ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day) (ఫిబ్రవరి 4) నాడు ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడి గెలిచిన ఐదురుగు స్టార్ క్రికెటర్ల గురించి తెలుసుకుందాం. క్రికెటర్లకు సంబంధించి క్యాన్సర్ (Cancer) పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు యువరాజ్ సింగ్(Yuvraj SIngh). ఈ టీమిండియా మాజీ క్రికెటర్ 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో క్యాన్సర్‌తో బాధ పడ్డాడు.
ఆ సమయంలో యువరాజ్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో బరిలోకి దిగి భారత్‌ను జగజ్జేతగా నిలిపాడు. ఆ టోర్నీలో యువీ 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు.
ప్రపంచ కప్ గెలిచిన వెంటనే యువరాజ్‌కు ఊపిరితిత్తులలో అరుదైన జెర్మ్ సెల్ కణితి (క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అతను అమెరికాలో కీమోథెరపీ చేయించుకున్నాడు. ఆ సమయంలో యువీ నెలల తరబడి తీవ్రమైన నొప్పి మరియు మానసిక సంఘర్షణలను ఎదుర్కొన్నాడు. 2012లో అతను క్యాన్సర్‌ను జయించి యోధుడిలా తిరిగి భారత జట్టులో చేరాడు. యువీ ప్రయాణం క్రికెట్ యొక్క గొప్ప పునరాగమన కథలలో ఒకటిగా మిగిలిపోయింది.
మైఖేల్ క్లార్క్: 43 ఏళ్ల ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ చర్మ క్యాన్సర్‌పై విజయం సాధించాడు. ఆస్ట్రేలియా గొప్ప కెప్టెన్లలో ఒకరైన క్లార్క్‌కు 2006లో క్యాన్సర్ బయటపడింది. వైద్యులు అతని ముఖం, ఛాతీ, నుదిటిపై క్యాన్సర్ మచ్చలను గుర్తించారు. వీటిని తొలగించేందుకు క్లార్క్ అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. క్లార్క్ కెరీర్ ఆరంభంలోనే క్యాన్సర్‌పై విజయం సాధించి విజయవంతంగా తన కెరీర్‌ను కొనసాగించాడు. క్లార్క్ ఆసీస్ తరఫున 115 టెస్ట్‌లు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడి 17000 పైచిలుకు పరుగులు చేశాడు.
మార్టిన్ క్రో: ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ యుక్త వయసులో ఉండగానే క్యాన్సర్‌తో పోరాడాడు. అతనికి లింఫోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. క్యాన్సర్ నుంచి బయట్ట పడ్డాక క్రో తిరిగి ప్రజా జీవితంలోకి వచ్చాడు. అయితే అతనికి రెండోసారి క్యాన్సర్ వచ్చింది. అప్పుడు కూడా అతను ప్రాణాంతక వ్యాధితో పోరాడే ప్రయత్నం చేశాడు. అయితే 2016లో అతను విషాదకర రీతిలో మరణించాడు. మార్టిన్ క్రోకు క్లాసికల్ బ్యాటర్‌గా గుర్తింపు ఉంది. క్రో 1982-95 మధ్యలో న్యూజిలాండ్ తరఫున 77 టెస్ట్‌లు, 143 వన్డేలు ఆడి 10000 పైచిలుకు పరుగులు చేశాడు.
గ్రేమ్ పొల్లాక్: ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్‌కు ఆ దేశ క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాటర్‌గా పేరుంది. గ్రేమ్ పొల్లాక్ 1963-70 మధ్యలో ప్రపంచంలోనే మేటి బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున 23 టెస్ట్‌లు ఆడిన పొల్లాక్ 7 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 2256 పరుగులు చేశాడు. 2013లో పొల్లాక్‌కు కొలొరెక్టల్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆ సమయంలో అతను క్యాన్సర్‌తో పోరాడి గెలిచాడు. ప్రస్తుతం పొల్లాక్ 80 ఏళ్ల వయసులో జీవనం కొనసాగిస్తున్నాడు.
జెఫ్రీ బాయ్‌కాట్: ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్ ఓపెనర్.. 1990, 2000 దశకాల్లో ప్రముఖ వ్యాఖ్యాత అయిన జెఫ్రీ బాయ్‌కాట్ గొంతు క్యాన్సర్‌పై విజయం సాధించాడు. అతను 35 కఠినమైన రేడియోథెరపీ సెషన్‌లు చేయించుకున్నాడు. రేడియోథెరపీ సమయంలో బాయ్‌కాట్ తీవ్రమైన నొప్పిని ఎదుర్కొన్నాడు. క్యాన్సర్‌ను జయించాక బాయ్‌కాట్ తిరిగి వ్యాఖ్యానం మొదలుపెట్టాడు. ప్రస్తుతం బాయ్‌కాట్ వయసు 84 ఏళ్లు.
Comments
Please login to add a commentAdd a comment