ఇక వన్డే సిరీస్ కు సిద్ధం
దంబుల్లా: శ్రీలంకతో్ జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. ఇప్పుడు వన్డే పోరుకు సిద్ధమైంది. టెస్టుల తర్వాత లభించిన కొద్ది పాటి విరామంతో సేద తీరిన భారత్.. పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. ఆదివారం నుంచి ఐదు వన్డేల సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో తొలి వన్డేలో గెలుపుపై భారత్ దృష్టి సారించింది. ఈ మేరకు శుక్రవారం నెట్ ప్రాక్టీస్ లో టీమిండియా క్రికెటర్లు తీవ్రంగా శ్రమించారు. కొద్దిసేపు వార్మప్ తో పాటు ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేశారు. ప్రధానంగా శిఖర్ ధావన్, రోహిత్ లు నెట్స్ లో చెమటోడ్చారు. టెస్టు సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచిన శిఖర్ ధావన్ తన ఫామ్ ను వన్డేల్లో కూడా కొనసాగించాలని యోచిస్తున్నాడు. అదే సమయంలో టెస్టుల్లో చోటు దక్కని రోహిత్ శర్మ ఎలాగైనా వన్డే సిరీస్ లో సత్తాచాటుకోవాలని భావిస్తున్నాడు. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ కే పరిమితమైన మహేంద్ర సింగ్ ధోని సైతం జట్టుతో కలిసి ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు పేసర్ బూమ్రాలు రవిశాస్త్రి పర్యవేక్షణలో సాధన చేశారు.
తిరుగులేని రికార్డు..
గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే శ్రీలంకపై భారత్ తిరుగులేని రికార్డును కల్గి ఉంది. ధోని సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లంకతో జరిగిన మూడు వన్డే సిరీస్ లను భారత్ సొంతం చేసుకుంది.. ప్రస్తుత విరాట్ సేన కూడా అదే పునరావృతం చేసేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇదిలా ఉంచితే ఇరు జట్ల మధ్య 1985 నుంచి చూస్తే 26 ద్వైపాక్షిక వన్డేలు జరిగాయి. అందులో భారత్ 13 మ్యాచ్ ల్లో విజయం సాధించగా, లంకేయులు 10 వన్డేలు గెలిచారు.మూడు మ్యాచ్ ల్లో ఫలితం తేలలేదు. చివరిసారి 2012లో భారత్-శ్రీలంక జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. శ్రీలంకలో జరిగిన ఆ సిరీస్ ను భారత్ 4-1 తో సొంతం చేసుకుంది. ఈసారి కూడా భారత్ వన్డే సిరీస్ ను 'భారీ' తేడాతో గెలవాలనే యోచనలో్ ఉంది. శ్రీలంక అనుభవలేమిని తమకు వరంగా మార్చుకుని సిరీస్ ను వైట్ వాష్ చేయాలనే భావనలో కోహ్లి అండ్ గ్యాంగ్ ఉంది. ఆదివారం రాంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. మధ్యాహ్నం గం.2.30 ని.లకు మ్యాచ్ ఆరంభం కానుంది.