IND vs AFG 3rd T20I: రోహిత్‌ సూపర్‌... భారత్‌ ‘డబుల్‌ సూపర్‌’... | IND Vs AFG 3rd T20I: India Beat Afghanistan In 2nd Super Over, Check Score Details Inside - Sakshi
Sakshi News home page

IND vs AFG 3rd T20I Highlights: రోహిత్‌ సూపర్‌... భారత్‌ ‘డబుల్‌ సూపర్‌’...

Published Thu, Jan 18 2024 4:37 AM | Last Updated on Thu, Jan 18 2024 8:43 AM

IND vs AFG 3rd T20I: India beat Afghanistan in 2nd Super Over - Sakshi

ఏమా ఉత్కంఠ... ఏమిటా మలుపులు... ఒక టి20 సమరం అభిమానులందరినీ కట్టిపడేసింది. ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో, అదీ అఫ్గానిస్తాన్‌తో పోరు ఏకపక్షం అనుకుంటే నరాలు తెగే పరిస్థితి వచి్చంది. 212 పరుగులు చేశాక భారత్‌ గెలుపు ఖాయమనిపించి నిశి్చంతగా ఉండగా... అఫ్గానిస్తాన్‌ మేమేమీ తక్కువ కాదన్నట్లుగా స్కోరు సమం చేసేసింది. ‘సూపర్‌ ఓవర్‌’లో ఫలితం తేలుతుందనుకుంటే అక్కడా ఇరు జట్లూ సమమే. చివరకు అంతా రెండో సూపర్‌ను ఆశ్రయించాల్సి వచి్చంది... ఇక్కడ చివరకు పైచేయి సాధించిన టీమిండియా గట్టెక్కింది. తుది ఫలితంతో గెలుపు భారత్‌దే అయినా ఆఖరి వరకు అఫ్గాన్‌ చూపిన పోరాటపటిమ అసమానం.   

బెంగళూరు: టి20 ప్రపంచకప్‌కు ముందు తాము ఆడిన ఆఖరి సిరీస్‌ను భారత్‌ ఘనంగా ముగించింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల పోరును టీమిండియా 3–0తో సొంతం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన చివరి టి20లో భారత్‌ రెండో ‘సూపర్‌ ఓవర్‌’లో విజయం సాధించింది. తొలి సూపర్‌ ఓవర్‌ ఓవర్లో ఇరు జట్లు 16 పరుగులతో సమంగా నిలిచాయి. రెండో సూపర్‌ ఓవర్‌లో ముందుగా భారత్‌ 11 పరుగులు చేయగా... అఫ్గాన్‌ 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. నిబంధనల ప్రకారం ‘సూపర్‌ ఓవర్‌’లో రెండు వికెట్లు పడితే ఇన్నింగ్స్‌ ముగిసినట్టే కావడంతో భారత విజయం ఖరారైంది.  

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (69 బంతుల్లో 121 నాటౌట్‌; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ టి20ల్లో ఐదో సెంచరీతో చెలరేగగా... రింకూ సింగ్‌ (39 బంతుల్లో 69 నాటౌట్‌; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 95 బంతుల్లోనే అభేద్యంగా 190 పరుగులు జోడించారు. అనంతరం అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు సాధించింది. గుల్బదిన్‌ (23 బంతుల్లో 55 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), గుర్బాజ్‌ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇబ్రహీమ్‌ జద్రాన్‌ (41 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు.

శతక భాగస్వామ్యం...
ఫరీద్‌ వేసిన మూడో బంతిని భారీ షాట్‌ ఆడబోయి వెనుదిరిగిన యశస్వి... కోహ్లి తొలి   బంతికి డకౌట్‌... అంతా నిశ్శబ్దం... ఫామ్‌లో ఉన్న శివమ్‌ దూబే కూడా కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వగా, తర్వాతి ఓవర్లో తన తొలి బంతికే సామ్సన్‌ కూడా సున్నాకే అవుట్‌! ఐదో ఓవర్‌ మూడో బంతి ముగిసేసరికి టీమిండియా స్కోరు 21/4... అయితే రోహిత్, రింకూ భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోరు అందించింది.

15 ఓవర్లు ముగిసేసరికి 109/4తో స్కోరు మరీ గొప్పగా ఏమీ లేదు. అయితే చివరి ఐదు ఓవర్లలో 22, 13, 10, 22, 36 స్కోర్లతో భారత్‌ ఏకంగా 103 పరుగులు సాధించింది. 6 ఫోర్లు, 5 సిక్సర్లతో రోహిత్‌ వీర విధ్వంసం ప్రదర్శించగా... 1 సిక్స్, 4 ఫోర్లతో రింకూ చెలరేగిపోయాడు. 64 బంతుల్లోనే శతకం అందుకొని అంతర్జాతీయ టి20ల్లో ఐదో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్‌ నిలవగా... రింకూ ఖాతాలో రెండో అర్ధ సెంచరీ చేరింది. వీరిద్దరి దెబ్బకు అఫ్గాన్‌ కుదేలైంది. రోహిత్‌ తన శైలికి భిన్నంగా ఈసారి కొన్ని వైవిధ్యమైన షాట్లతో అలరించడం విశేషం.

కరీమ్‌ వేసిన చివరి ఓవర్లో తొలి మూడు బంతుల్లో రోహిత్‌ 4, 6 (నోబాల్‌), 6 కొట్టగా... చివరి మూడు బంతుల్లో రింకూ 6, 6, 6 బాదాడు. అనంతరం అఫ్గాన్‌ ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీమ్‌ 66 బంతుల్లోనే 93 పరుగులు జోడించి తమ జట్టుకు శుభారంభం అందించారు. వీరు వెనుదిరగడంతో పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత గుల్బదిన్, నబీ (16 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కలిసి జట్టుకు విజయానికి చేరువగా తెచ్చారు. విజయం కోసం చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా, అఫ్గాన్‌ 18 పరుగులు చేయడంతో స్కోరు సమమైంది.

రిలీఫ్‌..!
‘ఏంటి వీరూ... లెగ్‌బై ఇచ్చావా, బ్యాట్‌కు అంత బలంగా బంతి తగిలింది... అసలే ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి’... తను ఆడిన తొలి బంతి లెగ్‌సైడ్‌ దిశగా ఆడి బౌండరీని తాకగా, అంపైర్‌ లెగ్‌బై ఇవ్వడంతో అంపైర్‌ వీరేందర్‌ శర్మతో రోహిత్‌ అన్న మాట ఇది! అతని దృష్టిలో ఆ పరుగులు ఎంత విలువైనవో ఇది చెబుతుంది. నిజంగానే టి20ల్లో చాలా కాలంగా రోహిత్‌ ఫామ్‌ బాగా లేదు. వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్నా 2022 నుంచి అంతర్జాతీయ టి20ల్లో ఈ మ్యాచ్‌కు ముందు 31 ఇన్నింగ్స్‌లలో అతను 3 అర్ధ సెంచరీలే చేశాడు.

ఐపీఎల్‌లో కూడా అంతంతమాత్రంగానే ఆడాడు. ఇటీవలి పరిణామాలు సహజంగానే అతడిని ఇబ్బంది పెట్టాయి. ముంబై ఇండియన్స్‌ కెపె్టన్సీ పోవడంతో పాటు టీమిండియా కెపె్టన్సీపై కూడా సందేహాలు వచ్చాయి. అసలు వచ్చే టి20 వరల్డ్‌ కప్‌లో అతను ఆడతాడా అన్నట్లుగా కూడా చర్చ సాగింది. దానికి తోడు తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్‌. ఇలాంటి స్థితిలో ఈ ఇన్నింగ్స్‌ అతని స్థాయిని చూపించింది. అఫ్గాన్‌ మరీ బలమైన ప్రత్యర్థి కాకపోయినా... ఇక్కడా విఫలమైతే పరిస్థితి ఇంకా జఠిలంగా మారేంది. ఈ నేపథ్యంలో సరైన లెక్కలతో చేసిన సెంచరీ రోహిత్‌కు ఊరటనిచి్చందనడంలో సందేహం లేదు.


స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) నబీ (బి) ఫరీద్‌ 4; రోహిత్‌ (నాటౌట్‌) 121; కోహ్లి (సి) ఇబ్రహీమ్‌ (బి) ఫరీద్‌ 0; దూబే (సి) గుర్బాజ్‌ (బి) అజ్మతుల్లా 1; సామ్సన్‌ (సి) నబీ (బి) ఫరీద్‌ 0; రింకూ (నాటౌట్‌) 69; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 212.
వికెట్ల పతనం: 1–18, 2–18, 3–21, 4–22.
బౌలింగ్‌: ఫరీద్‌ 4–0–20–3, అజ్మతుల్లా 4–0–33–1, ఖైస్‌ 4–0–28–0, సలీమ్‌ 3–0–43–0, షరాఫుద్దీన్‌ 2–0–25–0, కరీమ్‌ 3–0–54–0.  

అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) సుందర్‌ (బి) కుల్దీప్‌ 50; ఇబ్రహీమ్‌ (స్టంప్డ్‌) సామ్సన్‌ (బి) సుందర్‌ 50; గుల్బదిన్‌ (నాటౌట్‌) 55; అజ్మతుల్లా (సి) రవి బిష్ణోయ్‌ (బి) సుందర్‌ 0; నబీ (సి) అవేశ్‌ (బి) సుందర్‌ 34; కరీమ్‌ (రనౌట్‌) 2; నజీబుల్లా (సి) కోహ్లి (బి) అవేశ్‌ 5; షరాఫుద్దీన్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 212.
వికెట్ల పతనం: 1–93, 2–107, 3–107, 4–163, 5–167, 6–182.
బౌలింగ్‌: ముకేశ్‌ 4–0–44–0, అవేశ్‌ 4–0–55–1, బిష్ణోయ్‌ 4–0–38–0, సుందర్‌ 3–0–18–3, దూబే 2–0–25–0, కుల్దీప్‌ 3–0–31–1.

సూపర్‌ ఓవర్లలో ఇలా...
ముకేశ్‌ వేసిన తొలి సూపర్‌ ఓవర్లో అఫ్గానిస్తాన్‌ 1 సిక్స్, 1 ఫోర్‌తో 16 పరుగులు చేసింది.  ఛేదన లో రోహిత్‌ 2 సిక్స్‌లు కొట్టినా చివరకు భారత్‌ కూడా 16 పరుగులకే పరిమితమైంది. అవసరమైతే చివరి బంతికి వేగంగా పరుగు తీయాల్సి వస్తుందనే ఆలోచనతో రోహిత్‌ ఐదో బంతి తర్వాత రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగి రింకూను పంపించాడు. అయితే ఆఖరి బంతికి యశస్వి 2 పరుగులు రాబట్టలేకపోయాడు. ఫరీద్‌ వేసిన రెండో సూపర్‌ ఓవర్లో రోహిత్‌ 4, 6తో భారత్‌ 11 పరుగులు చేసింది. అయితే బిష్ణోయ్‌ వేసిన ఈ ఓవర్‌ తొలి 3 బంతుల్లోనే అఫ్గాన్‌ 2 వికెట్లు కోల్పోవడంతో భారత్‌ గెలుపు ఖాయమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement