లేలా ఇలా అరవాలని డారెన్ స్యామీకి అనిపించి ఉంటుంది.  లీగ్‌లను చూపించి తమను డబ్బు మనుషులుగా లెక్కిస్తున్న వారికి గట్టిగా జవాబివ్వాలని కూడా అతని మనసులో ఆలోచన వచ్చి ఉంటుంది. టైటిల్ గెలవడంలో వారి పోరాటం అసాధారణం. ఒక్కో మ్యాచ్‌లో గెలుపు కోసం ప్రతీ ఆటగాడు ప్రాణాలు ఒడ్డినట్లుగా పోరాడాడు. వారి దృష్టిలో ఇది కేవలం క్రికెట్ మాత్రమే కాదు. తమను తాము నిరూపించుకోవడానికి, తమని తాము కాపాడుకోవడానికి ఈ ప్రపంచకప్ విజయం అత్యవసరం.

 పోరాడుతూనే పయనం
 దీవించాల్సిన తండ్రి శపిస్తాను అంటే ఎలా ఉంటుందో వెస్టిండీస్ క్రికెట్ పరిస్థితి సరిగ్గా అలాగే కనిపించింది. అండగా నిలవాల్సిన వారి సొంత బోర్డే వారిపై కత్తి కట్టింది. డబ్బులు ఇవ్వం పొమ్మంది, ‘ఆడకుంటే వేరేవాళ్లను పంపిస్తాం ఏం చేస్తారో చేసుకోండి’ అంది. కానీ ఆటపై ప్రేమ వారిని అన్ని షరతులకు అంగీకరించేలా చేసింది. అధికారులపై ఉన్న కసి అందరినీ ఒక్కటి చేసింది. వెస్టిండీస్‌లో బయల్దేరినప్పుడు అందరికీ ఒకే లక్ష్యం. వరల్డ్ కప్ మళ్లీ గెలవాలి. తమ సత్తా ఏమిటో, తాము ఏం చేయగలమో చూపించాలి. లేదంటే మళ్లీ సొంతవారే కత్తి గడతారు. చెప్పు చేతల్లో ఉంచుకోవాలనుకునేవారి నోళ్లు మళ్లీ లేస్తాయి. ఇలాంటి సమయంలో అంతా ఒకటైయ్యారు. ప్రతీ రోజు, ప్రతీ క్షణం తమ లక్ష్యాన్ని గుర్తు చేసుకున్నారు. బ్రేవో పాట చాంపియన్ వారి దినచర్యలో భాగమైపోయింది. దానిని ఒక స్ఫూర్తిగా మార్చుకున్నారు. జట్టులో చిన్న పెద్ద భేదాలు లేకుండా గేల్ అయినా బ్రాత్‌వైట్ అయినా ఒక్కటిగా మారి శ్రమించారు. ఆటలో ప్రతీ పరుగును ఆస్వాదించారు. ప్రతీ వికెట్‌కూ చిందులేశారు.  

 15 మంది విన్నర్లు...
 మా జట్టులో 15 మంది మ్యాచ్ విన్నర్లు అంటూ ప్రతీ మ్యాచ్ సందర్భంగా స్యామీ చెబుతూ వచ్చినప్పుడు అది కాస్త అతిశయోక్తిగా కనిపించింది. కానీ వారంతా అతని మాటను, నమ్మకాన్ని నిలబెట్టారు. ఈ సారి బ్రాత్‌వైట్ బాధ్యత తీసుకున్నాడు. గతంలో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 25 పరుగులే చేసిన అతను ఈ సారి నాలుగు సిక్సర్లతో చరిత్రను మార్చేశాడు. వరల్డ్ కప్‌లో ఐదు మ్యాచ్‌లలో అంతంత మాత్రంగానే ఆడిన శామ్యూల్స్ అసలు పోరులో తన దూకుడు ప్రదర్శించాడు. ఎక్కువగా హడావిడి చేయకున్నా బద్రీ కీలక పాత్ర పోషించాడు. టాప్-6 ఆటగాళ్లలో ప్రతీ ఒక్కరు ఒక్కో మ్యాచ్ విజయంలో తమ పాత్రను అద్భుతంగా పోషించడం విశేషం. ముఖ్యంగా సెమీ ఫైనల్, ఫైనల్‌లో ఆ జట్టు ఆటతీరు అసమానంగా కనిపించింది. ఫైనల్లోనైతే ఓటమి ఖాయం అనిపించిన దశలో కూడా కోలుకొని తమదైన శైలిలో విధ్వంసంతో మ్యాచ్ గెలవడం అసాధారణం.

 గ్రేట్ కెప్టెన్
 ఫైనల్ తర్వాత స్యామీ ప్రసంగం భావోద్వేగంతో సాగడం చూస్తే ఈ విజయానికి వారి దృష్టిలో ఎలాంటి విలువ ఉందో అర్థమవుతుంది. బోర్డుతో సమస్యలు, డబ్బు కోసమే ఆడతామనే విమర్శలు, అసలు బుర్ర లేదనే వ్యాఖ్యలు వారిని ఎంతగా బాధించాయో... ఇప్పుడు గెలుపుతో దానిని గట్టి జవాబిచ్చామన్నట్లే అతను మాట్లాడాడు. ఆరడగుల లక్ష్యంతో కరీబియన్ నుంచి బయల్దేరామన్న అతను, ఆ లక్ష్యం చేరే దాకా విశ్రమించలేదు. వ్యక్తిగతంగా స్యామీ విఫలమైనా, కెప్టెన్‌గా అతను విజయవంతంగా జట్టును నడిపించాడు. తన బౌలర్లను ఉపయోగించుకోవడంలో అతని పరిణతి కనిపించింది. ఫలితమే ఇప్పుడు రెండు వరల్డ్ కప్ టైటిల్స్ సాధించిన కెప్టెన్‌గా దిగ్గజం లాయిడ్ సరసన అతడిని నిలబెట్టింది.

రెండుసార్లు వన్డే వరల్డ్ కప్‌ను, రెండుసార్లు టి20 ప్రపంచకప్‌ను గెల్చుకున్న తొలి జట్టుగా వెస్టిండీస్ గుర్తింపు పొందింది

ఓ టి20 మ్యాచ్‌లో చివరి ఓవర్లో 24 పరుగులు చేసి నెగ్గిన తొలి జట్టు వెస్టిండీసే. 2010 ప్రపంచకప్ సెమీస్‌లో పాక్‌పై ఆస్ట్రేలియా 23 పరుగులు చేసి గెలిచింది.

ప్రపంచకప్ ఫైనల్స్‌లో రెండేసి అర్ధ సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మన్ శామ్యూల్స్. 2012 వరల్డ్ కప్ ఫైనల్లోనూ శామ్యూల్ అర్ధ సెంచరీ చేశాడు. గతంలో సంగక్కర (2009, 2014) ఈ ఘనత సాధించాడు.

ఫైనల్‌కు ముందు బ్రాత్‌వైట్ ఏడు టి20 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు వికెట్లు తీశాడు. కానీ ఇంగ్లండ్‌తో ఫైనల్లో అతను మూడు వికెట్లు పడగొట్టడంతోపాటు అజేయంగా 34 పరుగులు చేశాడు.
 
 
 విండీస్ నామ సంవత్సరం...

వరల్డ్‌కప్‌లో విండీస్ విజయ ప్రస్థానం సాధారణమైంది కాదు. మా అమ్మాయిలు గెలిచి స్ఫూర్తి నింపారు. దానిని మేం కొనసాగించి ట్రిపుల్ ధమాకా చేస్తాం అని మ్యాచ్‌కు ముందే స్యామీ, బ్రేవో చెప్పారు. చివరకు దానిని సాధించి చూపించారు. ఈ ఏడాది విండీస్ అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. 2016లో నాలుగు నెలలు కూడా పూర్తి కాక ముందే మరో రెండు టైటిల్స్ కరీబియన్ ఖాతాలో చేరాయి. ఇది వెస్టిండీస్ క్రికెట్ ఆనందాన్ని మూడు రెట్లు చేసిందనడంలో సందేహం లేదు. కరీబియన్ కలలు నెరవేర్చుకున్న ఈ బృందం సగర్వంగా మరోసారి విశ్వవిజేత స్థానంలో నిలబడింది. ఈ విజయాలు ఆ దీవుల్లో క్రికెట్ పునరుజ్జీవానికి ఉపయోగపడితే అంతకు మించిన ఆనందం ఉండదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement