ధోనికి 24 వన్డేలే చాన్స్: కోహ్లి
సాక్షి, పల్లెకెలె: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి మునుపటి ఫామ్ అందుకునేందుకు రాబోవు 24 వన్డేల్లో మాత్రమే అవకాశముందని కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశారు. శ్రీలంకతో గురువారం రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో బుధవారం రాత్రి మీడియాతో కోహ్లి మాట్లాడారు.
2019 ప్రపంచకప్‌ని దృష్టిలో ఉంచుకుని ఈ పర్యటన నుంచే తుది జట్టు వేటని ఆరంభిస్తామని ఇప్పటికే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే యువరాజ్, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్‌లను సైతం పక్కన పెట్టి యువ క్రికెటర్లకి సెలక్టర్లు అవకాశమిచ్చారు.
'జట్టులోని ప్రతి క్రికెటర్ పోషించాల్సిన పాత్రపై మాకు చాలా స్పష్టత ఉంది. రాబోవు సీజన్‌లో వారికి వీలైనన్ని ఎక్కువ అవకాశాలిస్తాం. ముఖ్యంగా ధోనీకి ఈ ప్రణాళిక చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అతను ఇప్పుడు టెస్టు క్రికెట్ ఆడటం లేదు. కాబట్టి ఈ సీజన్‌లో ఆడే 24 వన్డేలతో అతను మునుపటి ఫామ్ అందుకుంటాడే నమ్మకం ఉంది.
ధోనీకే కాదు.. ఇప్పుడు జట్టులో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇదో మంచి అవకాశం. తుది జట్టులో ఇద్దరు ఎడమచేతి వాటం స్పిన్నర్లని ఆడించడం కష్టం కాబట్టి.. తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితమయ్యారు. అక్షర్ పటేల్ మంచి బౌలరే కాకుండా.. సమర్థవంతమైన ఫీల్డర్ కూడా' అని కోహ్లి వివరించారు.