సుదీర్ఘ కాలంగా భారత గడ్డపై టెస్టుల్లో దండయాత్ర చేస్తూ వచ్చినా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన శ్రీలంక వన్డేల్లో మాత్రం అక్కడక్కడా కొన్ని గుర్తుంచుకోదగ్గ మ్యాచ్‌లు ఆడింది.అయితే మొత్తంగా చూస్తే సొంతగడ్డపై భారత్ జోరు ముందు ద్వైపాక్షిక సిరీస్‌లలో లంక పూర్తిగా తలవంచింది. తొమ్మిది సార్లు భారత్‌తో తలపడిన ఆ జట్టు ఒక్కసారి సిరీస్‌ను ‘డ్రా’ చేసుకోవడం మినహా ప్రతీసారి ఓడింది. ఇటీవలే తమ దేశంలో కూడా టీమిండియా చేతిలో 0–5తో చిత్తుగా ఓడిన ఆ జట్టు టెస్టు సిరీస్ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ఇక్కడైనా పోటీ ఇస్తుందా చూడాలి.
సాక్షి క్రీడా విభాగం: భారత జట్టు గత ఏడాదిన్నర కాలంలో ఏడు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆడితే ఏడింటిలోనూ విజేతగా నిలిచింది. ఇదీ టీమిండియా అద్భుత ఫామ్‌కు సూచన. సరిగ్గా ఇదే సమయంలో శ్రీలంక కూడా ఎనిమిది ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడింది. అయితే వాటిలో ఒక్క ఐర్లాండ్‌పై మినహా మిగిలిన ఏడూ ఓడింది! ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ చేతుల్లో క్లీన్‌స్వీప్ కావడానికి ముందు తమ సొంతగడ్డపై జింబాబ్వే చేతిలో కూడా ఆ జట్టు సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో శ్రీలంక తాజా పరిస్థితి టెస్టులకంటే వన్డేల్లో భిన్నంగా ఏమీ లేదని అర్థమవుతోంది.
కొన్ని మార్పులతో ఆ జట్టు వన్డే సిరీస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరోవైపు సూపర్ స్టార్ విరాట్ కోహ్లి లేకపోయినా భారత జట్టు అంతే బలంగా కనిపిస్తోంది. ఇటీవలే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌పై నెగ్గిన జట్టంతా ఇప్పుడు మరో సిరీస్ విజయానికి సన్నద్ధమైంది. తొలిసారి భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ తనదైన ముద్ర వేయాలని పట్టుదలగా ఉన్నాడు. రేపటి నుంచి జరిగే ఈ మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతుందా లేక శ్రీలంక కోలుకుంటుందా అనేది ఆసక్తికరం.
►9 భారతగడ్డపై భారత్, శ్రీలంక మధ్య జరిగిన వన్డే సిరీస్‌లు. ఇందులో భారత్ 8 గెలవగా... 1997–98లో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్ మాత్రం 1–1తో డ్రాగా ముగిసింది.
►48 భారత్‌లో ఇరు జట్ల మధ్య మొత్తం 48 వన్డేలు జరిగాయి. ఇందులో భారత్ 34 గెలిచి 11 ఓడింది. మరో 3 మ్యాచ్‌లలో ఫలితం రాలేదు.
►2 ఎనిమిది సిరీస్‌లలో భారత్ 2 సార్లు క్లీన్‌స్వీప్ చేసింది. సరిగ్గా మూడేళ్ల క్రితం 2014లో జరిగిన సిరీస్‌లో భారత్ 5–0తో గెలిచింది.
► 155ఓవరాల్‌గా భారత్, శ్రీలంక 155 వన్డేల్లో తలపడ్డాయి. వీటిలో భారత్ 88 గెలిచి, 55 ఓడింది. మరో 11 మ్యాచ్‌లలో ఫలితం రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment