మెల్‌బోర్న్‌లోనూ మెరిస్తే... | Today India vs Australia Last One Day At Melbourne | Sakshi
Sakshi News home page

మెల్‌బోర్న్‌లోనూ మెరిస్తే...

Published Fri, Jan 18 2019 1:56 AM | Last Updated on Fri, Jan 18 2019 4:39 AM

Today India vs Australia Last One Day At Melbourne - Sakshi

టి20 సిరీస్‌ను 1–1తో ముగించి సంతృప్తి పడినా, టెస్టు సిరీస్‌లో 2–1తో విజయం సాధించి చరిత్ర సృష్టించిన టీమిండియా... వన్డే సిరీస్‌ను వశం చేసుకునేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది. శుక్రవారం జరిగే మూడో మ్యాచ్‌లో గెలుపొందితే... దాదాపు రెండు నెలల ఆస్ట్రేలియా పర్యటనలో అజేయంగా నిలిచినట్లవుతుంది. మరోవైపు పరువు దక్కించుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన స్థితిలో ఉంది ఆతిథ్య జట్టు. ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారిన మెల్‌బోర్న్‌ వన్డేలో మెరిసేదెవరో?  

మెల్‌బోర్న్‌ : ఎంతో చర్చ జరిగి, మరెంతో ఆసక్తి రేపిన ఆస్ట్రేలియా పర్యటన ముగింపునకు వచ్చింది. నవంబరు 21న బ్రిస్బేన్‌లో టి20తో మొదలైన పోరాటానికి... మెల్‌బోర్న్‌లో నేడు జరుగనున్న మూడో వన్డేతో తెరపడనుంది. ప్రస్తుతం 1–1తో సమంగా ఉన్న సిరీస్‌ ఫలితాన్ని కూడా ఇదే మ్యాచ్‌ తేల్చబోతోంది. ఈ క్రమంలో తమ చారిత్రక పర్యట నకు అంతే ఘనంగా వీడ్కోలు పలకాలని కోహ్లి సేన భావిస్తుండగా, సొంతగడ్డపై పూర్తిగా విఫలమైందన్న అప్రతిష్టను తప్పించుకోవాలని ఫించ్‌ బృందం ప్రయత్నిస్తోంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత్‌ ఒకటి లేదా రెండు మార్పులతో దిగనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా రెండు మార్పులు చేయనుంది. 

రాయుడు ఉంటాడా? 
బ్యాటింగ్‌లో నాలుగో నంబరు స్థానంపై ఆందోళన తొలగిందని భావిస్తే, బౌలింగ్‌లో ఐదో బౌలర్‌ బెంగ పట్టుకుంది టీమిండియాకు. పేసర్‌ బుమ్రాకు విశ్రాంతితో ఇది తాత్కాలికమే అయినా, అతడి స్థానంలో వచ్చిన ఖలీల్‌ అహ్మద్, హైదరాబాదీ సిరాజ్‌ తీవ్రంగా నిరాశపర్చారు. వికెట్లు తీయలేకపోగా రెండు మ్యాచ్‌ల్లోనూ భారీగా పరుగులిచ్చారు. దీంతో మెల్‌బోర్న్‌లో పేస్‌ ఆల్‌రౌండర్‌ విజయ్‌శంకర్, లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌లలో ఒకరిని ఆడించే అవకాశం కనిపిస్తోంది. అరంగేట్రంలోనే విజయ్‌ శంకర్‌ ఇక్కడి పిచ్‌లపై 10 ఓవర్లు వేయగలడా? అనే అనుమానాలున్నాయి.

దీన్నిబట్టి చూస్తే చహల్‌నే తీసుకోవచ్చు. లేదా, నిఖార్సైన మూడో పేసరే తగినవాడనుకుంటే సిరాజ్‌ స్థానంలో ఖలీల్‌ను మళ్లీ బరిలో దింపొచ్చు. ప్రధాన పేసర్లు భువనేశ్వర్, షమీ, స్పిన్నర్లు జడేజా, కుల్దీప్‌ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేస్తున్నారు. ఆస్ట్రేలియాను రెండు మ్యాచ్‌ల్లోనూ 300 మార్క్‌ చేరకుండా అడ్డుకున్నారు. ఇక గత మ్యాచ్‌లో ధావన్, కోహ్లి రాణించడంతో రోహిత్‌ సహా టాప్‌–3 బ్యాట్స్‌మెన్‌ ఎప్పటిలాగే టాప్‌ గేర్‌లోకి వచ్చినట్లైంది.

మాజీ కెప్టెన్‌ ధోని తన ముగింపు సామర్థ్యాన్ని మరోసారి చాటుకోవడం, దినేశ్‌ కార్తీక్‌ విలువైన ఇన్నింగ్స్‌ ఆడటంతో మిడిలార్డర్‌ ఫామ్‌పై సందేహాలు తొలిగాయి. మిగిలింది అంబటి రాయుడు మాత్రమే. నాలుగో నంబరులో సరైనోడనుకున్న రాయుడు ఈ సిరీస్‌లో ఉనికి చాటలేదు. జట్టు కూర్పులో ఆరో బౌలర్‌గా పనికొస్తాడని కేదార్‌ జాదవ్‌ను ఆడిస్తే రాయుడి స్థానం ఇబ్బందుల్లో పడ్డట్లే. ఒకవేళ అవకాశం దక్కితే... మున్ముందు ప్రధాన టోర్నీలకూ తన పేరు పరిశీలనలో ఉండాలంటే అతడు ఈ మ్యాచ్‌లో తప్పక రాణించాలి. 

వారి స్థానంలో స్టాన్‌లేక్, జంపా 
టీమిండియా టాపార్డర్‌కు పూర్తి భిన్నంగా ఉంది ఆతిథ్య జట్టు టాపార్డర్‌. కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ పేలవ ఫామ్‌ నుంచి బయటకు రావడం లేదు. ఇన్‌ స్వింగర్లను ఎదుర్కోవడంలో ఫించ్‌ చేతులెత్తేస్తున్నాడు. మరో ఓపెనర్‌ అలెక్స్‌ క్యారీ అంతంతే అన్నట్లున్నాడు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ఖాజా ఫర్వాలేదనిపిస్తున్నాడు. షాన్‌ మార్‌‡్ష అద్భుత ఫామ్‌తో పాటు హ్యాండ్స్‌కోంబ్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్‌ రూపంలో లోతైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉండటం ఆసీస్‌ బలం. పేసర్‌ బెహ్రెన్‌డార్ఫ్‌ గాయంతో దూరమవడం, స్పిన్నర్‌ లయన్‌ ప్రభావం చూపలేకపోతుండటంతో వీరి స్థానాల్లో బిల్లీ స్టాన్‌లేక్, ఆడమ్‌ జంపాలను ఆడించనుంది. మార్‌‡్షను త్వరగా వెనక్కు పంపి, యువ పేసర్‌ జెయ్‌ రిచర్డ్‌సన్‌ను సమర్థంగా ఎదుర్కొంటే మ్యాచ్‌లో కోహ్లి సేనదే పై చేయి అవుతుంది. 

తుది జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్‌), రాయుడు/జాదవ్, ధోని, దినేశ్‌ కార్తీక్, జడేజా, కుల్దీప్, విజయ్‌ శంకర్‌/ చహల్, భువనేశ్వర్, షమీ. 
ఆస్ట్రేలియా: క్యారీ, ఫించ్‌ (కెప్టెన్‌), ఖాజా, షాన్‌ మార్‌‡్ష, హ్యాండ్స్‌కోంబ్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, జంపా, స్టాన్‌లేక్, సిడిల్, రిచర్డ్‌సన్‌ 

పిచ్, వాతావరణం
మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ) పిచ్‌పై బౌన్స్‌ పేసర్లకు ఉపయోగపడుతుంది. పెద్ద బౌండరీలు కావడంతో స్పిన్నర్ల పాత్ర కీలకం కానుంది. వర్ష సూచన లేదు. 27 డిగ్రీలు మించని ఉష్ణోగ్రతతో వాతావరణం ఆటకు అనుకూలంగా ఉండనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement