గెలవాలి....నిలవాలి
► నేడు భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్
► గెలిచిన జట్టు సెమీఫైనల్‌కి
► ఓడితే కథ ముగిసినట్లే
► టి20 ప్రపంచకప్ టోర్నీ
సరిగ్గా సంవత్సరం క్రితం... మార్చి 26న సిడ్నీ మైదానంలో జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ చిత్తయింది. ఇప్పుడు ఏడాది వ్యవధిలో మరో ప్రపంచకప్ పోరు వచ్చింది. సెమీస్ కాకపోయినా, ఇప్పుడు కూడా నాకౌట్ పోరే. క్వార్టర్ ఫైనల్‌లాంటి ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు కథ ముగిసిపోతుంది. ఫార్మాట్ వేరు కావచ్చు కానీ వైరంలో మాత్రం తేడా ఉండదు. ఇక నాటి పరాజయానికి పదునైన జవాబు ఇవ్వడం మన వంతు. మన సొంతగడ్డపై ఆసీస్‌ను చిత్తు చేసి ఇంటికి పంపడం, దర్జాగా సెమీస్‌లోకి అడుగుపెట్టడం ఆదివారం భారత్ ముందున్న లక్ష్యం.
మొహాలీ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి;- టి20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత జైత్రయాత్ర ఆస్ట్రేలియాలోనే మొదలైంది. అక్కడి నుంచి 14 మ్యాచ్‌లలో 12 విజయాలు సాధించిన టీమిండియా ఇప్పుడు వరల్డ్‌కప్ రేస్‌లో కీలక దశలో అదే ఆసీస్‌తో పోరుకు సిద్ధమైంది. ఆదివారం ఇక్కడి ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగే లీగ్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఎలాంటి గణాంకాలు, రన్‌రేట్‌లతో పని లేకుండా ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇరు జట్లకు ఇది చావోరేవోలాంటి పరిస్థితి. ఉత్కంఠభరితంగా సాగిన గత మ్యాచ్‌లో భారత్ ఒక పరుగుతో గట్టెక్కగా, ఇదే మైదానంలో శుక్రవారం పాక్‌ను చిత్తు చేసి ఆసీస్ ఆత్మవిశ్వాసంతో ఉంది.
ఉదాసీనత లేకుండా...: బంగ్లాదేశ్‌తో ఓటమి అంచుల్లోకి వెళ్లినా చివరకు భారత్ మ్యాచ్ కాపాడుకోగలిగింది. అయితే ఈసారి అలాంటి పరిస్థితి వస్తే ఒత్తిడిలో చిత్తవడానికి ఎదురుగా ఉన్న జట్టు బంగ్లాదేశ్ కాదు. చిన్నపాటి అవకాశం ఇచ్చినా ఆస్ట్రేలియన్లు మ్యాచ్ లాక్కోగలరు. కాబట్టి అన్ని రంగాల్లో జట్టు సమష్టిగా రాణించాల్సి ఉంది. చివరి రెండు మ్యాచ్‌లలో గెలిచినా నిజాయితీగా చెప్పాలంటే భారత జట్టు బ్యాటింగ్ ప్రదర్శన చెప్పుకోదగిన స్థాయిలో లేదు. ముఖ్యంగా ఓపెనర్లు ఒక్కసారి కూడా శుభారంభం ఇవ్వలేకపోయారు. ఈ టోర్నీకి ముందు స్టార్ హోదాతో బరిలోకి దిగిన రోహిత్‌తో పాటు ధావన్ ఒక్కసారి కూడా ఆకట్టుకోలేదు. పైగా వీరిద్దరూ నిర్లక్ష్యమైన రీతిలో వరుసగా ఒకే తరహాలో అవుట్ కావడం ఆసీస్ గుర్తిస్తే కష్టం.
కోహ్లి విఫలమైతే చాలు... ఇక కష్టం అన్నట్లుగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కనిపించింది. శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్‌తో పాటు లోయర్ ఆర్డర్ వరకు కూడా అంతా సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బౌలింగ్‌లో పేసర్లకంటే అశ్విన్, జడేజాల రాణింపుపైనే భారత్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రాక్టీస్ సందర్భంగా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ సాధారణ సెషన్ తర్వాత బుమ్రాకు స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. గాల్లో లేచే బంతిని క్యాచ్ ఎలా అందుకోవాలో ప్రతీది విడమర్చి చెప్పడంతో పాటు చాలా సేపు సాధన చేయించాడు.
అందరూ ఫామ్‌లోనే!
తొలి మ్యాచ్‌లో కివీస్‌తో ఓడి ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై తడబడుతూ గెలిచిన ఆస్ట్రేలియా ఒక్కసారిగా సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చింది. జట్టులో అందరూ రాణించడంతో గత మ్యాచ్‌లో ఆ జట్టు పాక్‌పై ఘన విజయం సాధించింది. ఇది కచ్చితంగా వారిలో ఆత్మవిశ్వాసం పెంచే అంశం. వార్నర్ మినహా గత మ్యాచ్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా చెలరేగారు. అయితే వార్నర్ ఎప్పుడైనా ప్రమాదకర ఆటగాడే. అతనితో పాటు ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే వాట్సన్, మ్యాక్స్‌వెల్, ఫాల్క్‌నర్‌లకు ఇక్కడి పిచ్‌లపై మంచి అనుభవం ఉంది.
ఈ టోర్నీతో రిటైర్ కానున్న వాట్సన్ తన జట్టును టోర్నీలో మరింత ముందుకు తీసుకెళ్లాని పట్టుదలగా ఉన్నాడు. పాక్‌తో బ్యాటింగ్ చూస్తే వాట్సన్ ఎంత ప్రమాదకారినో అర్థమవుతుంది. ఈ ఏడాది ఆరంభంలో ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్‌తో పోలిస్తే భారత్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఈసారి కూడా అదే జట్టు బరిలోకి దిగవచ్చు. ఈ టోర్నీలో ప్రభావం చూపిస్తున్న లెగ్‌స్పిన్నర్ ఆడమ్ జంపా తొలిసారి భారత్‌పై ఆడబోతున్నాడు.
జట్లు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, నెహ్రా, బుమ్రా.
ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), ఫించ్, ఖాజా, వార్నర్, వాట్సన్, మ్యాక్స్‌వెల్, ఫాల్క్‌నర్, నెవిల్, కూల్టర్ నీల్, జంపా, హాజల్‌వుడ్.
పిచ్, వాతావరణం
టోర్నీలో ఇక్కడి రెండు వేర్వేరు పిచ్‌లపై జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ పరుగుల వరద పారింది. ఇప్పుడు కూడా బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్ కనిపిస్తోంది. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వాతావరణం సాధారణంగా ఉంది. వర్షంతో మ్యాచ్‌కు ఆటంకం కలిగే అవకాశాలు తక్కువ.
8 భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు 12 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 8 గెలిచి 4 ఓడింది. వరల్డ్‌కప్‌లలో 4 మ్యాచ్‌లలో చెరో 2 గెలిచారు.