
టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్ దులిప్ ట్రోఫీ-2024 ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా అతడు ఇండియా-డి జట్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. అతడి స్థానంలో మరో భారత వికెట్ కీపర్ బ్యాటర్ టీమ్‌లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సెంచరీతో కదం తొక్కి
కాగా గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చిన ఇషాన్ కిషన్.. ఆ తర్వాత టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోలేకపోయాడు. రంజీ ట్రోఫీలో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాడు. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇటీవల బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీ బరిలో దిగాడు.
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఈ రెడ్‌బాల్ టోర్నమెంట్‌లో జార్ఖండ్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్ సెంచరీతో అలరించాడు. అయితే, తన జట్టును మాత్రం సెమీస్ రేసులో నిలపలేకపోయాడు. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీ సందర్భంగానే ఇషాన్‌కు గాయమైనట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. ఫలితంగా.. సెప్టెంబరు 5న ఆరంభమయ్యే దులిప్ ట్రోఫీకి అతడు అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది.
సంజూ శాంసన్‌కు చోటు?
ఇషాన్ కిషన్ స్థానంలో కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ ఇండియా-డి జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కాగా సెప్టెంబరు 19 నుంచి టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు సన్నాహకంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తదితర టీమిండియా స్టార్లు దులిప్ ట్రోఫీ బరిలో దిగనున్నారు.
ఇషాన్‌కు తప్పని కష్టాలు
ఈ టోర్నీలో సత్తా చాటి బంగ్లాతో సిరీస్‌కు ఎంపికకావాలని కొందరు.. జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని మరికొందరు పట్టుదలగా ఉన్నారు. అయితే, తీవ్రమైన పోటీనెలకొన్న తరుణంలో ఇషాన్ కిషన్ ఇప్పట్లో రీఎంట్రీ ఇవ్వకపోయినా.. కనీసం సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉండేది. కానీ గాయం తీవ్రతరమైతే అతడు ఈ ఎడిషన్ మొత్తానికి దూరమైతే.. మళ్లీ రంజీ దాకా వేచిచూడాల్సిందే!! ఏదేమైనా ఇషాన్‌కు ఇప్పట్లో కెరీర్ కష్టాల నుంచి విముక్తి లభించేలా కనిపించడం లేదు!!
దులిప్ ట్రోఫీ: బీసీసీఐ ప్రకటించిన ఇండియా-డి జట్టు
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సేన్‌గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.
చదవండి: Duleep Trophy 2024: అనంతపూర్ చేరుకున్న క్రికెటర్లు
Comments
Please login to add a commentAdd a comment