ఇంగ్లండ్ 'టాప్' లేపిన అఫ్ఘాన్; లక్ష్యం 143
న్యూఢిల్లీ: టి-20 ప్రపంచ కప్లో పసికూన అఫ్ఘానిస్తాన్ బౌలర్లు ఇంగ్లండ్కు చుక్కలు చూపించారు. బుధవారం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో అఫ్ఘాన్ బౌలర్లు ఇంగ్లండ్ టాపార్డర్ను కుప్పకూల్చారు. చివర్లో ఇంగ్లండ్ బ్యాట్స్మన్ మోయిన్ అలీ (33 బంతుల్లో 41 నాటౌట్) రాణించడంతో అఫ్ఘాన్కు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అలీ దూకుడుగా ఆడటంతో పాటు జేమ్స్ విన్సె 22, డేవిడ్ విల్లె 20 పరుగులు చేయడం మినహా ఇతర బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. అఫ్ఘాన్ బౌలర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ చెరో రెండు.. ఆమిర్ హంజా, షెన్వారి తలా వికెట్ తీశారు.
ఇంగ్లండ్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అఫ్ఘాన్ బౌలర్ ఆమిర్ హంజా.. ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ (5)ను బౌల్డ్ చేసి వికెట్ల వేటకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత నబీ.. వరుస బంతుల్లో జేమ్స్ విన్సె, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (0)ను పెవిలియన్ చేర్చాడు. ఇదే ఓవర్లో జో రూట్ (12) రనౌటయ్యాడు. స్టోక్స్ (7), బట్లర్ (6) కూడా ఎంతో సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆ తర్వాత జోర్డాన్ 15 పరుగులు చేశాడు. చివర్లో అలీ, విల్లె బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ సముచిత స్కోరు చేయగలిగింది.