బెయిర్‌స్టోను క్లీన్‌బౌల్డ్ చేసిన అక్షర్‌కు కోహ్లి, పంత్ అభినందన
కొత్త స్టేడియంలో స్పిన్నర్ల బంతులు సుడులు తిరిగాయి. బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేశాయి. స్పిన్‌ది మాయో లేదంటే పిచ్‌దే మంత్రమో కానీ మ్యాచ్ అయితే రెండు రోజులు కూడా పూర్తిగా జరగముందే ఫలితం వచ్చింది. గిరగిరా తిరిగే బంతులకు ఇరు జట్లు దాసోహమనగా...చివరకు ‘లోకల్ బాయ్’ అక్షర్ పటేల్ 11 వికెట్లతో (రెండు ఇన్నింగ్స్‌ల్లో) భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2–1తో టెస్టు చాంపియన్‌షిప్ రేసులో టీమిండియా ముందడుగు వేసింది.
అహ్మదాబాద్: భారత్ స్పిన్‌తో మరో మ్యాచ్ విన్నయ్యింది. డేనైట్ టెస్టును రెండు రోజుల్లోనే ముగించింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ (5/32), అశ్విన్ (4/48) చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 30.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. అంతకు ముందు గురువారం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 53.2 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలడంతో లభించిన 33 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్ ముందు 49 పరుగుల లక్ష్యం నిలిచింది. రోహిత్ శర్మ (25 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) 7.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వికెట్లు తీసిన అక్షర్ పటేల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
46 పరుగులకు 7 వికెట్లు...
రెండో రోజు 99/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్ కేవలం 46 పరుగులే చేసి 7 వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ రహానే (7), రోహిత్ (96 బంతుల్లో 66; 11 ఫోర్లు) ఆట మొదలైన కాసేపటికే నిష్క్రమించగా... తర్వాత వచ్చిన వారి ఆట ఎంతోసేపు సాగనే లేదు. పిచ్ సానుకూలతల్ని వినియోగించుకున్న ఇంగ్లండ్ కెప్టెన్, పార్ట్‌టైమ్ బౌలర్ రూట్ 5 వికెట్లు పడగొట్టడం విశేషం.
మళ్లీ టపటపా
వెంటనే ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ వికెట్లు రాలడంతోనే మొదలైంది. తొలి ఓవర్ వేసిన అక్షర్ మొదటి బంతికి క్రాలీ (0)ని, మూడో బంతికి బెయిర్‌స్టో (0)ను ఔట్ చేశాడు. ఇలా మొదలైన పతనంతో డిన్నర్ బ్రేక్‌కు ముందే ఆలౌటైంది. ఇన్నింగ్స్ మొత్తం మీద బెన్ స్టోక్స్ (25), రూట్ (19), పోప్ (12) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఫోక్స్ (8), లీచ్ (9), ఆర్చర్ (0), అండర్సన్ (0) స్పిన్ ఉచ్చులో తేలిగ్గానే పడిపోయారు. దీంతో రెండో ఇన్నింగ్స్ 81 పరుగుల వద్దే ముగియగా భారత్ 49 పరుగుల లక్ష్యాన్ని అబేధ్యమైన ఓపెనింగ్‌తో ముగించింది.
ఇంగ్లండ్ ఖేల్ ఖతం!
తాజా విజయంతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ మరింత చేరువైంది. చివరి టెస్టులో గెలిస్తే 3–1తో ఫైనల్ చేరగలిగే భారత్, మ్యాచ్ ‘డ్రా’ అయినా సరే 2–1తో ముందంజ వేస్తుంది. మూడో టెస్టులో ఓటమితో సొంత గడ్డపై డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశాలు ఇంగ్లండ్ చేజార్చుకుంది. ఆ జట్టుకు ఇక ఎలాంటి అవకాశం లేదు. అయితే చివరి టెస్టులో ఇంగ్లండ్ గెలిస్తే 2–2తో సిరీస్ ముగుస్తుంది. అప్పుడు ఇంగ్లండ్‌తో పాటు భారత్‌ను కూడా వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 112
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) లీచ్ 66; గిల్ (సి) క్రాలీ (బి) ఆర్చర్ 11; పుజారా (ఎల్బీ) (బి) లీచ్ 0; కోహ్లి (బి) లీచ్ 27; రహానే (ఎల్బీ) (బి) లీచ్ 7; పంత్ (సి) ఫోక్స్ (బి) రూట్ 1; అశ్విన్ (సి) క్రాలీ (బి) రూట్ 17; సుందర్ (బి) రూట్ 0; అక్షర్ (సి) సిబ్లీ (బి) రూట్ 0; ఇషాంత్ నాటౌట్ 10; బుమ్రా (ఎల్బీ) (బి) రూట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (53.2 ఓవర్లలో ఆలౌట్) 145.
వికెట్ల పతనం: 1–33, 2–34, 3–98, 4–114, 5–115, 6–117, 7–125, 8–125, 9–134, 10–145.
బౌలింగ్: అండర్సన్ 13–8–20–0, బ్రాడ్ 6–1–16–0, ఆర్చర్ 5–2–24–1, లీచ్ 20–2–54–4, స్టోక్స్ 3–0–19–0, రూట్ 6.2–3–8–5.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) అక్షర్ 0, సిబ్లీ (సి) పంత్ (బి) అక్షర్ 7; బెయిర్‌స్టో (బి) అక్షర్ 0; రూట్ (ఎల్బీ) (బి) 19; స్టోక్స్ (ఎల్బీ) (బి) అశ్విన్ 25; పోప్ (బి) అశ్విన్ 12; ఫోక్స్ (ఎల్బీ) (బి) అక్షర్ 8; ఆర్చర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 0; లీచ్ (సి) రహానే (బి) అశ్విన్ 9; బ్రాడ్ నాటౌట్ 1; అండర్సన్ (సి) పంత్ (బి) సుందర్ 0; మొత్తం (30.4 ఓవర్లలో ఆలౌట్) 81.
వికెట్ల పతనం: 1–0, 2–0, 3–19, 4–50, 5–56, 6–66, 7–68, 8–80, 9–80, 10–81.
బౌలింగ్: అక్షర్ 15–0–32–5, అశ్విన్ 15–3–48–4, సుందర్ 0.4–0–1–1.
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ నాటౌట్ 25; గిల్ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (7.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 49.
బౌలింగ్: లీచ్ 4–1–15–0, రూట్ 3.4–0–25–0.
రూట్, రోహిత్
Comments
Please login to add a commentAdd a comment