బాదలేకపోయాం
భారత జట్టు వెస్టిండీస్‌ను తక్కువగా అంచనా వేసిందా... క్రిస్ గేల్‌ను అవుట్ చేస్తే చాలు మిగతా ఆటగాళ్లు చెదిరిపోతారని భావించిందా... లేక మిస్టర్ పర్‌ఫెక్ట్ కెప్టెన్ ధోని కూడా ఒత్తిడిలో వ్యూహాలు పన్నలేక చిత్తయ్యాడా... దాదాపు రెండు వందల పరుగుల స్కోరు చేశాక కూడా టీమిండియా మ్యాచ్ కోల్పోవడం నిజంగా అనూహ్యం. రెండు నోబాల్స్ మాత్రమే ఓటమికి ప్రధాన కారణమా..?
భారత్ ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు ఉంటే, వెస్టిండీస్ ఏకంగా 11 బాదింది. ఇదే ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా. బంతిని బలంగా బాదగల విండీస్ బ్యాట్స్‌మెన్ దానిని సమర్థంగా ఉపయోగించుకుంటే, మనం వెనుకబడిపోయాం. బ్యాటింగ్‌లో చూస్తే కోహ్లి మినహా మిగతావారంతా తడబడుతున్నారని తెలుసు. ఎప్పుడూ ఆటగాళ్లను వెనకేసుకొచ్చే ధోని కూడా చివరకు ధావన్‌ను పక్కన పెట్టక తప్పలేదు. ఒక రకంగా 15 మ్యాచ్‌ల తర్వాత కీలకమైన సెమీ ఫైనల్ కోసం జట్టును మార్చాలనుకోవడం ఒక రకంగా సాహసమే. రహానే 35 బంతుల్లో 40 పరుగులు చేయడం ధాటిగా అనిపించకపోయినా... నేరుగా ఇలాంటి మ్యాచ్ ఆడటం అంత సులువు కాదు. కానీ ధావన్‌లాగా తొందరగా వికెట్ ఇవ్వకుండా నిలబడ్డాడు కాబట్టి అది మెరుగైన ప్రదర్శనే.
ఈ మైదానంలో భారీ స్కోర్లు నమోదు కావడంతో పాటు భారీ లక్ష్య ఛేదన కూడా జరుగుతోందని భారత్‌కు తెలియనిది కాదు. ఆ రకంగా చూస్తే భారత జట్టు చేతిలో వికెట్లు ఉండటంతో మరిన్ని భారీ షాట్లు ఆడాల్సింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సింగిల్స్, డబుల్స్‌తో ఒత్తిడి పెంచారు కాబట్టి ఇక్కడా దానినే ప్రయోగించినట్లు ఉంది. కానీ అది ఛేదన కాబట్టి లక్ష్యంపై స్పష్టత ఉంది. ఇక్కడ వీలైనన్ని పరుగులు చేయడమే లక్ష్యం అయినప్పుడు ఇతర బ్యాట్స్‌మెన్ డగౌట్‌లో ఉండగా మరిన్ని భారీ షాట్లు పడాల్సింది.
ఇక బౌలింగ్‌లో కూడా ధోని వ్యూహాలు ఆశ్చర్య పరిచాయి. మరోసారి అతను చివరి ఓవర్ అద్భుతం ఆశించినట్లున్నాడు. అయితే విండీస్ దూకుడుగా ఆడుతున్న వేళ ముందే ప్రధాన బౌలర్ల కోటా పూర్తయిపోయింది. దాంతో చివరి ఓవర్ పార్ట్ టైమర్ కోహ్లితో వేయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఫలించి ఉంటే బౌలింగ్‌లో కూడా కోహ్లి మరో సచిన్ అయ్యేవాడేమో గానీ వికటించింది. టోర్నీలో మెరుగ్గా బౌలింగ్ చేసిన రైనాను అసలు ప్రయత్నించకపోగా, అశ్విన్ 2 ఓవర్లకే పరిమితమయ్యాడు. మొత్తానికి నోబాల్స్‌కు మించిన కారణాలతో భారత్ ఓడటం యావత్ దేశాన్ని నిరాశలో ముంచింది.
‘మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి టాస్ ఓడిపోవడం చాలా చెడు చేసింది. మేం బౌలింగ్‌కు దిగినప్పుడు పిచ్ స్పిన్నర్లకు ఏమాత్రం సహకరించలేదు. తడి బంతితో సరిగా బౌలింగ్ చేయలేకపోయాం. రెండు నోబాల్స్ వేయడం కూడా నిరాశకు గురి చేసింది. మా పేసర్లు ఒడ్డున పడేస్తారని ఆశించా. కానీ అలా జరగలేదు. ఓవరాల్‌గా పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి.’ -ధోని
‘టాస్ గెలవాలని మాత్రమే కోరుకున్నా. ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలవడం ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది. ఓ లక్ష్యంతో మేం ఇక్కడికి వచ్చాం. ఈ ఏడాది ఆరంభంలో మా అండర్-19 జట్టు ఆడిన ఆటను చూసి మేం స్ఫూర్తి పొందాం. అలాగే మహిళల జట్టు కూడా బాగా ఆడింది. ఓవరాల్‌గా రెండు జట్లు ఫైనల్‌కు చేరుకోవడం సంతోషంగా ఉంది. భారత్‌లాంటి పటిష్టమైన జట్టుపై గెలవడం పెద్ద సంచలనమే. గెలవగలం అనే నమ్మకమే మమ్మల్ని నడిపిస్తోంది. మేం గేల్ ఒక్కడిపైనే ఆధారపడలేదు. మా జట్టులో 15 మందీ మ్యాచ్ విన్నర్లే.’ - స్యామీ
► టి20 ప్రపంచకప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా వెస్టిండీస్ (193) గుర్తింపు పొందింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా (192; 2010లో పాక్‌పై) పేరిట ఉండేది.