సిరీస్‌పై గురి | India last ODI against the West Indies is Today | Sakshi
Sakshi News home page

సిరీస్‌పై గురి

Published Wed, Aug 14 2019 2:42 AM | Last Updated on Wed, Aug 14 2019 3:39 AM

India last ODI against the West Indies is Today - Sakshi

కరీబియన్‌ పర్యటనలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ను అజేయంగా ముగించేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. టి20ల్లో క్లీన్‌ స్వీప్‌ చేసి, రెండో వన్డేలో సునాయాస విజయం సాధించిన కోహ్లి సేన... ఆఖరిదైన మూడో వన్డేనూ హస్తగతం చేసుకుని సిరీస్‌ సొంతం  చేసుకునే ప్రయత్నంలో ఉంది. వెస్టిండీస్‌ మాత్రం ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి సొంతగడ్డపై పరువు దక్కించుకోవాలని చూస్తోంది. అన్ని రంగాల్లో బలంగా ఉన్న భారత్‌ను నిలువరించాలన్నా, తమ దిగ్గజ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌కు ఘనంగా వీడ్కోలు ఇవ్వాలన్నా ఆ జట్టు శక్తికి మించి రాణించాల్సి ఉంటుంది.  

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: నిన్నటివరకు టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నంబర్‌–4 స్థానంపై సాగిన చర్చ... ఇప్పుడు సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఫామ్‌ వైపు మళ్లింది. ప్రపంచ కప్‌లో అద్భుత సెంచరీతో ఊపుమీదున్న స్థితిలో గాయంతో వైదొలగిన ధావన్‌ పునరాగమనంలో పరుగులకు ఇబ్బంది పడుతున్నాడు. టి20ల్లో, రెండో వన్డేలో అతడు ఏమాత్రం సాధికారికంగా ఆడలేకపోయాడు. బుధవారం వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగే చివరి మ్యాచ్‌లోనైనా ధావన్‌ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. విజయాల ఊపులో ఉన్న భారత్‌ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ఆడితే మరో సిరీస్‌ మన ఖాతాలో చేరడం ఖాయం. సిరీస్‌ను సమ చేయడంతో పాటు కెరీర్లో ఆఖరి మ్యాచ్‌గా ప్రకటించిన గేల్‌ను గౌరవంగా సాగనంపడం ఇప్పుడు కరీబియన్ల ముందున్న రెండు లక్ష్యాలు. గత మ్యాచ్‌ ఆడిన జట్టుతోనే భారత్‌ బరిలో దిగనుండగా... విండీస్‌ ఒక మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. 

అతడి ఆటపైనే దృష్టి... 
ధావన్‌ ఫామ్‌ కోసం కష్టాలు పడుతుండటంతో జట్టుకు శుభారంభాలు దక్కడం లేదు. రెండో వన్డేలో రోహిత్‌ కూడా విఫలమడంతో కష్టాల్లో పడింది. కెప్టెన్‌ కోహ్లి అద్భుత శతకం, యువ శ్రేయస్‌ అయ్యర్‌ సమయోచిత అర్ధసెంచరీతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌లో ఓపెనర్లు రాణిస్తే భారత్‌ ఆదిలోనే పైచేయి సాధిస్తుంది. పలుసార్లు విఫలమైనా నాలుగో నంబరులో రిషభ్‌ పంత్‌నే దించే అవకాశం కనిపిస్తోంది. ఆరో స్థానంలో వచ్చే జాదవ్‌కూ ఈ మ్యాచ్‌ కీలకమే. స్పిన్‌ ద్వయం జడేజా, కుల్దీప్‌... పేస్‌ త్రయం షమీ, భువనేశ్వర్, ఖలీల్‌ అహ్మద్‌లతో భారత బౌలింగ్‌ పటిష్టంగా ఉంది. వీరిని ఎదుర్కొంటూ పరుగులు సాధిచండం ప్రత్యర్థికి బ్యాట్స్‌మెన్‌కు సవాలేనని రెండో వన్డేలో స్పష్టమైంది. ఓ దశలో చేజారేలా కనిపించిన మ్యాచ్‌ను బౌలర్లు మనవైపు తిప్పారు. మూడో వన్డేలోనూ ఇదే జోరు చూపితే ప్రపంచ కప్‌ నిష్క్రమణను మరిపిస్తూ టెస్టు చాంపియన్‌ షిప్‌నకు ఆత్మవిశ్వాసంతో వెళ్లొచ్చు. 

విండీస్‌కు బ్యాటింగ్‌ బెంగ... 
బౌలింగ్‌లో ఫర్వాలేకున్నా బ్యాటింగ్‌ వెస్టిండీస్‌ను కలవరపరుస్తోంది. విధ్వంసక క్రిస్‌ గేల్‌ తన ఆఖరి మ్యాచ్‌లో ఎలా ఆడతాడో చూడాలి. హోప్, హెట్‌మైర్, పూరన్, చేజ్‌లతో భారీ లైనప్‌ ఉన్నా ఎవరి నుంచి విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ రావడం లేదు. ఆరు వికెట్లు చేతిలో ఉన్నా రెండో వన్డేలో 71 బంతుల్లో 91 పరుగుల చేయలేకపోవడమే దీనికి నిదర్శనం. ఓపెనర్లలో లూయిస్‌ స్థానంలో క్యాంప్‌బెల్‌ను తీసుకోవచ్చని భావిస్తున్నా అందుకు పెద్దగా అవకాశాల్లేవు. లోయరార్డర్‌లో కెప్టెన్‌ హోల్డర్, బ్రాత్‌వైట్‌ బ్యాట్‌ ఝళిపిప్తేనే ఆతిథ్య జట్టు గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. పార్ట్‌టైమర్‌ చేజ్‌తో కొంత ప్రయత్నిస్తున్నా స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం విండీస్‌కు లోటు. రోచ్, కాట్రెల్, థామస్‌ల పేస్‌ త్రయం అనూహ్యంగా చెలరేగితే టీమిండియాకు కళ్లెం పడుతుంది. 

తుది జట్లు (అంచనా) 
భారత్‌: ధావన్, రోహిత్, కోహ్లి (కెప్టెన్‌), అయ్యర్, పంత్, జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, షమీ, ఖలీల్‌. వెస్టిండీస్‌: గేల్, లూయిస్‌/క్యాంప్‌బెల్, హోప్, హెట్‌మైర్, పూరన్, చేజ్, హోల్డర్, బ్రాత్‌వైట్, రోచ్, కాట్రెల్, థామస్‌. 

పిచ్, వాతావరణం 
బ్యాటింగ్‌కు అంతంతమాత్రమే సహకరించిన, రెండో వన్డే ఆడిన పిచ్‌పైనే ఈ మ్యాచ్‌ జరగనుంది. వాతావరణ పరిస్థితులు చూస్తే అంతరాయాలు తప్పకపోవచ్చని సమాచారం. జల్లుల వాన కురిసే వీలుంది. ఈ ప్రకారం చూస్తే టాస్‌ గెలిచిన కెప్టెన్‌ బౌలింగ్‌ ఎంచుకోవచ్చు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement