ధర్మశాల: భారీ వర్షం కారణంగా టి20 ప్రపంచకప్‌లో శుక్రవారం జరగాల్సిన రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లూ రద్దయ్యాయి. గ్రూప్ ‘ఎ’లో భాగంగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఒమన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత వర్షం రావడంతో మైదానం చిత్తడిగా మారడంతో ఒక్క బంతి కూడా సాధ్యపడలేదు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా పరిణామంతో నెదర్లాండ్స్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించడంలో విఫలమైంది.
మరోవైపు బంగ్లాదేశ్, ఐర్లాండ్‌ల మధ్య మ్యాచ్ ఆలస్యంగా మొదలైనా.. మధ్యలో వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 8 ఓవర్లలో 2 వికెట్లకు 94 పరుగులు చేసింది. తమీమ్ (47), సౌమ్య సర్కార్ (20), షబ్బీర్ రెహమాన్ (13 నాటౌట్) రాణించారు. ఈ దశలో భారీ వర్షం రావడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. శనివారం జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్‌ల్లో జింబాబ్వేతో అఫ్ఘానిస్తాన్; హాంకాంగ్‌తో స్కాట్లాండ్ తలపడతాయి.