నిర్దాక్షిణ్యంగా...
►భారత్‌కు మరో భారీ విజయం
►తొలి వన్డేలో 9 వికెట్లతో శ్రీలంక చిత్తు
►శిఖర్ ధావన్ సెంచరీ రాణించిన కోహ్లి
ఫార్మాట్ మాత్రమే మారింది... భారత్ విధ్వంసకర ఆటలో మార్పు లేదు. శ్రీలంక పేలవ ప్రదర్శన మెరుగైందీ లేదు! టెస్టు సిరీస్ తరహాలోనే మరో అద్భుత విజయంతో వన్డే సిరీస్‌లో కూడా భారత్ బోణీ చేసింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ముందుగా బౌలర్లు సమష్టితత్వంతో లంకను తక్కువ స్కోరుకే పరిమితం చేయగా... ఆ తర్వాత ఏకంగా 21.1 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించేసి కోహ్లి సేన మన జట్టు సత్తాను మరోసారి ప్రదర్శించింది.
94, 113, 79, 91, 125... ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంకపై శిఖర్ ధావన్ వరుసగా ఐదు వన్డేల్లో చేసిన పరుగులు ఇవి. ఇప్పుడు కూడా అదే ప్రేమను కొనసాగిస్తూ ధావన్ మరో అద్భుత శతకంతో చెలరేగాడు. 132 స్కోరులో 98 పరుగులు బౌండరీల ద్వారానే రాబట్టి తన ధాటిని ప్రదర్శించిన అతను తన కెరీర్‌లో వేగవంతమైన సెంచరీని సాధించాడు. అటువైపు తనకు అలవాటైన రీతిలో ఛేదనలో మరో చక్కటి ఇన్నింగ్స్‌తో కోహ్లి అండగా నిలవడంతో టీమిండియాకు తిరుగులేకపోయింది.
దంబుల్లా: శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌కు ఘనమైన ఆరంభం లభించింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 43.2 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌటైంది. నిరోషన్ డిక్‌వెలా (74 బంతుల్లో 64; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఒక దశలో 139/1తో మెరుగైన స్థితిలో నిలిచిన ఆ జట్టు 77 పరుగులకే మిగతా 9 వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ అవలీలగా 28.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. వికెట్ నష్టానికి 220 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (90 బంతుల్లో 132 నాటౌట్; 20 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించగా, విరాట్ కోహ్లి (70 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. లంక పడగొట్టిన ఒక్క వికెట్ కూడా రోహిత్ శర్మ రనౌట్ రూపంలో అదృష్టవశాత్తూ లభించిందే. సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలవగా రెండో వన్డే పల్లెకెలెలో గురువారం జరుగుతుంది.
డిక్‌వెలా మినహా...
టాస్ గెలిచిన కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్న అనంతరం శ్రీలంకకు ఓపెనర్లు డిక్‌వెలా, గుణతిలక (44 బంతుల్లో 35; 4 ఫోర్లు) శుభారంభం అందించారు. భారత ఆరంభ బౌలర్లు భువనేశ్వర్, పాండ్యాలను వీరిద్దరు సమర్థంగా ఎదుర్కొంటూ తొలి పవర్ ప్లేలో 55 పరుగులు జోడించారు. చివరకు యజువేంద్ర చహల్ ఈ జోడీని విడదీశాడు. రివర్స్ స్వీప్ ఆడబోయిన గుణతిలక ఎక్స్‌ట్రా కవర్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత చహల్ వేసిన మరో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి కుషాల్ మెండిస్ (37 బంతుల్లో 36; 5 ఫోర్లు) జోరు ప్రదర్శించాడు. మరో ఎండ్‌లో డిక్‌వెలా కూడా ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో 65 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. ఈ దశలో డిక్‌వెలాను అవుట్ చేసి జాదవ్ శ్రీలంక పతనానికి శ్రీకారం చుట్టాడు.
అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించిన తర్వాత డిక్‌వెలా రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత లంక టపటపా వికెట్లు కోల్పోయింది. జాదవ్‌తో పాటు బుమ్రా, అక్షర్ పటేల్ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకొని ప్రత్యర్థి పని పట్టారు. మెండిస్‌ను అక్షర్ బౌల్డ్ చేయగా, కెప్టెన్ తరంగ (13) జాదవ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరోవైపు మాథ్యూస్ (50 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) పోరాడే ప్రయత్నం చేసినా ఇతర బ్యాట్స్‌మెన్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. ఫలితంగా 6.4 ఓవర్ల ముందే లంక ఆట ముగిసింది. 11 ఓవర్ల వ్యవధిలోనే ఆ జట్టు చివరి 7 వికెట్లు కోల్పోయింది.
కోహ్లి సహకారం...
సునాయాస లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. వైస్ కెప్టెన్‌గా తొలిసారి బరిలోకి దిగిన రోహిత్ శర్మ (4) రనౌటయ్యాడు. సింగిల్‌కు ప్రయత్నించిన సమయంలో బ్యాట్ చేజారిపోగా రోహిత్ గాల్లోకి ఎగిరి క్రీజ్‌లోకి చేరే ప్రయత్నం చేశాడు. అయితే ఆలోపే కపుగెడెర డైరెక్ట్ త్రో వికెట్లను తాకడంతో అతను వెనుదిరగక తప్పలేదు. శ్రీలంక గడ్డపై ఆడిన గత పది వన్డే ఇన్నింగ్స్‌లలో కలిపి రోహిత్ 37 పరుగులు మాత్రమే చేయగలిగాడు! అయితే ఆ తర్వాత భారత్ వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ధావన్, కోహ్లి కలిసి ఆడుతూ పాడుతూ బ్యాటింగ్ చేశారు. ఫెర్నాండో, పెరీరా వేసిన రెండు ఓవర్లలో కలిపి వీరిద్దరు చెరో మూడు బౌండరీలు బాదారు. ఈ క్రమంలో 36 బంతుల్లోనే ధావన్ అర్ధ సెంచరీ పూర్తయింది.
87 పరుగుల వద్ద ధావన్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను కీపర్ డిక్‌వెలా వదిలేశాడు. అనంతరం డి సిల్వ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన ధావన్ 71 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. కోహ్లి కూడా సరిగ్గా 50 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోగా... 118 పరుగుల వద్ద తరంగ క్యాచ్ వదిలేయడంతో ధావన్ మళ్లీ అవుట్ కాకుండా తప్పించుకున్నాడు. సందకన్ ఓవర్లో కోహ్లి వరుసగా 4, 4, 6 కొట్టి జట్టును విజయానికి మరింత చేరువగా తెచ్చాడు. చివరకు సిల్వ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి ధావన్, భారత్‌కు భారీ విజయాన్ని అందించాడు.
► 11 ధావన్ కెరీర్‌లో ఇది 11వ సెంచరీ. బంతులపరంగా అతనికి ఇదే (71) వేగవంతమైన శతకం.
►127 భారత్ గెలిచే సమయానికి ఇన్నింగ్స్‌లో మిగిలిన బంతులు. కనీసం 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో మిగిలిన బంతులపరంగా భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం