నాగ్‌పూర్: తడిసిన మైదానంలో ఆలస్యమైన ఆటలో భారత్ 6 వికెట్లతో ఘన విజయం సాధించింది. రెండో టి20లో ఆస్ట్రేలియాపై నెగ్గిన టీమిండియా 1–1తో సమం చేసి... సిరీస్ వేటలో నిలిచింది. వర్షం వల్ల 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ (20 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. ఓపెనర్, కెప్టెన్ ఫించ్ (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. అనంతరం భారత్ 7.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఆటతో గెలిపించాడు. జంపాకు 3 వికెట్లు దక్కాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టి20 ఆదివారం హైదరాబాద్‌లో జరుగుతుంది.
వేడ్ దూకుడు
తక్కువ ఓవర్లు కావడంతో టాస్ నెగ్గగానే భారత కెప్టెన్ రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో కోహ్లి అద్భుత ఫీల్డింగ్‌కు గ్రీన్ (5) రనౌట్ కాగా... అదే ఓవర్లో మ్యాక్స్‌వెల్ (0)ను అక్షర్ బౌల్డ్ చేశాడు. టి20 స్పెషలిస్ట్ హిట్టర్ టిమ్ డేవిడ్ (2)ను కూడా అక్షరే తన తదుపరి ఓవర్లో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ప్రమాదకరమైన బ్యాటర్లిద్దరిని తేలిగ్గా అవుట్ చేసినప్పటికీ కెప్టెన్ ఫించ్, మాథ్యూ వేడ్ ధాటిగా ఆడి స్కోరు పెంచారు. హర్షల్ పటేల్ బౌలింగ్‌నైతే వేడ్ ఉతికి ఆరేశాడు. అతను వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో 2 బౌండరీలతో 12 పరుగులు రాగా... ఆఖరి ఓవర్ (8)లో అయితే చుక్కలే చూపించాడు. డీప్ మిడ్ వికెట్, కవర్స్, డీప్ స్క్వేర్ లెగ్ దిశగా కొట్టిన మూడు సిక్సర్లు ప్రేక్షకుల చేతుల్లో పడ్డాయి. దీంతో ఆ ఒక్క ఓవర్‌లోనే 19 పరుగులు ఇవ్వడంతో ఆస్ట్రేలియా 91 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
బ్యాటింగ్ జోరు...
హాజల్‌వుడ్ తొలి ఓవర్లోనే రోహిత్ 2, రాహుల్ ఒక సిక్సర్ బాదేయడంతో 20 పరుగుల వచ్చాయి. ఇద్దరు పుల్, హెలికాప్టర్ షాట్‌లతో దంచేశారు. కమిన్స్ వేసిన రెండో ఓవర్లో ‘హిట్‌మ్యాన్’ హుక్ షాట్‌తో మరో సిక్స్ కొట్టాడు. మూడో ఓవర్లో స్పిన్నర్ జంపాను దింపగా అతనికి సిక్సర్ ధాటిని చూపాడు. ఈ ఓవర్లో రాహుల్ (10)ను అవుట్ చేసిన జంపా తన మరుసటి ఓవర్లో కోహ్లి (11)ని, సూర్యకుమార్ (0)ను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. మరోవైపు రోహిత్ తన పనిని బౌండరీలతో యథేచ్చగా కానిచ్చేయడంతో జట్టు లక్ష్యం వైపు సాగింది. హార్దిక్ పాండ్యా (9) అవుటైనా... ఆఖరి ఓవర్లో 10 పరుగులు అవసరమైన దశలో దినేశ్ కార్తీక్ రెండు బంతుల్లోనే సిక్స్, ఫోర్ల తో ముగించాడు. దీంతో 4 బంతులు మిగిలుండగానే భారత్ లక్ష్యాన్ని చేరుకుంది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (బి) బుమ్రా 31; గ్రీన్ రనౌట్ 5; మ్యాక్స్‌వెల్ (బి) అక్షర్ 0; డేవిడ్ (బి) అక్షర్ 2; వేడ్ నాటౌట్ 43; స్మిత్ రనౌట్ 8; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (8 ఓవర్లలో 5 వికెట్లకు) 90.
వికెట్ల పతనం: 1–14, 2–19, 3–31, 4–46, 5–90.
బౌలింగ్: పాండ్యా 1–0–10–0, అక్షర్ 2–0–13–2, చహల్ 1–0–12–0, బుమ్రా 2–0–23–1, హర్షల్ 2–0–32–0.
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) జంపా 10; రోహిత్ నాటౌట్ 46; కోహ్లి (బి) జంపా 11; సూర్యకుమార్ (ఎల్బీ) (బి) జంపా 0; పాండ్యా (సి) ఫించ్ (బి) కమిన్స్ 9; దినేశ్ కార్తీక్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (7.2 ఓవర్లలో 4 వికెట్లకు) 92.
వికెట్ల పతనం: 1–39, 2–55, 3–55, 4–77.
బౌలింగ్: హాజల్‌వుడ్ 1–0–20–0, కమిన్స్ 2–0–23–1, జంపా 2–0–16–3, సామ్స్ 1.2–0–20–0, అబాట్ 1–0–11–0.
IND vs AUS 2nd T20: భారత్ గెలుపు మెరుపులు
Published Sat, Sep 24 2022 4:16 AM | Last Updated on Sat, Sep 24 2022 10:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment