
అదే జోరు...అదే హోరు
♦ శ్రీలంకపై భారత్ గెలుపు
♦ టీమిండియాకు వరుసగా నాలుగో విజయం
♦ రాణించిన దీప్తి శర్మ, మిథాలీ రాజ్
భారత మహిళల జట్టు విజయపరంపర కొనసాగుతోంది. ఓపెనర్లు విఫలమైనా...బ్యాటింగ్‌లో దీప్తి శర్మ, మిథాలీ రాజ్ తమ సూపర్ ఫామ్‌ను చాటారు. బౌలింగ్‌లో జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్ లంక జట్టును దెబ్బతీయడంతో వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మరో ఎదురులేని విజయాన్ని నమోదు చేసింది. వరుసగా నాలుగో విజయంతో భారత్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి.
డెర్బీ: మళ్లీ మిథాలీ సేనదే గెలుపు. ఈ సారి లంకను ఓడించింది. తద్వారా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 232 పరుగులు చేసింది. దీప్తి శర్మ (110 బంతుల్లో 78; 10 ఫోర్లు), మిథాలీ రాజ్ (78 బంతుల్లో 53; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. తర్వాత శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 216 పరుగులే చేసి ఓటమి పాలైంది. దిలాని సురంగిక (75 బంతుల్లో 61; 6 ఫోర్లు) రాణించింది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్, జులన్ గోస్వామి చెరో 2 వికెట్లు తీశారు. దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 8న దక్షిణాఫ్రికాతో ఆడుతుంది.
దీప్తి, మిథాలీ ఫిఫ్టీ–ఫిఫ్టీ...
అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధన (8), పూనమ్ రౌత్ (16) శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. ఈ దశలో కెప్టెన్ మిథాలీ రాజ్... వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ దీప్తి శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచింది. దీప్తి శర్మ 89 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకుంది. మిథాలీ 71 బంతుల్లో అర్ధశతకం సాధించింది. ఈ టోర్నీలో భారత కెప్టెన్‌కిది మూడో ఫిఫ్టీ కాగా కెరీర్‌లో 48వ అర్ధశతకం కావడం విశేషం. కాంచన వేసిన ఇదే ఓవర్లో దీప్తి... ఇనొక రణవీరకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. దీంతో మూడో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివర్లో హర్మన్‌ప్రీత్ కౌర్ (20), వేద కృష్ణమూర్తి (29) ధాటిగా ఆడటంతో భారత్ ప్రత్యర్థి ముందు 233 పరుగుల గౌరవప్రద లక్ష్యాన్ని నిర్దేశించింది.
పోరాడిన సురంగిక...
ఊరించే లక్ష్యమే అయినా లంక టాపార్డర్‌ను పూనమ్ యాదవ్ కట్టడి చేయడంతో ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఓపెనర్ హన్సిక (29), జయాంగని (25)లు పూనమ్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. జులన్ ధాటికి హాసిని (10) ఔటయ్యింది. ఈ దశలో సిరివర్ధనే (37), సురంగిక నాలుగో వికెట్‌కు 60 పరుగులు జోడించి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా... లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: పూనమ్ రౌత్ (సి) జయాంగని (బి) శ్రీపాలి 16; స్మృతి మంధన (సి) సిరివర్ధనె (బి) చండిమా 8; దీప్తి శర్మ (సి) రణవీర (బి) కాంచన 78; మిథాలీ ఎల్బీడబ్ల్యూ (బి) రణవీర 53; జులన్ (సి) జయాంగని (బి) రణవీర 9; హర్మన్‌ప్రీత్ (సి) రణసింఘే (బి) శ్రీపాలి 20; వేద (సి) చండిమా (బి) శ్రీపాలి 29; సుష్మ నాటౌట్ 11, మాన్సి రనౌట్ 2; ఏక్తా బిష్త్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 232.
వికెట్ల పతనం: 1–21, 2–38, 3–156, 4–169, 5–169; 6–219, 7–219, 8–230. బౌలింగ్: శ్రీపాలి 9–2–28–3, చండిమా 10–1–52–1, సిరివర్ధనే 10–1–24–0, రణవీర 10–0–55–2, రణసింఘే 3–0–22–0, కాంచన 8–0–50–1.
శ్రీలంక ఇన్నింగ్స్: హన్సిక (స్టంప్డ్) సుష్మ (బి) పూనమ్ యాదవ్ 29; హాసిని (సి) స్మృతి (బి) జులన్ 10; జయాంగని (బి) పూనమ్ యాదవ్ 25; సిరివర్ధనే (సి) వేద (బి) జులన్ 37; సురంగిక (స్టంప్డ్) సుష్మ (బి) దీప్తి శర్మ 61; కాంచన రనౌట్ 7; శ్రీపాలి (సి) వేద (బి) ఏక్తా బిష్త్ 12; ప్రసాదని నాటౌట్ 21; ఒషది రణసింఘే నాటౌట్ 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 216.
వికెట్ల పతనం: 1–17, 2–57, 3–70, 4–130, 5–143, 6–171, 7–191.
బౌలింగ్: జులన్ 8–2–26–2, మాన్సి 5–0–36–0, దీప్తి శర్మ 10–3–46–1, ఏక్తా 10–0–48–1, హర్మన్‌ప్రీత్ 7–0–33–0, పూనమ్ 10–1–23–2.
శతక్కొట్టిన సారా, బీమోంట్...
బ్రిస్టల్: దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ టామి బీమోంట్ (145 బంతుల్లో 148; 22 ఫోర్లు, 1 సిక్స్), సారా టేలర్ (104 బంతుల్లో 147; 24 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ఇంగ్లండ్ జట్టు 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట ఇంగ్లండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగుల భారీస్కోరు చేసింది. బీమోంట్, సారా టేలర్ రెండో వికెట్‌కు 275 పరుగులు జోడించారు. మహిళల వన్డే క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యంగా రికార్డులకెక్కింది. తర్వాత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసి పోరాడి ఓడింది. మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 159 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై జయభేరి మోగించింది. ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 290 పరుగులు చేయగా... పాక్ 131 పరుగులకే కుప్పకూలింది.