ఎవరికో విజయహారం | Batting muscle helps India restore parity | Sakshi
Sakshi News home page

ఎవరికో విజయహారం

Published Sun, Feb 14 2016 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM

ఎవరికో  విజయహారం

ఎవరికో విజయహారం

వైజాగ్‌లో నేడు భారత్, శ్రీలంక మధ్య మూడో టి20 మ్యాచ్
సూపర్ ఫామ్‌లో ధోనిసేన ఒత్తిడిలో లంకేయులు

సాగరంలో యుద్ధ నౌకల విన్యాసాలు చూసి వారం తిరగకముందే... నగరంలో ధనాధన్ క్రికెట్‌కు రంగం సిద్ధమైంది. గత మూడేళ్లుగా క్రికెట్ లేక బోసిపోయిన విశాఖ అభిమానులు ఇప్పుడు లంకతో ఆఖరి టి20 కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్ కావడంతో ఈ ఉత్కంఠ మరింత రెట్టింపైంది. రాంచీలో రెచ్చిపోయిన భారత స్టార్స్... విశాఖలోనూ పరుగుల వరద పారించి విజయహారంతో తిరిగి వెళ్లాలనేదే అభిమానుల ఆకాంక్ష.

సాక్షి, విశాఖపట్నం: తొలి మ్యాచ్‌లో ఓటమితో మేలుకున్న భారత క్రికెటర్లు రెండో టి20లో శ్రీలంక కుర్రాళ్లను దుమ్ముదులిపారు. అదే ఉత్సాహంతో ఇక ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో భారత జట్టు విశాఖపట్నంలో అడుగుపెట్టింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగే మూడో టి20లో పటిష్ట భారత్ జట్టు శ్రీలంకతో తలపడుతుంది.  మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. టి20 ప్రపంచకప్‌కు ముందు సొంతగడ్డపై భారత్ ఆడబోతున్న ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఇది. మరి ఇందులో ప్రయోగాలు చేస్తారో లేదో చూడాలి. ఇక ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగాలన్నా భారత్ ఈ మ్యాచ్ గెలవాలి.

మార్పుల్లేకపోవచ్చు!
పుణేలో పచ్చిక వికెట్‌పై కాస్త ఇబ్బందిపడ్డ భారత బ్యాట్స్‌మన్.. రాంచీలో మాత్రం ఫ్లాట్ ట్రాక్‌పై దుమ్మురేపారు. దీంతో రెండో మ్యాచ్‌లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్‌కు యధావిధిగా కొనసాగించే అవకాశాలున్నాయి. టాప్ ఆర్డర్ మొత్తం సూపర్ ఫామ్‌లో ఉండటం ధోనిసేనకు కలిసొచ్చే అంశం. ధావన్, రోహిత్‌ల మెరుపు దాడి వల్ల బ్యాటింగ్ ఆర్డర్‌లో ధోని కొన్ని ప్రయోగాలు చేసినా బాగానే అనుకూలించాయి. కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ హార్దిక్ పాండ్యా భారీ హిట్టింగ్ చేయాలని చూస్తున్నాడు. షాట్ల ఎంపికలో కాస్త ఆప్రమత్తంగా వ్యవహరిస్తే అతనికి తిరుగుండదు. రహానే కుదురుకోవాల్సి ఉన్నా... రైనా, పాండ్యాల భాగస్వామ్యం భారత్‌కు భారీ స్కోరును ఖాయం చేస్తున్నాయి.

అయితే యువరాజ్‌పై భారీ అంచనాలు ఉన్నా.. బ్యాటింగ్ అవకాశం ఎక్కువగా రావడంలేదు. ఈ మ్యాచ్‌లో యువీని ప్రమోట్ చేస్తే మాత్రం లంకకు ఇబ్బందులు తప్పవు. ఇక స్లాగ్ ఓవర్లలో ధోని, జడేజా బ్యాట్లు ఝుళిపిస్తే భారత్‌కు తిరుగుండదు. రాంచీలో బౌలర్లందరూ సమష్టిగా రాణించడం టీమిండియాకు స్ఫూర్తినిచ్చే అంశం. లక్ష్యాన్ని భారీగా నిర్దేశించినా ప్రత్యర్థులను తక్కువకే కట్టడి చేయడం శుభసూచకం. అయితే ధోని పార్ట్‌టైమర్లను ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో రెగ్యులర్ బౌలర్లు కాస్త గాడి తప్పుతున్నారు. పరుగులు నిరోధించడంలో ఇబ్బందిపడుతున్నారు. బుమ్రా అంచనాలను అందుకుంటున్నా.. నెహ్రా ఆరంభంలో వికెట్లు తీయాల్సి ఉంది. ప్రధాన స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఈ మ్యాచ్‌లో మరోసారి కీలకం కానున్నారు. యువీ, రైనాలు బంతితోనూ మ్యాజిక్ చేస్తుండటం భారత్‌కు అదనపు బలం.

డిక్‌వెల్లా, వాండర్సేకు అవకాశం
మరోవైపు రెండో మ్యాచ్‌తోనే సిరీస్ గెలిచే అరుదైన అవకాశాన్ని చేజార్చుకున్న లంక తీవ్ర ఒత్తిడిలో ఉంది. తమ వ్యూహాలన్నింటిని ఆరంభంలోనే ధావన్ పటాపంచలు చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడింది. అయితే ఈ మ్యాచ్‌లో శిఖర్‌ను కట్టడి చేసేందుకు మేనేజ్‌మెంట్ కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది. చమీరాతో ఎక్కువగా యార్కర్లు వేయించాలని భావిస్తోంది. దీనికి తోడు తుది జట్టులో రెండు మార్పులు చేసి డిక్‌వెల్లా, వాండర్సేకు అవకాశం ఇవ్వొచ్చు. దీనివల్ల మిడిలార్డర్‌ను బలోపేతం చేయడంతో పాటు వాండర్సేతో స్లాగ్ ఓవర్లలో పరుగులు నిరోధించాలని చూస్తోంది.

రెండో మ్యాచ్‌లో పెరీరా హ్యాట్రిక్ తీసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక స్పిన్నర్లు కూడా భారీ షాట్లకు అవకాశం ఇస్తుండటం లంకను ఆందోళనలో పడేసింది. బ్యాటింగ్‌లో దిల్షాన్ విఫలంకావడంతో మిగతా వారిపై ఒత్తిడి పెంచుతోంది. చండిమల్, కపుగెడెరా ఓ మాదిరిగా ఆడుతున్నా భాగస్వామ్యాలు నమోదు చేయడంలో విఫలమవుతున్నారు. సిరివర్ధన, షనకలు తమ స్థాయి మేరకు రాణిస్తున్నా చివరి వరకు నిలబడలేకపోతున్నారు.

జట్లు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, రైనా, యువరాజ్, హార్దిక్, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా.
శ్రీలంక: చండిమల్ (కెప్టెన్), డిక్‌వెల్లా, దిల్షాన్, కపుగెడెర, షనక, సిరివర్ధన, పెరీరా, సేననాయకే, చమీరా, వాండర్సే, రజిత.

విశాఖలో ఆడిన ఐదు వన్డేల్లో భారత్ నాలుగింటిలో గెలిచింది. అయితే ఇక్కడ మ్యాచ్ జరగక దాదాపు మూడేళ్లు కావొస్తుంది. 2012 సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌తో టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఆ తర్వాత 2014లో అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్ జరగాల్సి ఉన్నా హుదూద్ కారణంగా రద్దయింది. ఈ మైదానంలో తొలిసారి టి20 జరగబోతోంది.
రా.గం 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో  ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement