ఏడు వికెట్లతో చెలరేగిన భారత పేసర్‌.. 52 పరుగులకే ప్రత్యర్థి ఆలౌట్‌ | U19 Asia Cup 2023 Raj Limbani 7-Wicket Haul: India Thumping Win Over Nepal - Sakshi
Sakshi News home page

U19 Asia Cup 2023: ఏడు వికెట్లతో చెలరేగిన పేసర్‌.. భారత్‌ ఘన విజయం

Published Tue, Dec 12 2023 3:37 PM | Last Updated on Tue, Dec 12 2023 4:02 PM

U19 Asia Cup 2023 Raj Limbani 7 Wicket Haul: India Thumping Win Over Nepal - Sakshi

ఏడు వికెట్లతో చెలరేగిన రాజ్‌ లింబాని.. భారత్‌ ఘన విజయం(PC: ACC X)

ACC U19 Asia Cup, 2023- India U19 vs Nepal U19: అండర్‌-19 ఆసియా కప్‌-2023 టోర్నీలో భారత యువ జట్టు ఘన విజయం సాధించింది. నేపాల్‌ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసి సెమీస్‌ రేసులో ముందుకు దూసుకెళ్లింది. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గ్రూప్‌-‘ఏ’లో ఉన్న భారత్‌ తొలుత అఫ్గనిస్తాన్‌తో తలపడింది.

ఈ మ్యాచ్‌లో అఫ్గన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ఉదయ్‌ సహారన్‌ సేన.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీస్‌ చేరాలంటే.. లీగ్‌ దశలో తమ ఆఖరి మ్యాచ్లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది.

ఏడు వికెట్లతో చెలరేగిన రాజ్‌ లింబాని
ఈ నేపథ్యంలో మంగళవారం నేపాల్‌తో తలపడ్డ భారత జట్టు టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. పేసర్‌ రాజ్‌ లింబాని ఏడు వికెట్లతో చెలరేగి నేపాల్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. 9.1 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. లింబానికి తోడుగా.. ఆరాధ్య శుక్లా రెండు, అర్షిన్‌ కులకర్ణి ఒక వికెట్‌తో రాణించారు. ఈ ముగ్గురు అద్భుత ప్రదర్శన కారణంగా.. నేపాల్‌ 22.1 ఓవర్లలోనే చాపచుట్టేసింది.

ఓపెనర్లే పూర్తి చేశారు
భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టును ఓపెనర్లు ఆదర్శ్‌, అర్షిన్‌ కులకర్ణి విజయతీరాలకు చేర్చారు. ఆదర్శ్‌ 13 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలవగా.. అర్షిన్‌ 30 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టి భారత్‌ విజయాన్ని ఖరారు చేశాడు.

ఇక ఈ గెలుపుతో భారత జట్టు సెమీస్‌ బెర్తును అనధికారికంగా ఖాయం చేసుకుంది.  మరోవైపు.. గ్రూప్‌-‘ఏ’లో భాగమైన పాకిస్తాన్‌ మంగళవారం అఫ్గనిస్తాన్‌తో పోటీపడుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ జట్టు 48 ఓవర్లలో 303 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ గెలిస్తే సెమీస్‌ చేరడం లాంఛనమే! దీంతో మరోసారి దాయాదులు భారత్‌- పాక్‌ మ్యాచ్‌ చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది.

చదవండి: Virat Kohli: రాజు ఎక్కడైనా రాజే! టాప్‌లో కింగ్‌ కోహ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement