ఐపీఎల్‌-2025లో ఆసక్తికర విషయం.. వాళ్లే హీరోలయ్యారు..! | IPL 2025: Players Who Changed Franchises Have Emerged As Heroes For New Teams, Check Interesting Story Inside | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌-2025లో ఆసక్తికర విషయం.. వాళ్లే హీరోలయ్యారు..!

Published Thu, Mar 27 2025 12:33 PM | Last Updated on Thu, Mar 27 2025 1:12 PM

IPL 2025: Players Who Changed Franchises Have Emerged As Heros For New Teams

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఇప్పటివరకు (మార్చి 26) ఆరు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇందులో తొలి ఐదు మ్యాచ్‌లు ధనాధన్‌ బ్యాటింగ్‌ విన్యాసాలతో సాగగా.. నిన్న జరిగిన ఆరో మ్యాచ్‌ ఎలాంటి మెరుపులు లేకుండా చప్పగా ముగిసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో ఫ్రాంచైజీలు మారి వచ్చిన ఆటగాళ్లే తమ కొత్త జట్లను గెలిపించారు.

సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కేకేఆర్‌పై ఆర్సీబీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపులో లక్నో నుంచి వలస వచ్చిన కృనాల్‌ పాండ్యా కీలకపాత్ర పోషించాడు. కృనాల్‌ ఆర్సీబీ తరఫున తన తొలి మ్యాచ్‌లోనే మ్యాచ్‌ విన్నింగ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు.

సీజన్‌ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ విధ్వంసకర సెంచరీ చేసి సన్‌రైజర్స్‌ విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. గత సీజన్‌ వరకు ముంబై ఇండియన్స్‌కు ఆడిన ఇషాన్‌.. సన్‌రైజర్స్‌ తరఫున తన తొలి మ్యాచ్‌లోనే మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు.

మూడో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్‌ లైనప్‌కు కుప్పకూల్చిన నూర్‌ అహ్మద్‌ సీఎస్‌కే గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. గత సీజన్‌ వరకు గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడిన నూర్‌.. సీఎస్‌కే తరఫున తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

సీజన్‌ నాలుగో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆశుతోష్‌ శర్మ అద్భుతమైన బ్యాటింగ్‌ విన్యాసాలు ప్రదర్శించి ఢిల్లీకి ఊహించని విజయాన్నందించాడు. గత సీజన్‌లో పంజాబ్‌కు ఆడిన అశుతోష్‌.. ఢిల్లీ తరఫున తొలి మ్యాచ్‌లోనే అదగొట్టాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు.

ఐదో మ్యాచ్‌లో గుజరాత్‌పై పంజాబ్‌ సూపర్‌ విక్టరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీ త్యాగం చేసి మరీ తన కొత్త ఫ్రాంచైజీ పంజాబ్‌ను గెలిపించాడు. గత సీజన్‌లో కేకేఆర్‌కు టైటిల్‌ అందించిన శ్రేయస్‌.. పంజాబ్‌ తరఫున తన తొలి మ్యాచ్‌లో వీరంగం సృష్టించాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.  

నిన్న జరిగిన ఆరో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై కేకేఆర్‌ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ను డికాక్‌ ఒంటిచేత్తో గెలిపించాడు. గత సీజన్‌లో లక్నోకు ఆడిన డికాక్‌.. కేకేఆర్‌ తరఫున తన రెండో మ్యాచ్‌లోనే అదరగొట్టి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

ఈ ట్రెండ్‌ ప్రకారం చూస్తే.. నేడు జరుగబోయే సన్‌రైజర్స్‌, లక్నో మ్యాచ్‌లో కూడా ఫ్రాంచైజీ మారి వచ్చిన ఆటగాడే తన కొత్త జట్టును గెలిపించే అవకాశం ఉంది. ఆ ఆటగాడు ఎవరవుతారని అనుకుంటున్నారు. 
మరోసారి ఇషాన్‌ అయితే A.. 
పంత్‌ అయితే B.. 
మిచెల్‌ మార్ష్‌ అయితే C.. 
మార్క్రమ్‌ అయితే D అని కామెంట్‌ చేయండి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement