ఆరు బంతుల్లో అటు ఇటు...
క్రికెట్‌లో ఒక్క ఓవర్... ఒకే ఒక్క ఓవర్‌తో ఓడలు బళ్లు... బళ్లు ఓడలవుతాయి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా గెలవాల్సిన మ్యాచ్ అందినట్లే అంది చేజారిపోతుంది. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటే ఓడిపోవాల్సిన మ్యాచ్‌లోనూ విజయం వరిస్తుంది.
అందుకే క్రికెట్‌లో ఒక్క ఓవర్‌కు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక టి20 క్రికెట్‌లోనైతే ఒకే ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తుంది. మ్యాచ్ స్వరూపాన్నే పూర్తిగా మార్చేస్తుంది. టి20 ప్రపంచకప్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో గత నాలుగు ప్రపంచకప్‌ల్లో ఆయా జట్ల తలరాతల్ని మార్చేసిన ఆ ‘ఒక్క ఓవర్’పై ఓ లుక్కేద్దాం పదండి.
శభాష్... శామ్యూల్స్
వెస్టిండీస్-శ్రీలంక టి20 ప్రపంచకప్ ఫైనల్ (2012): బౌలర్లు ఆధిపత్యం చాటిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ చాంపియన్‌గా నిలవడానికి కారణం ఆ ఒక్క ఓవరే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నెమ్మదిగా బ్యాటింగ్ మొదలు పెట్టింది. 12 ఓవర్లు ముగిసినా కరీబియన్ల స్కోరు కనీసం యాభై కూడా దాటలేకపోయింది. దీంతో శ్రీలంక లక్ష్య ఛేదన వందలోపే ఉంటుందని అంతా భావించారు.
కానీ శ్రీలంక స్టార్ బౌలర్ మలింగ వేసిన 13వ ఓవర్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ మర్లోన్ శామ్యూల్స్ సిక్సర్ల మోత మోగించాడు. మూడు సిక్సర్లు కొట్టి అప్పటిదాకా నత్తనడకన సాగుతున్న ఇన్నింగ్స్ కాస్తా గాడిలో పడేలా చేశాడు. ఆ ఓవర్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ 21 పరుగులు రాబట్టారు. అలా 20 ఓవర్లు ముగిసే సరికి వెస్టిండీస్ 137 పరుగుల స్కోరు చేయగలిగింది. ఇక చేజింగ్‌లో లంకేయులు బోల్తా కొట్టడంతో వెస్టిండీస్ తొలిసారిగా టి20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
‘యువీ’రంగం...
భారత్-ఇంగ్లండ్ టి20 ప్రపంచకప్ గ్రూప్ ‘ఈ’ మ్యాచ్ (2007): భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన కీలకమైన ఈ మ్యాచ్‌లో ధోనీసేన గెలిచి సెమీఫైనల్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఇంగ్లండ్‌తో చావోరేవో తేల్చే మ్యాచ్‌లో భారత విజయానికి యువరాజ్ ఆడిన ఇన్నింగ్సే కారణం. అదీ కూడా ఆ ఒక్క ఓవరే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. భారత బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయిన ఈ మ్యాచ్‌లో యువరాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. టి20 క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో యువరాజ్ వరుసగా ఆరు సిక్సర్లు కొట్టింది ఈ మ్యాచ్‌లోనే. ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ వేసిన 19వ ఓవర్‌లో యువరాజ్ 36 పరుగులు (6 సిక్సర్లు) రాబట్టాడు. బ్రాడ్ వేసిన ప్రతీ బంతిని సిక్సర్‌గా మలచి అభిమానుల్ని కనువిందు చేశాడు. ఈ ఒక్క ఓవర్ కారణంగానే భారత్ స్కోరు రెండొందలు దాటింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 15 పరుగులతోనే ఓడటం యువీ సిక్సర్ల విలువేంటో చూపించింది.
మాథ్యూస్ మాయ...
శ్రీలంక-వెస్టిండీస్ టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ (2009 ): ఈ రెండు జట్ల మధ్య ఓవల్‌లో జరిగిన సెమీఫైనల్ పోరులో ఒకే ఓవర్ మ్యాచ్ ఫలితాన్నే శాసించింది. తొలుత శ్రీలంక దిల్షాన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో 158 పరుగుల స్కోరు చేసింది. అయితే గేల్ అండతో తమను చిత్తు చేయాలనుకున్న వెస్టిండీస్‌ను మాథ్యూస్ తొలి ఓవర్‌లోనే కోలుకోలేని దెబ్బ తీశాడు. రెండో బంతికే మార్షల్‌ను మాథ్యూస్ డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత మాథ్యూస్ అదే జోరులో నాలుగో బంతికి సిమన్స్‌ను, ఆరో బంతికి డ్వేన్ బ్రేవోను అవుట్ చేశాడు. ఈ ఇద్దరూ డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. తొలి ఓవర్‌లోనే లంక ఇచ్చిన ఝలక్‌తో వెస్టిండీస్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. ఓవైపు గేల్ బౌలర్లను చితక బాదుతుంటే.. మిగిలిన బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దీంతో లంక దర్జాగా ఫైనల్లోకి ప్రవేశించింది.
హస్సీ హవా...
ఆస్ట్రేలియా-పాకిస్థాన్ టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ (2010): ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరిగిన ఈ సెమీస్ పోరు చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత పాక్ 191 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా చివరి బంతికి నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లింది. 19 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా విజయానికి ఆరు బంతుల్లో 18 పరుగులు చేయాల్సి ఉంది. ఈ ఒక్క ఓవరే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. అప్పటిదాకా విజయం ఖాయమనుకున్న పాకిస్థాన్‌కు హస్సీ ఝలక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసే అవకాశం సయీద్ అజ్మల్‌కు దక్కింది. తొలి బంతికి మిచెల్ జాన్సన్ ఒక్క పరుగు తీశాడు. దీంతో టెన్షన్ పెరిగిపోయింది. అజ్మల్‌ను ఎదుర్కొనే అవకాశం మైక్ హస్సీకి దక్కింది. అతడు వేసిన షార్ట్ బంతిని పుల్ షాట్‌గా ఆడాడు. అది కాస్తా బౌండరీ లైన్ బయటపడింది. ఆ తర్వాత హస్సీ అదేజోరులో సిక్సర్, ఫోర్ కొట్టి స్కోరు సమం చేశాడు. ఇక ఐదో బంతిని హస్సీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఆస్ట్రేలియా ఊహించని విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.