‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్; ఇషాన్ కిషన్
రాంచీ: శ్రేయస్ అయ్యర్ (111 బంతుల్లో 113 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ శతకం... ‘ఇషాన్’దార్ (84 బంతుల్లో 93; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) ఇన్నింగ్స్ భారత్‌ను సిరీస్‌లో నిలబెట్టాయి. రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై టీమిండియా గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. సిరీస్ నిర్ణాయక మూడో వన్డే మంగళవారం ఢిల్లీలో జరుగుతుంది. రెండో వన్డేలో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.
మార్క్‌రమ్ (89 బంతుల్లో 79; 7 ఫోర్లు, 1 సిక్స్), రీజా హెండ్రిక్స్ (76 బంతుల్లో 74; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. భారత బౌలర్లలో సిరాజ్ (10–1– 38–3) ఆకట్టుకున్నాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 45.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసి గెలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున షహబాజ్ అహ్మద్ అరంగేట్రం చేశాడు. సఫారీ జట్టులో ఫామ్‌లో లేని కెప్టెన్ బవుమా, స్పిన్నర్ షమ్సీల స్థానాల్లో ఫోర్టున్, హెండ్రిక్స్ బరిలోకి దిగారు. దీంతో కేశవ్ మహరాజ్ సారథ్యం చేపట్టాడు.
రాణించిన హెండ్రిక్స్, మార్క్‌రమ్
డాషింగ్ ఓపెనర్ డికాక్ (5)ను క్లీన్‌బౌల్డ్ చేసిన సిరాజ్ సఫారీని గట్టిదెబ్బే తీశాడు. కాసేపటికి మలాన్ (31 బంతుల్లో 25; 4 ఫోర్లు)ను షహబాజ్ అహ్మద్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 40 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సఫారీని హెండ్రిక్స్, మార్క్‌రమ్ ఆదుకున్నారు. హెండ్రిక్స్ 58 బంతుల్లో, మార్క్‌రమ్ 64 బంతుల్లో ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నారు. చాలాసేపు భారత శిబిరాన్ని ఇబ్బంది పెట్టిన ఈ జోడీని ఎట్టకేలకు సిరాజే విడగొట్టాడు. దీంతో 129 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన క్లాసెన్ (26 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిల్లర్ (34 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు) వేగంగా ఆడారు. ఆఖరి 10 ఓవర్లను భారత బౌలర్లు కట్టడి చేయడంతో 57 పరుగులే వచ్చాయి.
కిషన్ సిక్సర్లు
కెప్టెన్ ధావన్ (13), గిల్ (26 బంతుల్లో 28; 5 ఫోర్లు) మళ్లీ నిరాశపరిచారు. దాంతో భారత్ 48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్ ఫలితం, సిరీస్ చేజార్చుకోవడం తప్పదనిపించింది. ఈ దశలో ఇషాన్, శ్రేయస్ ‘లెఫ్ట్–రైట్’ కాంబినేషన్ తో అదరగొట్టారు. మొదట ఆచి తూచి ఆడిన ఈ జోడీ మ్యాచ్ సాగేకొద్దీ దంచేసే పనిలో పడింది. 20.3 ఓవర్లో భారత్ వంద స్కోరు దాటింది. కేశవ్ వేసిన 21వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన ఇషాన్ తర్వాత నోర్జేనూ చితకబాదాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ చక్కని ప్లేసింగ్‌తో చూడముచ్చటైన బౌండరీలతో అలరించాడు. ముందుగా ఇషాన్ 60 బంతుల్లో (2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆ తర్వాత అయ్యర్ 48 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు.
కెప్టెన్ కేశవ్ మహరాజ్ మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినా ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టలేకపోయాడు. భారత బ్యాటర్లు చెలరేగడంతో 33.3 ఓవర్లో స్కోరు 200 పరుగులు దాటింది. కేవలం 16.3 ఓవర్లలో 79 పరుగుల విజయ సమీకరణం సులువైపోయింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ఇషాన్‌ను ఫోర్టున్ అవుట్ చేశాడు. దీంతో 161 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత సామ్సన్ (30 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి అయ్యర్ అజేయంగా లక్ష్యాన్ని పూర్తిచేశాడు. ఈ క్రమంలో శ్రేయస్ 103 బంతుల్లో (14 ఫోర్లు) వన్డేల్లో తన రెండో శతకాన్ని సాధించాడు.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) సిరాజ్ 5; మలాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షహబాజ్ 25; హెండ్రిక్స్ (సి) షహబాజ్ (బి) సిరాజ్ 74; మార్క్‌రమ్ (సి) ధావన్ (బి) సుందర్ 79; క్లాసెన్ (సి) సిరాజ్ (బి) కుల్దీప్ 30; మిల్లర్ (నాటౌట్) 35; పార్నెల్ (సి) శ్రేయస్ (బి) శార్దుల్ 16; కేశవ్ (బి) సిరాజ్ 5; ఫోర్టున్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 278.
వికెట్ల పతనం: 1–7, 2–40, 3–169, 4–215, 5–215, 6–256, 7–277.
బౌలింగ్: సిరాజ్ 10–1–38–3, వాషింగ్టన్ సుందర్ 9–0–60–1, షహబాజ్ అహ్మద్ 10–0– 54–1, అవేశ్ ఖాన్ 7–0–35–0, కుల్దీప్ యాదవ్ 9–0–49–1, శార్దుల్ ఠాకూర్ 5–0–36–1.
భారత్ ఇన్నింగ్స్: ధావన్ (బి) పార్నెల్ 13; గిల్ (సి అండ్ బి) రబడ 28; ఇషాన్ కిషన్ (సి) హెండ్రిక్స్ (బి) ఫోర్టున్ 93; శ్రేయస్ (నాటౌట్) 113; సామ్సన్ (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (45.5 ఓవర్లలో 3 వికెట్లకు) 282.
వికెట్ల పతనం: 1–28, 2–48, 3–209.
బౌలింగ్: ఫోర్టున్ 9–1– 52–1, వేన్ పార్నెల్ 8–0–44–1, రబడ 10–1– 59–1, నోర్జే 8.5–0–60–0, కేశవ్ మహరాజ్ 7–0–45–0, మార్క్‌రమ్ 3–0–22–0.
Comments
Please login to add a commentAdd a comment