లంకేయులే కదా అని ప్రాక్టీస్‌కు సరిపోతుందనుకున్నారు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనకోసం లంకతో సిరీస్‌ను సన్నాహకంగా భావించారు. అందుకే కావాలని మరీ ఈడెన్ గార్డెన్స్‌లో పేస్ వికెట్ తయారు చేయించుకున్నారు. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. కోల్‌కతా టెస్టు తొలిరోజే భారత బ్యాట్స్‌మన్ బోల్తాపడ్డారు. వర్షం కారణంగా రోజంతా 11.5 ఓవర్లే సాగినా.. కోహ్లి అండ్ కోకు మాత్రం కోల్‌కతాలోనే దక్షిణాఫ్రికా కనిపించింది. వాతావరణంలోని తేమ, పిచ్‌పై పచ్చికను అద్భుతంగా వినియోగించుకున్న లంక పేసర్ సురంగ లక్మల్.. భారత టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. అతడినుంచి దూసుకొస్తున్న బంతులను ఎదుర్కోలేక బ్యాట్స్‌మెన్ అష్టకష్టాలు పడ్డారు. ఆరు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా లక్మల్ 3 వికెట్లు తీసి మన స్టార్ బ్యాట్స్‌మెన్ వెన్ను విరిచాడు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో మూడ్రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా కోల్‌కతాలో గురువారం ఉదయం నుంచీ కారుమేఘాలు కమ్ముకున్నాయి. వర్షం కూడా కురుస్తుండటంతో మ్యాచ్‌కు ముందే ఫ్లడ్‌లైట్లు వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలిరోజు ఆట సాధ్యమైన 11.5 ఓవర్లలో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది. రాహుల్ (0), ధావన్ (8), కోహ్లి (0) విఫలం కాగా...చతేశ్వర్ పుజారా(43 బంతుల్లో 8 బ్యాటింగ్; 2 ఫోర్లు), అజింక్యా రహానే (0 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. లక్మల్ బంతులను చక్కగా ఎదుర్కొన్న పుజారా మాత్రం క్రీజ్‌లో పాతుకుపోయాడు. 22 బంతుల తర్వాత అతను ఖాతా తెరవడం విశేషం. వర్షం కారణంగా తొలి సెషన్‌లో ఆట సాధ్యం కాలేదు. రెండో సెషన్‌లో మధ్యాహ్నం 1.42 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. ఆ తర్వాత కేవలం 43 నిమిషాలపాటు మాత్రమే వాతావరణం సహకరించింది.
లక్ష్మణ్ గంటకొడితే..
కోల్‌కతాలో టెస్టు ప్రారంభానికి ముందు గంట కొట్టే సాంప్రదాయం ఉంది. భారత్–లంక తొలిటెస్టును మాజీ భారత క్రికెటర్, ఈడెన్ పిచ్‌పై గొప్ప రికార్డున్న వీవీఎస్ లక్ష్మణ్ గంటకొట్టి ప్రారంభించారు. వర్షం కారణంగా మ్యాచ్‌కు పదే పదే ఆటంకం కలగటంతో.. మధ్యాహ్నం 1.40 గంటలకు తొలి బంతి వేసేందుకు అవకాశం దొరికింది.
‘ఇలాంటి వికెట్‌పై ఆడటం సంతోషకరం. సులభంగా ఉండే పరిస్థితుల్లో ఆడేందుకు ఏ జట్టూ ఇష్టపడదు. మాకు మేమే ఈ పరిస్థితిని కల్పించుకున్నాం. జట్టులోని ఆటగాళ్లంతా ఈ సవాల్‌ను స్వీకరించేందుకు అంగీకరించారు. ఓ జట్టుగా మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. గతేడాది న్యూజిలాండ్‌లో ఆడిన పిచ్‌లాంటిదే ఇది. వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలించలేదు. అయినా మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ మేం పుంజుకుంటాం. ఈ పిచ్‌పై రాణించేందుకు అవసరమైన స్వింగ్, సీమ్ మా జట్టులో పుష్కలంగా ఉన్నాయి. మాకు ఇద్దరు స్పిన్నర్లు కీలకం. భారత బ్యాట్స్‌మెన్ తీరును తప్పుబట్టలేం. అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన లక్మల్‌కే క్రెడిట్ ఇవ్వాలి’ – సంజయ్ బంగర్, భారత అసిస్టెంట్ కోచ్
లక్మల్ 6–6–0–3
కోల్‌కతా టెస్టుకు ముందు సురంగ లక్మల్ ఆడిన మ్యాచ్‌లు 39 కాగా పడగొట్టిన వికెట్లు 88 మాత్రమే. ఒకేసారి ఐదువికెట్ల ప్రదర్శన నమోదు చేయగా 43.35 సగటు కూడా గొప్ప విశేషమేం కాదు. ఏడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా ఎప్పుడూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచని శ్రీలంక పేసర్ సురంగ లక్మల్ ఈడెన్ టెస్టు తొలిరోజు ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. వాతావరణంలో తేమతోపాటు కోల్‌కతా వికెట్‌పై పచ్చికను చక్కగా వినియోగించుకున్నాడు. ఆరు ఓవర్లలో ఒక్క పరుగూ ఇవ్వకుడా మూడు వికెట్లనూ తన ఖాతాలో వేసుకున్నాడు. బంతిని అంచనావేయటంలో ఏమరపాటుగా ఉన్నా వికెట్ ఇచ్చుకోవాల్సిందే అన్నట్లుగా పేస్‌కు చక్కని లైన్ అండ్ లెంగ్త్ జోడించి అదరగొట్టాడు. ఇన్నింగ్స్ తొలి బంతికి రాహుల్‌కి షాకిచ్చాడు. కోహ్లికి వేసిన బంతి అయితే అనూహ్యం. ఈ మ్యాచ్ తుది ఫలితం ఎలా ఉన్నా లక్మల్ మాత్రం అందరికీ గుర్తుండిపోవడం ఖాయం.
►2 టెస్టు క్రికెట్ చరిత్రలో శ్రీలంక జట్టు తొలి బంతికే వికెట్ తీసుకోవటం ఇది రెండోసారి. రెండుసార్లూ బౌలర్ సురంగ లక్మలే కావటం విశేషం.
► 6 ఇన్నింగ్స్ తొలి బంతికే అవుటైన ఆరో భారత బ్యాట్స్‌మన్ రాహుల్ కాగా... గావస్కర్ మూడు సార్లు ఈ విధంగా అవుటయ్యారు.
శిఖర్ ధావన్
ఏడో ఓవర్ రెండో బంతి. లక్మల్ వేసిన బంతి తక్కువ ఎత్తులో ఆఫ్‌స్టంప్ అవతలగా వెళ్తోంది. షాట్ ఆడేందుకు అవకాశమున్న బంతి. ధావన్ బ్యాట్ లోపలి అంచు తగిలి బంతి వికెట్లను తాకింది.
విరాట్ కోహ్లి
స్టార్ బ్యాట్స్‌మన్ కోహ్లి కూడా పేస్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై దూసుకొస్తున్న బంతులను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. లక్మల్ వేసిన 11 ఓవర్ తొలి బంతి ఆఫ్‌స్టంప్ అవతలపడి వికెట్లవైపు దూసుకొచ్చింది. ఈ ఫుల్‌లెంగ్త్ డెలివరీని అంచనా వేయటంలో కోహ్లి విఫలం కాగా, బంతి కోహ్లి ప్యాడ్లను తాకింది. అంపైర్ అవుట్‌గా ప్రకటించటంతో భారత కెప్టెన్ రివ్యూ కోరాడు. రీప్లేలో అవుటైనట్లు తేలింది.
లోకేశ్ రాహుల్
ఇన్నింగ్స్ తొలి బంతి. లంక పేసర్ లక్మల్ ఆఫ్‌స్టంప్‌కు అవతల వేసిన బాల్.. అదనపు బౌన్స్‌తో రాహుల్‌పైకి దూసుకొచ్చింది. దీంతో ఆడక తప్పని పరిస్థితుల్లో బంతి రాహుల్ బ్యాట్ అంచును తాకుతూ వికెట్ కీపర్ డిక్‌వెలా చేతుల్లోకి వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment