Asia Cup 2023: నేపాల్‌ చిత్తు.. సూపర్‌-4కు భారత్‌ | Asia Cup 2023: India beat Nepal by 10 wickets (DLS), qualify for Super 4 stage - Sakshi
Sakshi News home page

Asia Cup 2023: నేపాల్‌ చిత్తు.. సూపర్‌-4కు భారత్‌

Published Tue, Sep 5 2023 5:57 AM | Last Updated on Tue, Sep 5 2023 11:14 AM

Asia Cup 2023: India beat Nepal by 10 wickets, qualify for Super 4 stage - Sakshi

తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌... కాస్త నిరాశపర్చింది. రెండో మ్యాచ్‌లో బౌలింగ్‌ ప్రాక్టీస్‌... ఇది అంతంత మాత్రమే! నేపాల్‌ లాంటి జట్టును కుప్పకూల్చలేకపోయిన టీమిండియా బౌలింగ్‌ వైఫల్యం కనిపించింది... మధ్యలో వాన... అయితే ఎట్టకేలకు సాధికారిక బ్యాటింగ్‌తో ఉత్కంఠ లేకుండా భారత్‌ మ్యాచ్‌ ముగించింది. కుదించిన పోరులో అలవోక విజయంతో ‘సూపర్‌–4’ దశకు ముందంజ వేసింది.   

పల్లెకెలె: ఆసియా కప్‌ రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ పోరులో భారత్‌ 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్‌ షేక్‌ (97 బంతుల్లో 58; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. సోంపాల్‌ కామి (48; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కుశాల్‌ భుర్తేల్‌ (38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

అనంతరం వాన కారణంగా భారత్‌ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. భారత్‌ 20.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 147 పరుగులు చేసి గెలిచింది. రోహిత్‌ శర్మ (59 బంతుల్లో 74 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌ (62 బంతుల్లో 67 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి అజేయంగా జట్టును గెలిపించారు. ఈ విజయంతో భారత్‌ ‘సూపర్‌–4’ దశకు చేరగా, నేపాల్‌ టోర్నీ నుంచి ని్రష్కమించింది.  



కీలక భాగస్వామ్యాలు...
భారత ఫీల్డింగ్‌ వైఫల్యాలను సొమ్ము చేసుకుంటూ నేపాల్‌కు ఓపెనర్లు భుర్తేల్, ఆసిఫ్‌ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 65 పరుగులు భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు పదో ఓవర్లో శార్దుల్‌ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత జడేజా తన బౌలింగ్‌లో 11 పరుగుల వ్యవధిలోనే తర్వాతి 3 వికెట్లు పడగొట్టి నేపాల్‌ను దెబ్బ కొట్టాడు. మరో ఎండ్‌లో ఆసిఫ్‌ 88 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అయితే కొద్ది సేపటికే ఆసిఫ్‌తో పాటు గుల్షన్‌ (23)ను సిరాజ్‌ పెవిలియన్‌ పంపించడంతో నేపాల్‌ 144/6 వద్ద నిలిచింది. ఈ దశలో సోంపాల్, దీపేంద్ర సింగ్‌ (29; 3 ఫోర్లు) ఆరో వికెట్‌కు 50 పరుగులు జత చేయడంతో పరిస్థితి మెరుగైంది. హార్దిక్‌ ఈ పార్ట్‌నర్‌íÙప్‌ను విడగొట్టినా... చివర్లో చెలరేగి ఆడిన సోంపాల్‌ నేపాల్‌ స్కోరును 200 దాటించాడు. ఛేదనలో టీమిండియాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ఓపెనర్లు రోహిత్, గిల్‌ తమదైన శైలిలో స్వేచ్ఛగా, అలవోకగా షాట్లు ఆడి జట్టును గెలుపు దిశగా నడిపించారు.  

వాన అడ్డు పడుతూ...
మ్యాచ్‌లో నాలుగుసార్లు వర్షం ఆటకు అంత రాయం కలిగించింది. నేపాల్‌ ఇన్నింగ్స్‌ సమయంలో 30 ఓవర్ల తర్వాత, 34 ఓవర్ల తర్వాత వాన కురిసింది. అయితే ఈ రెండు సందర్భాల్లో పెద్దగా ఇబ్బంది రాలేదు కానీ 37.5 ఓవర్ల తర్వాత కురిసిన వానతో సరిగ్గా గంటసేపు ఆట ఆగిపోయింది. అయినా సరే ఓవర్ల కోత లేకుండా నేపాల్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. అనంతరం భారత ఇన్నింగ్స్‌లో 2.1 ఓవర్ల తర్వాత వాన పడింది. సుమారు రెండు గంటలు అంతరాయం కలగడంతో చివరకు భారత్‌ ఇన్నింగ్స్‌ను కుదించి లక్ష్యాన్ని సవరించారు.  

ఇదేమి ఫీల్డింగ్‌?
సునాయాస క్యాచ్‌లు వదిలేయడం, మిస్‌ఫీల్డింగ్, రనౌట్‌ అవకాశాలు చేజార్చడం, ఓవర్‌త్రోలు... ఇవన్నీ సోమవారం భారత ఫీల్డింగ్‌లో కనిపించాయి. మైదానంలో మన ఆటగాళ్లు ఇంత పేలవంగా కనిపించడం ఆశ్చర్యపర్చింది. తొలి 4.2 ఓవర్లు ముగిసేసరికి భారత ఆటగాళ్లు మూడు క్యాచ్‌లు వదిలేశారు. షమీ బౌలింగ్‌లో భుర్తేల్‌ ఇచ్చిన క్యాచ్‌లను శ్రేయస్, కిషన్‌ వదిలేయగా, సిరాజ్‌ బౌలింగ్‌లో ఆసిఫ్‌ క్యాచ్‌ను కోహ్లి వదిలేశాడు. చివర్లో సోంపాల్‌ క్యాచ్‌నూ కిషన్‌ అందుకోలేకపోయాడు.

స్కోరు వివరాలు  
నేపాల్‌ ఇన్నింగ్స్‌: కుశాల్‌ భుర్తేల్‌ (సి) కిషన్‌ (బి) శార్దుల్‌ 38; ఆసిఫ్‌ (సి) కోహ్లి (బి) సిరాజ్‌ 58; భీమ్‌ (బి) జడేజా 7; పౌడేల్‌ (సి) రోహిత్‌ (బి) జడేజా 5; కుశాల్‌ మల్లా (సి) సిరాజ్‌ (బి) జడేజా 2; గుల్షన్‌ (సి) కిషన్‌ (బి) సిరాజ్‌ 23; దీపేంద్ర సింగ్‌ (ఎల్బీ) (బి) పాండ్యా 29; సోంపాల్‌ (సి) కిషన్‌ (బి) షమీ 48; లమిచానే (రనౌట్‌) 9; కరణ్‌ (నాటౌట్‌) 2; రాజ్‌భన్సీ (బి) సిరాజ్‌ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (48.2 ఓవర్లలో ఆలౌట్‌) 230.
వికెట్ల పతనం: 1–65, 2–77, 3–93, 4–101, 5–132, 6–144, 7–194, 8–228, 9–229, 10–230.
బౌలింగ్‌: షమీ 7–0–29–1, సిరాజ్‌ 9.2–1–61–3, పాండ్యా 8–3–34–1, శార్దుల్‌ 4–0–26–1, జడేజా 10–0–40–3, కుల్దీప్‌ 10–2–34–0.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (నాటౌట్‌) 74; గిల్‌ (నాటౌట్‌) 67; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 147.
బౌలింగ్‌: కరణ్‌ 4–0–26–0, సోంపాల్‌ 2–0–23–0, రాజ్‌భన్సీ 4–0–24–0, సందీప్‌ లమిచానే 4–0–39–0, దీపేంద్ర సింగ్‌ ఐరీ 2–0–12–0, కుశాల్‌ మల్లా 3–0–11–0, గుల్షన్‌ 1.1–0–11–0.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement