ట్రెండింగ్‌లో సిక్సర్ల ‘యువరాజు‌’ | Fans Trends Yuvraj Singh After One of Year of Retirement | Sakshi
Sakshi News home page

ట్రెండింగ్‌లో సిక్సర్ల ‘యువరాజు‌’

Published Wed, Jun 10 2020 12:18 PM | Last Updated on Wed, Jun 10 2020 1:01 PM

Fans Trends Yuvraj Singh After One of Year of Retirement - Sakshi

క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి నేటికి ఏడాది పూర్తయినా ఇంకా అభిమానుల గుండెల్లో యువరాజుగానే ఉన్నాడు సిక్సర్ల వీరుడు యూవీ. టీమిండియాలో ట్రబుల్ షూటర్‌గా ప్రసిద్ధి చెందిన యువరాజ్ సింగ్‌ మరోమారు ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచాడు. మిస్‌యూయూవీ(#MissYouYuvi) హ్యాష్‌ట్యాగ్‌ జోడించి యువరాజ్‌ సింగ్‌పై తమకున్న అభిమానాన్ని ట్వీట్‌ల రూపంలో క్రికెట్‌ ప్రేమికులు చూపించారు. లెజెండ్‌లకు రిటైర్మెంట్‌ ఉండదని యూవీపై తమ అభిమానం శాశ్వతమైందంటూ కామెంట్లు పెడుతున్నారు.

యూవీ ప్రస్థానం.. 
టీమిండియాకు ఎంపికైన తర్వాత కొంత కాలం తన ముద్ర చూపిన యువీ రెండేళ్ల తర్వాత వరుస వైఫల్యాలతో జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే పునరాగమనం తర్వాత 2002 నాట్‌వెస్ట్‌ టోర్నీ అతని కెరీర్‌ను తారాజువ్వలా పైకి లేపింది. 2003 ప్రపంచకప్‌లో సచిన్‌కు తోడుగా అర్ధసెంచరీ చేసిన అతను... తన 71వ వన్డేలో గానీ మొదటి సెంచరీ సాధించలేకపోయాడు. 2004లో సిడ్నీ మైదానంలో ఆసీస్‌పై చెలరేగి 122 బంతుల్లో చేసిన 139 పరుగుల ఇన్నింగ్స్‌ అతని కెరీర్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శనల్లో ఒకటి. ఇక 2007లో జరిగిన తొలి టి20 ప్రపంచకప్‌లో యువీ ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ ఓవర్లో ఆరు సిక్సర్లే కాదు... ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్లో 30 బంతుల్లో చేసిన 70 పరుగుల ఇన్నింగ్స్‌ అతని విలువేమిటో చూపించింది. 2010లో ఫామ్‌ కోల్పోవడం, క్రమశిక్షణ లోపం, ఫిట్‌నెస్‌ సమస్యలతో మళ్లీ అతనిపై వేటు పడినా... తక్కువ వ్యవధిలోనే తిరిగొచ్చాడు. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ ప్రదర్శన యువరాజ్‌ కెరీర్‌లో కోహినూర్‌ వజ్రంగా నిలిచిపోయింది. బ్యాటింగ్‌కు తోడు అతని లెఫ్టార్మ్‌ స్పిన్‌ కూడా భారత్‌కు కీలక సమయాల్లో విజయాలు అందించింది.  

ప్రపంచ కప్‌ గెలిచిన కొన్నాళ్లకే యువరాజ్‌కు క్యాన్సర్‌ ఉన్నట్లు బయటపడింది. జీవితంలో అతి పెద్ద పోరాటంగా భావిస్తూ చికిత్స పొంది కోలుకున్న అనంతరం యువీ మళ్లీ క్రికెట్‌ మైదానంలో అడుగు పెట్టడం ఒక అద్భుతం. అయితే కెరీర్‌లో ఉచ్ఛ స్థితిలో ఉన్న సమయంలో వచ్చిన క్యాన్సర్‌ తర్వాత అతని ఆట అంత గొప్పగా సాగలేదు. పోరాటానికి మారుపేరుగా నిలిచిన యువీ పలు మార్లు జట్టులోకి రావడం, పోవడం తరచుగా జరిగాయి. వన్డేల్లో ఇంగ్లండ్‌పై చేసిన 150 పరుగుల తన వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు,  టి20ల్లో ఆస్ట్రేలియాపై 35 బంతుల్లోనే 77 పరుగులు చేసిన ఇన్నింగ్స్‌ మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు రాలేదు. ఆ తర్వాత దేశవాళీలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కొత్త క్రికెటర్ల రాకతో అతను మెల్లగా భారత జట్టుకు దూరమయ్యాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో యువీ రాజసం ఎప్పటికీ చెక్కుచెదరనిది అనడంలో సందేహమే లేదు. 

మధుర జ్ఞాపకాలు...
7 అక్టోబర్, 2000 (నైరోబీ):  ఆసీస్‌తో చాంపియన్స్‌ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌. యువీ తొలి ఇన్నింగ్స్‌ ఇదే. 80 బంతుల్లో 12 ఫోర్లతో 84 పరుగులు చేసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. యువీ రాక ప్రపంచానికి తెలిసింది. భారత్‌ ఈ మ్యాచ్‌లో 20 పరుగులతో నెగ్గింది. 

22 జనవరి, 2004 (సిడ్నీ): ఆస్ట్రేలియాపై 122 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో చేసిన 139 పరుగులు చేసిన యువరాజ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌ ఆసీస్‌ గెలిచింది.  

19 ఫిబ్రవరి, 2006 (కరాచీ): పాకిస్తాన్‌ గడ్డపై 4–1తో వన్డే సిరీస్‌ నెగ్గడంలో కీలక పాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచాడు. ఆఖరి వన్డేలో 93 బంతుల్లోనే 14 ఫోర్లతో 107 పరుగులు చేయడంతో భారత్‌ 8 వికెట్లతో గెలిచింది.  
 
19 జనవరి, 2017 (కటక్‌): పునరాగమనం తర్వాత యువీ చేసిన అద్భుత శతకం ఇది. ఇంగ్లండ్‌పై 127 బంతుల్లోనే 21 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగి 150 పరుగులతో తన అత్యధిక స్కోరు నమోదు చేశాడు.  

6 6 6 6 6 6  
యువరాజ్‌ అంటే క్రికెట్‌ ప్రపంచానికి గుర్తుకొచ్చే మ్యాచ్‌ ఇది. 2007 తొలి టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన పోరులో యువరాజ్‌ చూపించిన విశ్వరూపం ఇది. స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన యువీ కొత్త చరిత్ర సృష్టించాడు. టి20ల్లో ఈ ఘనత సాధించిన ఏకైన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో 12 బంతుల్లోనే అతను చేసిన ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది.  

‘విశ్వ’ రూపం
యువరాజ్‌ కెరీర్‌లో 2011 వన్డే ప్రపంచ కప్‌ విజయం ఎవరెస్ట్‌లాంటిది. తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అతను భారత్‌ 28 ఏళ్ల తర్వాత ట్రోఫీ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు సహా 362 పరుగులు చేసిన అతను... 15 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’గా నిలిచాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement