‘చాంపియన్’లో ఏముంది! | Bravo singing Champion song is You Tube Record | Sakshi
Sakshi News home page

‘చాంపియన్’లో ఏముంది!

Published Tue, Apr 12 2016 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

‘చాంపియన్’లో ఏముంది!

‘చాంపియన్’లో ఏముంది!

ఉర్రూతలూగిస్తున్న బ్రేవో పాట
యూ ట్యూబ్‌లో రికార్డ్ హిట్స్

 
 
సాక్షి క్రీడావిభాగం ‘అందరికీ తెలుసు గేల్ చాంపియన్, లారా కూడా చాంపియన్... ఒబామా చాంపియన్, మండేలా చాంపియన్’... ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రేవో సింగిల్ ‘చాంపియన్’ సాహిత్యమిది! సాధారణ పదాలతో, వినేవారికి పెద్దగా శ్రమ కల్పించకుండా ఉంటూ అప్పటికప్పుడు అల్లుకున్న పాటలాగా ఇది అనిపిస్తుంది. క్రికెటర్‌గా బ్రేవోకున్న గుర్తింపు వల్ల పాట అందరికీ పరిచయమైతే... వెస్టిండీస్ వరల్డ్ కప్ విజయం ఇప్పుడు దానిని సూపర్‌హిట్  చేసింది. ‘చాంపియన్’ వీడియోకు యూ ట్యూబ్‌లో వారం వ్యవధిలోనే 4.5 మిలియన్ల హిట్స్ రావడం విశేషం.

విండీస్ ఆటగాళ్లయితే దానిని తమ టీమ్ థీమ్ సాంగ్‌గా మార్చుకోగా... ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ పాట డ్యాన్స్ కదలికలను చాలా మంది క్రికెటర్లు, బాలీవుడ్ నటులు అనుకరించారు. రింగ్ టోన్‌లు, కాలర్ ట్యూన్‌లుగా పెట్టుకోవడంతో పాటు లెక్క లేనంత మంది అద్దం ముందు ఈ డ్యాన్స్‌ను చేసి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్ చేస్తున్నారు.


 మొదటి సారేం కాదు
 క్రికెట్‌తో పాటు వినోద ప్రపంచంలో కూడా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న బ్రేవో ఆ క్రమంలో రూపొందించిన మూడో సింగిల్ చాంపియన్. ‘గో గ్యాల్ గో’ పేరుతో తొలి పాట అనంతరం 2013 ఐపీఎల్ సమయంలో చలో చలో అంటూ ఒక హింగ్లీష్ సాంగ్‌ను తయారు చేశాడు. ‘ఉలా’ అనే తమిళ చిత్రంలోనూ అతను ఒక పాట పాడాడు. చాంపియన్ పూర్తి వీడియో సాంగ్‌ను టి20 ప్రపంచ కప్ సందర్భంగా ఇటీవల విడుదల చేయడానికి మూడు నెలల ముందే అతను మెల్‌బోర్న్‌లో బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా దీనిని వేదికపై ప్రదర్శించాడు. నాడు ప్రవాస భారత గాయని పల్లవి శారద అతనితో పదం కలిపింది. దీనిని ప్రమోట్ చేసేందుకు బ్రేవో లాస్ ఏంజెల్స్‌కు చెందిన వీనస్ మ్యూజిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. భారత్‌లో ‘వేగ’ ఈ వీడియోను విడుదల చేసింది. జోసెఫ్ ఫెర్నాండో దీనికి దర్శకత్వం వహించాడు.


 చాలెంజ్ కూడా...
 మన ‘స్టాలిన్’ సినిమాలాగా, సరిగ్గా చెప్పాలంటే ‘స్వచ్ఛ భారత్’ ప్రచారం లాగా ‘చాంపియన్’ పాటకు కూడా ఇలా చేయగలరా అంటూ చాలెంజ్ విసిరాడు. అందరికంటే ముందుగా స్పందిం చిన గేల్ అలాగే డ్యాన్స్ చేసి మరో మూడు పేర్లు అమితాబ్, డివిలియర్స్, కోహ్లిను డ్యాన్స్ చేయాలంటూ నామినేట్ చేశాడు. హర్భజన్ సింగ్ కూడా ఈ పాటకు నర్తించి తన భార్య గీతా బస్రాతో పాటు సచిన్‌కు కూడా సవాల్ విసిరాడు. ‘కరీబియన్ సంస్కృతిలోనే సంగీతం ఉంది. ప్రపంచంలోని చాలా మంది పేరున్న సంగీతకర్తలు ఇక్కడి నుంచి వచ్చారు. క్రికెట్‌తోనే కాకుండా నా అభిమానులను వినోదంతో కూడా ఆనందపరచాలనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాను. చాంపియన్ ఇంత పెద్ద హిట్ అయి నా నమ్మకాన్ని నిలబెట్టింది’ అని బ్రేవో గర్వంగా చెప్పుకున్నాడు. మొత్తంగా ఆటతో పాటు విండీస్ పాట కూడా ఇప్పుడు సరికొత్త సంచలనంగా మారింది.
 
 ప్రముఖుల పేర్లతో...
చాంపియన్’ పాటలో డ్యాన్స్ మొత్తం దాదాపు ఒకే తరహాలో సాగుతుంది. అది సునాయాసంగా కూడా ఉండటంతో చాలా మందికి ఎక్కేసింది. ఈ పాటలో బ్రేవో తనతో పాటు గేల్, పొలార్డ్, లారా, రిచర్డ్స్, మార్షల్‌లాంటి వెస్టిండీస్ ఆటగాళ్ల పేర్లు తీసుకున్నాడు. ఇతర క్రీడా రంగాలకు చెందిన సెరెనా, ఉసేన్ బోల్ట్, జోర్డాన్‌లను చాంపియన్లుగా ప్రస్తుతిస్తూ ఒబామా, మండేలాలాంటి ప్రపంచ ప్రముఖుల పేర్లు కూడా చేర్చాడు. ట్రినిడాడ్ వాళ్ళంతా చాంపియన్లే అని కూడా అతను లైన్‌ను చేర్చాడు. డ్వేవో ఎక్కడా బహిరంగంగా చెప్పకపోయినా... పరిశీలిస్తే ఈ పాటలో పేర్లన్నీ నల్ల జాతివారివే కనిపిస్తాయి. వారి గొప్పతనం చెప్పడం కూడా అతని ఉద్దేశం కావచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement